Toys for Toddlers: పిల్లలు బోర్లాపడటం, పాకటం చేయట్లేదా? టమ్మీ టైం లో ఈ బొమ్మలు వాడితే ఫలితం
Toys for Toddlers: పిల్లలు బోర్లా పడటానికి టమ్మీ టైం చాలా ముఖ్యం. రోజూ కాసేపయినా పిల్లలను అలా బోర్లా పడుకోబెట్టి ఉంచాలని వైద్యుల సూచన. ఆ టమ్మీ టైంలో పిల్లలు ఏడవకుండా కొన్ని బొమ్మలు ఉపయోగపడతాయి. అవేంటో చూడండి.
పుట్టినప్పటి నుంచి రెండు మూడు నెలల వయసున్న పసి పిల్లలకు కూడా టమ్మీ టైమ్ చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలను పొట్టమీద బోర్లా పడుకోబెట్టడమే టమ్మీ టైమ్. పిల్లలు నాలుగైదు నెలలు దాటుతున్నా బోర్లా పడకపోతే ఈ టమ్మీ టైం సహాయపడుతుంది. బోర్లాపడేలా చేస్తుంది. టమ్మీ టైం వల్ల పిల్లల శరీర పైభాగంలో ఉన్న మెడ, ఛాతీ, భుజాల భాగంలో కండరాలు బలపడాతాయి.
అలాగే ఎప్పుడూ వెల్లకిలా పడుకుని ఉండటం వల్ల వచ్చే ఫ్లాట్ హెడ్ సమస్య.. అంటే తల వెనక వైపు గుండ్రంగా కాకుండా కాస్త సమాంతరంగా మారిపోతుంది. ఈ సమస్య కూడా తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు తొందరగా బోర్లా పడటం, పాకడం నేర్చుకునేలా సాయం అవుతుంది.
కానీ పిల్లలు ఎక్కువ సేపు టమ్మీ టైం లో ఉండటానికి ఇష్టపడరు. వెంటనే ఏడవడం మొదలుపెడతారు. అలాకాకుండా వాళ్లు టమ్మీ టైం ఇష్టపడేలా చేసేందుకు కొన్ని బొమ్మలు సాయపడతాయి. ఆ బొమ్మల్ని చూస్తూ పిల్లలు బోర్లాపడి ఎక్కువ సేపు ఆడుకుంటారు. అవి వాళ్ల దృష్టిని ఆకర్షిస్తాయి. అవేంటో చూసేయండి.
పిల్లల టమ్మీ టైం పెంచే బొమ్మలు:
1. వాటర్ ప్లే మ్యాట్ (Water play mat):
నీళ్లు నింపి ఉండే ఈ మ్యాట్ మీద పిల్లల్ని బోర్లా పడుకోబెడితే చాలా సేపు ఆడుకుంటారు. ఈ మ్యాట్ లోపల నీళ్లతో పాటూ రంగురంగుల బొమ్మలుంటాయి. పిల్లలు చేత్తో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా అవి కదులుతూ ఉంటాయి. దాంతో చాలా సేపు వాటిని చూస్తూ ఉంటారు. దీనివల్ల చేతులకు, కళ్లకు మధ్య సమన్వయం మెరుగవుతుంది కూడా.
2. ఫ్లూర్ మిర్రర్ (Floor Mirror):
పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు వాళ్ల కళ్ల ముందు ఈ ఫ్లూర్ మిర్రర్ పెట్టాలి. దీంట్లో వాళ్లని వాళ్లు గుర్తుపట్టుకుంటారు. ఏదో బొమ్మ ఉన్నట్లు భావించి అలా చాలా సేపూ చూస్తూ ఉంటారు. దాని వల్ల మెడ కండరాలు బలపడతాయి. టమ్మీ టైం కూడా పెరుగుతుంది. ఈ ఫ్లూర్ మిర్రర్‌తోనే కొన్ని దృష్టిని ఆకర్షించే బొమ్మల షీట్లు కూడా ఉంటాయి. వాటిని మారుస్తూ ఉండొచ్చు. ఇవి ఫ్లాష్ కార్డ్స్ లాగానూ ఉపయోగపడతాయి.
3. హైట్ అడ్జస్టబుల్ బాల్ డ్రాప్ :
ఇది నిలువుగా నాలుగైదు అంతస్తుల్లో ఉండే బొమ్మ. పైన టవర్ భాగంలో ఉండే ఒక బొమ్మ నుంచి బాల్ వస్తే అది దొర్లుతూ కింది వరకు పడుతుంది. ఆ బాల్ పడటాన్ని పిల్లలు అలా గమనిస్తూ ఉంటారు. అలాగే ఆ బాల్ శబ్దం చేస్తూ పడుతుంది కాబట్టి పిల్లలకు అవి కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే ఈ బాల్స్ పిల్లలు నోట్లో పెట్టుకోకుండా కాస్త పెద్ద సైజులోనే ఉంటాయి. దీనివల్ల ఒక వస్తువు ఎలా కదులుతుందనే విషయం పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. మూడు లేదా అంతకన్నా ఎక్కువ నెలల వయస్సున్న పిల్లలకు ఈ బొమ్మ బాగా ఉపయోగపడుతుంది.
4. క్రాలింగ్ క్రాబ్ (Crawling crab):
అటూ ఇటూ తిరిగే ఈ క్రాలింగ్ క్రాబ్ బొమ్మ టమ్మీ టైంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలను బోర్లా పడుకోబెట్టి ముందు ఈ బొమ్మను పెడితే వాళ్లు ఆ బొమ్మ పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. దాంతో పాకడం తొందరగా నేర్చుకుంటారు. ఎక్కువ సేపు టమ్మీ టైం లో ఉండగలుగుతారు.