Yoga Myths: యోగా గురించి మీలో ఈ 5 అపోహలు ఉన్నాయా? నిజాలు తెలుసుకోండి
Yoga Myths: యోగా గురించి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. కొన్ని అపోహలు ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. అయితే, యోగా గురించి ఎక్కువగా ఉన్న 5 అపోహల గురించి అసలు వాస్తవాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చాలా లాభాలు కలుగుతాయి. అయితే, యోగా వల్ల ప్రయోజనాలు తెలిసినా కొన్ని అపోహలతో కొందరు వెనకడుగు వేస్తుంటారు. యోగా చేసేందుకు సందేహిస్తుంటారు. యోగా గురించి కొన్ని అపోహలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వీటి వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. అయితే, యోగా విషయంలో ఉన్న 5 అపోహలపై అసలు నిజాలు ఇక్కడ చూడండి.
శరీరం బాగా సాగేలా ఉంటేనే..
శరీరం బాగా సాగేలా ఫ్లెక్సిబుల్‍గా ఉంటేనే యోగా చేయగలమనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇది వాస్తవం కాదు. యోగా సాధన చేస్తూ ఉంటే రకరకాల ఆసనాలు అలవాటు అవుతాయి. అన్ని ఆసనాలకు శరీరం ఎక్కువ ఫ్లెక్సిబుల్‍గా ఉండాల్సిన అవసరం లేదు. శరీర పరిస్థితులకు తగ్గట్టుగా చేసేందుకు యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. వాటితో ముందుగా యోగా మొదలుపెట్టాలి. ఆ తర్వాత కష్టమైన ఆనసాలు కూడా సులువు అనిపిస్తాయి.
మతానికి అనుకుంటూ..
యోగా అనేది ఓ మతానికి సంబంధించిందనే భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ భావన నిజం కాదు. యోగాలో ఆధ్యాత్మిక ఉన్నా.. అది ఏ మతానికి పరిమితమైనది కాదు. యోగా చేస్తున్నప్పుడు కొందరు కొన్ని మంత్రాలను పఠిస్తుంటారు. అయితే, ఇది కచ్చితమేం కాదు. యోగా చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైన విషయాలను తలుచుకోవచ్చు. నిశ్శబ్దంగానూ సాధన చేయవచ్చు. మొత్తంగా యోగా మతపరమైనది కాదని మాత్రం గుర్తుంచుకోవాలి.
సన్నగా ఉన్న వారి కోసమే..
శరీరం సన్నగా ఉన్న వారి కోసమే యోగా అనే భావన కూడా విస్తృతంగా ఉంది. సోషల్ మీడియాలో తిరిగే ఫొటోల్లో యోగా చేసే వారి శరీర ఆకృతి సన్నగా ఉంటుంది. దీంతో యోగా చేయాలంటే శరీరం అలాగే ఉండాలేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే, అది సరైనది కాదు. యోగా అనేది అందరూ చేయవచ్చు. శరీర ఆకృతి ఎలా ఉన్నా యోగా సాధన చేయాలి. వయసుతో సంబంధం లేకుండా కూడా యోగా చేయవచ్చు. ఎవరికి తగ్గ ఆసనాలను వారు ఎంపిక చేసుకోవచ్చు.
యోగా కష్టమనుకుంటూ..
యోగాసనాలు వేయడం కష్టమని చాలా మంది అనుకుంటారు. అందుకే దీన్ని చేయడం అసలు ఆరంభించరు. అయితే, యోగా కష్టమైన విషయం కాదు. ఆరంభంలో వేసేందుకు సులువైన ఆసనాలు కూడా ఉంటాయి. క్రమంగా ప్రాక్టీస్ చేస్తుండాలి. దీంతో కష్టమైన ఆసనాలను కూడా వేయడం కొన్నాళ్లకు అలవాటు అవుతుంది. అందుకే యోగా చేయని వారు ఎలాంటి సందేహాలు లేకుండా వెంటనే మొదలుపెట్టేయండి.
ఆసనాలన్నీ ఒకేలా..
యోగాలో ఆసనాలు అన్నీ ఒకేలా ఉంటాయనే అపోహ కూడా చాలా మందికి ఉంటుంది. అయితే, అది ఏ మాత్రం నిజం కాదు. యోగాలో ప్రతీ ఆసనం విభిన్నంగా ఉంటుంది. అనేక రకాల ఆసనాలు ఉంటాయి. చూసేందుకు కొన్ని దగ్గరదగ్గరగా ఉన్నా.. డిఫరెంట్‍గా ఉంటాయి. విభిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. శరీరంతో పాటు మనసుకు కూడా ఆరోగ్యాన్ని కల్పిస్తాయి.
టాపిక్