No Soap: పాత్రలు కడగటానికి సబ్బుకు బదులుగా ఇవీ వాడొచ్చు, 100 శాతం క్లీన్ అవుతాయ్-use these ingredients for utensil cleaning instead of dish wash soaps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Soap: పాత్రలు కడగటానికి సబ్బుకు బదులుగా ఇవీ వాడొచ్చు, 100 శాతం క్లీన్ అవుతాయ్

No Soap: పాత్రలు కడగటానికి సబ్బుకు బదులుగా ఇవీ వాడొచ్చు, 100 శాతం క్లీన్ అవుతాయ్

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2024 02:00 PM IST

No Soap: పాత్రలు శుభ్రం చేసే సబ్బులకు బదులు కొన్ని సహజ పదార్థాలు వాడొచ్చు. వీటితోనూ శుభ్రత సమర్థవంతంగా సాధ్యం అవుతుంది. అవేంటో చూడండి.

సబ్బు వాడకుండా పాత్రలు శుభ్రం చేసే మార్గాలు
సబ్బు వాడకుండా పాత్రలు శుభ్రం చేసే మార్గాలు (freepik)

పాత్రలు శుభ్రం చేయడానికి డిష్‌వాష్ సబ్బులు, లిక్విడ్స్ వాడతాం. అయితే కొంతమందికి వీటివల్ల చేతుల్లో ర్యాషెస్, దురద లాంటివి వస్తుంటాయి. అలాగే సహజంగా పాత్రలు శుభ్రం చేసే మార్గాల కోసం వెతుకుతున్నా కూడా కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. వాటితో జిడ్డుతో పాటూ బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అవేంటో చూడండి.

వంట సోడా:

రెండు మూడు చెంచాల వంటసోడాను ఒక బౌల్ లోకి తీసుకోండి. అందులో నిమ్మరసం పిండండి. నిమ్మరసంతో సోడా ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడందులో స్పాంజి ముంచి పాత్రలు శుభ్రం చేయండి. సోడా ఎంత జిడ్డు మరకల్ని అయినా తొలగిస్తుంది. ఘాటు వాసనల్ని తొలగిండంలో నిమ్మరసం సాయపడుతుంది.

బూడిద:

పాతకాలంలో పాత్రల్ని శుభ్రం చేయడానికి పొయ్యిలో మిగిలిపోయిన బూడిదనే వాడేవాళ్లు. పాత్రల్ని తెల్లగా మెరిపిస్తుంది. మీకు బూడిద అందుబాటులో ఉంటే మాత్రం దాన్ని వాడండి. బూడిద కాస్త తీసుకుని బాగా రుద్దితే మరకలన్నీ తొలిగిపోతాయి.

ఉప్పు:

ఉప్పుకుండే గరుకుతనం వల్ల అది జిడ్డును సులభంగా తొలగిస్తుంది. గిన్నెలో ఉప్పు పోసుకుని నేరుగా దాన్ని రాయడమే. అయితే మసాలా వాసనలు కూడా వదలాలంటే కాస్త గోరువెచ్చని నీళ్లలో ఉప్పు, నిమ్మరసం కూడా కలిపి వాడితే బాగా శుభ్రం అవుతాయి.

కార్న్ స్టార్చ్:

కార్న్‌స్టార్చ్ లేదా మొక్కజొన్న పిండి కూడా బూడిద లాగే పనిచేస్తుంది. దీన్ని కూడా పాత్రల మీద కాస్త చల్లుకుని శుభ్రం చేస్తే సరిపోతుంది. జిడ్డు, వాసనలు వదిలిపోతాయి.

వెనిగర్:

1 కప్పు నీళ్లలో ఐదారు చెంచాల వెనిగర్ వేసి బాగా కలపండి. దీన్ని గిన్నెల మీద స్ప్రేలాగా చేసి ఓ రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత స్క్రబ్బర్ వాడి శుభ్రం చేస్తే చాలు.

డీఐవై క్లీనర్:

2 కప్పుల వేడి నీళ్లలో 2 చెంచాల ఉప్పు వేసి అందులో నిమ్మరసం పిండుకోండి. బాగా కలిపేసి పాత్రల మీద ఈ లిక్విడ్ కాస్త పోసేసి స్క్రబ్బర్‌తో రుద్దేస్తే శుభ్రం అయిపోతాయి. స్క్రబ్బర్ బదులు కొబ్బరి పీచు కూడా వాడొచ్చు.

  • అలాగే పాత్రల్ని శుభ్రం చేయడానికి మైక్రో ఫైబర్ టవెల్ వాడండి. ఇది తడిని బాగా పీల్చుకుంటుంది. మీద మరే అవశేషాలు లేకుండా చూస్తుంది.
  • మీకు మరింత సులభం కావాలంటే నీటిని బాగా మరిగించి ఓ టబ్ లో పోసి అందులో పాత్రల్ని కాసేపు ఉంచాలి. అలా చేస్తే పాత్రలు కడగడం మరింత సులవవుతుంది.
  • అలాగే మీకు రసాయనాలున్న సబ్బు వల్ల చేయికి దురద లాంటివి వస్తే వంద శాతం ఆర్గానిక్ డిష్ సోప్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని కూడా వాడి చూడొచ్చు.

 

 

Whats_app_banner