Devil in Mulugu : ములుగు జిల్లా జంగాలపల్లిలో దెయ్యం భయం.. 2 నెలల్లో 20 మంది మృతి!
Devil in Mulugu : అది ప్రశాంతమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏం జరిగిందో ఏమో.. అలాంటి గ్రామంలో కేవలం 2 నెలల్లోనే 20 మంది చనిపోయారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి దెయ్యం భయం పట్టుకుంది. దీంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. జంగాలపల్లిలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులు చెబుతున్నారు. కేవలం 2 నెలల కాలంలో 20 మంది వరకు మరణించారని అంటున్నారు. చనిపోయిన వారంతా దెయ్యానికి బలయ్యారు నమ్ముతున్నారు.
గ్రామానికి కీడు సోకిందని.. కీడు నివారణకు గ్రామ దేవతలకు, బొడ్రాయికి పూజలు చేయాలని చర్చించుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మరణం తప్పదని భావిస్తున్న కొంతమంది ఊరి నుంచి విడిచివెళ్తున్నారు. ఇలా ఊరి విడిచి వెళ్తున్న వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు. గ్రామం నుంచి ఎవరు ఆసుపత్రికి వెళ్లినా.. శవంగానే తిరిగి వస్తున్నారని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు.
గతనెల రెండో వారం నుంచి ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 20 మంది చనిపోయారని.. అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందరూ జ్వరం బారిన పడి ప్రాణాలు వదిలేశారని అంటున్నారు.నాలుగైదు రోజులకు ఒకరు గ్రామంలో మృతి చెందుతున్నారని, ఏ క్షణంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
ఇంత జరుగుతున్నా తమ గ్రామానికి ఎవరూ రావడం లేదని ప్రజలు చెబుతున్నారు. 20 మంది చనిపోయినా మంత్రి సీతక్క ఇప్పటివరకు రాలేదని అంటున్నారు. అటు అధికారులు కూడా ఈ గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదని చెబుతున్నారు. జ్వరాలకు కారణం ఏంటనే దానిపై ఎవరూ దృష్టిపెట్టడం లేదని.. అందుకే ఊరి విడిచి వెళ్లిపోతున్నట్టు చెబుతున్నారు.
గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి.. రక్త నమూనాలు సేకరించి జ్వరాలకు కారణం ఏంటో చెప్పాలని ములుగు జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేకపోతే మూఢ నమ్మకాలతో జంగాలపల్లి గ్రామం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేస్తున్నారు.