Achaleshwar Temple: ఈ ఆలయంలో శివ లింగం రోజుకి మూడు సార్లు రంగు మారుస్తుందట- ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం
Achaleshwar Temple: రాజస్థాన్ లోని అచలేశ్వర్ ఆలయం విజ్ఞాన ప్రపంచానికి సవాలు విసురుతుంది. ఈ ఆలయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
పురాతన ఆలయాలకు భారతదేశం ప్రసిద్ధి గాంచింది. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రతేకత నెలకొని ఉంటుంది. కొన్ని ఆలయాలు అద్భుతమైనవి, అంతుచిక్కని మహిమలకు ప్రసిద్ధి. అలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన శివాలయం మన దేశంలో ఉంది. అదే రాజస్థాన్ రాష్ట్రంలోని అచలేశ్వర మహా దేవాలయం. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుత ఆధునిక యుగానికి ఒక సవాలుగా మారింది. ఈ ఆలయంలో పరమేశ్వరుడి లింగ రూపం రోజుకు మూడు సార్లు రంగు మారుస్తుందట. దీనివెనకున్న ఆంతర్యం ఏంటి లింగం ఎప్పుడెప్పుడు రంగులు మారుస్తుంది వంటి ఆశ్చర్యకరమైన విషయాలను గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఉన్న అచలేశ్వర మహాదేవ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. అచల్ గఢ్ కోట శివార్లలో ఉన్న ఈ ఆలయాన్ని 1452లో పునరుద్దరించారని స్థల పురాణం పేర్కొంది. ఇక్కడి శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతుండటం విశేషం. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే ఈ ఆలయంలోని శివ లింగం ఎరుపు రంగులో కనిపిస్తుంది. మధ్యాహ్నం కాగానే కాషాయ రంగులోకి మారుతుంది. మళ్లీ సూర్యస్తమయం కాగానే నలుపు రంగులోకి మారిపోతుంది. అచలేశ్వర ఆలయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ శివలింగం కదులుతూ ఉంటుంది. శివలింగం రంగులు మార్చడం, కదులుతూ ఉండం వెనకున్న ఆంతర్యం ఏంటని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేటికీ దీనికి సమాధానం దొరకకపోవడం ఆశ్చర్యకరం.
ఈ ఆలయంలో పంచభూతాలతో చేసిన నాలుగు టన్నుల నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడి విగ్రహాల తయారీకి ఉపయోగించే మిశ్రమంలో బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ ఉంటాయని ఆలయ పురాణాల్లో పేర్కొన్నారు. అచలేశ్వర ఆలయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఆలయం శివుడి బొటనవేలు చుట్టే నిర్మించారట. గుడిలోపల ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అందులో బొటన వేలు ఆకారంలో ఓ రాయి ఉంటుంది. అది శివుడి బొటన వేలని ఈ ఆలయం శివుడి బొటన వేలు చుట్టే నిర్మించారనీ చెబుతారు. అంతేకాదు ఈ ఆలయ గోపురం న్యూక్లియర్ రియాక్టర్ ను పోలి ఉంటుందట. ఇక్కడ విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాదనీ స్వయంభుగా వెలిసిన మహిహాత్మకమ విగ్రహాలెన్నో ఈ ఆలయంలో ఉన్నాయని ఆలయం గ్రంథాలు చెబుతున్నాయి. ఆలయంలో ఉండే గొయ్యి నరకానికి ముందు ద్వారం అని అందరూ నమ్ముతారు. సమీపంలోని మూడు పెద్ద రాతి గేదెల విగ్రహాలను రాక్షసుల ప్రతినిధులుగా భావిస్తారు.
ధోల్ పూర్ ప్రాంత ప్రజలు చెప్పిన పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహాలపై హిందూ వ్యతిరేకులు దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు నంది విగ్రహం ఈ శివాలయాన్ని రక్షించేందుకు పెద్ద మొత్తంలో తేనె టీగలను విడుదల చేసింది. అప్పుడు విగ్రహాలను హరించడానికి వచ్చిన వారు ప్రాణాలకు భయపడి పారిపోయారు. ఇక్కడి విగ్రహాలు స్ఫటిక రాతితో చెక్కినవి. ఇవి పగటిపూట సూర్యరశ్మిలో పారదర్శకంగా కనిపిస్తాయి. కాంతి ప్రవహించినప్పుడు స్ఫటికం పారదర్శకంగా మారుతుంది.
ఇంతటి మహిమలు కలిగి అచలేశ్వర మహాలయానికి వచ్చిన వారికి, భక్తి శ్రద్ధలతో ఇక్కడి శివుడిని ఆరాధించినవారికి శాంతి శ్రేయస్సులతో పాటు ఆరోగ్యం ఆనందం దక్కుతాయని నమ్మిక. ముఖ్యగా శివరాత్రి, చిత్తపూర్ణిమ వంటి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.
గమనిక: ఇది ప్రబలమైన మత విశ్వాసాలపై ఆధారపడిన రచన మరియు పాఠకులకు తెలియజేయడానికి మాత్రమే ప్రచురించబడింది.
టాపిక్