Pressure Cooker: నిర్లక్ష్యంగా ఉంటే ‘కుక్కర్.. యమ డేంజర్’: ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి
Pressure Cooker Tips: ప్రెజర్ కుక్కర్ ప్రతీ రోజు వాడుతున్నా.. ఎప్పుడో ఒకసారి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కుక్కర్ పేలి ఎగిరే రిస్క్ ఉంటుంది. అందుకే కుక్కర్ వాడే విషయంలో నిరంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
ప్రెజర్ కుక్కర్‌లో వంట త్వరగా, సులువుగా అవుతుంది. అందుకే దాదాపు ప్రతీ ఇంట్లో కుక్కర్ వాడుతుంటారు. రకరకాల వంటల కోసం రెగ్యులర్‌గా వినియోగిస్తుంటారు. అయితే, రోజూ వాడేదే కదా అని దీని విషయంలో ఎప్పుడైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే రిస్క్ కూడా ఉంటుంది. స్టవ్‍పై ఉన్న కుక్కర్ వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు గతంలో చాలా జరిగాయి. అందుకే ప్రెజర్ కుక్కర్ వాడే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. జాగ్రత్తలు వహిస్తూ కుక్కర్ వాడితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
బలవంతంగా తీయొద్దు
ప్రెజర్ కుక్కర్‌పై మూతను ఎప్పుడూ బలవంతంగా తీయకూడదు. తొందరలో ఉన్నా హడావుడిగా మూత ఓపెన్ చేసేయకూడదు. స్టవ్ నుంచి దించేసిన తర్వాత కూడా కుక్కర్‌లో ఇంకా ప్రెజర్, స్ట్రీమ్ కాసేపు అలానే ఉంటుంది. అందుకే ఆ సమయంలో బలవంతంగా మూత తీయకూడదు. ముందుగా, విజిల్‍ను ఎత్తి లోపల ఉన్న ఆవిరి అంతా బయటికి వెళ్లనివ్వాలి. ఆ తర్వాత మూత తీస్తే సేఫ్‍గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పూర్తిగా నింపేయవద్దు
ఒక్కోసారి కుక్కర్‌లో ఎక్కువగా నింపేసి వండేస్తుంటారు. మోతాదుగా మించి కుక్కర్‌ను ఫిల్ చేస్తారు. ఇలా చేయడం ప్రమాదమే. అందుకే కుక్కర్‌లో ఎప్పుడైనా ముప్పావు భాగమే నింపాలి. పావు భాగం ఖాళీగా ఉండాలి. ముప్పావు కంటే ఎక్కువగా నింపేస్తే వెంట్ బ్లాక్ అవుతుంది. దీంతో ఆవిరి బయటికి వచ్చేందుకు అవకాశం లేక.. అది పేలిపోయే రిస్క్ పెరుగుతుంది.
ఎక్కువగా హీట్ చేయడం
అవసరానికి మించి మరీ ఎక్కువ సమయం స్టవ్‍పై ప్రెజర్ కుక్కర్ పెట్టకూడదు. వీలైనంత వరకు వంటకం పూర్తయ్యాక దించుకుంటేనే మేలు. కాసేపు ఉంచుకున్నా పర్వాలేదు. కానీ వంటకం అయినా స్టవ్ కట్టేయకుండా ఉంటే హీట్ ఎక్కువై కుక్కర్ పేలే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మంటపై కుక్కర్‌ను పెడితే లోపల ప్రెజర్ పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల పేలుడు రిస్క్ ఉంటుంది.
నీరు తక్కువ వద్దు
ప్రెజర్ కుక్కర్‌లో వండేందుకు కావాల్సిన దాని కంటే నీరు తక్కువగా వేయడం కూడా సరికాదు. ఎప్పుడు తగినంత నీరు ఉండాల్సిందే. చాలా తక్కువ నీటితో కుక్కర్‌లో వండాలని చూస్తే లోపల ప్రెజర్ భారీగా పెరిగిపోతుంది. దీంతో పేలిపోయే రిస్క్ అధికంగా ఉంటుంది. అలాగే కుక్కర్‌లో చాలా ఎక్కువగా నూనె పోసి వండినా ప్రమాదమే. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఎప్పుడైనా నాణ్యతగా ఉండే ప్రెజర్ కుక్కర్ కుక్కర్ కొనడం చాలా ముఖ్యం. అలాగే వాడిన ప్రతీసారి పూర్తిస్థాయిలో దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కుక్కర్‌కు ఏదైనా డ్యామేజ్ జరిగితే దాన్ని వాడకూడదు. విజిల్ లేకుండా ఎప్పుడూ దాంట్లో వండకూడదు. కుక్కర్‌కు ఉండే రబ్బర్ వాచర్లు, సేఫ్టీ వాల్వ్ సరిగా ఉన్నాయో లేదో ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పాడైతే ఆలస్యం చేయకుండా మార్చేయాలి. సరిగా ఉండేనే వండాలి. అన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రెజర్ కుక్కర్‌తో సేఫ్‍గా వంట చూసుకోవచ్చు.
టాపిక్