Ullipaya Karam: కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ కారం రెసిపీ ప్రయత్నించండి, అన్నంలోకి అదిరిపోతుంది
Ullipayam Karam: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు త్వరగా తయారయ్యే ఒక రెసిపీ ఉల్లిపాయ కారం. ఇవి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. దీని తయారీ కూడా చాలా సులువు.
Ullipayam Karam: ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి. తెచ్చుకునే ఓపిక లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకుపోయే వాళ్లు ఎక్కువ. ఇలా కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ కారం ప్రయత్నించండి. ఈ రెసిపీ చాలా సులువు. కూరల కన్నా ఇదే టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఉల్లిపాయ కారం కలుపుకొని తింటే రుచి మామూలుగా ఉండదు. ఇది అన్నంతోనే కాదు ఇడ్లీతో, దోశతో కూడా చాలా బాగుంటుంది. కేవలం 10 నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ఉల్లిపాయ కారం రెసిపీని ప్రయత్నించండి.
ఉల్లిపాయ కారం రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు - మూడు
ఎండుమిర్చి - పది
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
నూనె - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
మెంతులు - పావు స్పూను
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - గుప్పెడు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
నూనె - తగినంత
ఉల్లిపాయ కారం రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, చింతపండు, మెంతులు వేసి వేయించాలి.
3. అన్నీ బాగా వేగాక స్టవ్ కట్టేయాలి.
4. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేయాలి.
5. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.
6. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టాలి.
7. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి నూనె వేయాలి.
8. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలపాలి.
9. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలపాలి.
10. చిన్న మంట మీద ఉంచి దీన్ని కలుపుతూ ఉండాలి.
11. ఉల్లిపాయ మిశ్రమం పైకి నూనె తేలుతుంది. తరువాత స్టవ్ కట్టేయాలి.
12. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే ఆ ఈ రుచి మామూలుగా ఉండదు.
13. దీన్ని ఇడ్లీతో తిన్నా, దోశెలతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ రెసిపీ ముఖ్యంగా ఉల్లిపాయను వాడాము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ పచ్చడి మనకి అన్ని రకాలుగా మేలే చేస్తుంది.ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బయోటిక్ గుణాలు ఎక్కువ. కాబట్టి ఉల్లిపాయ తరచూ తినే వారికి ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తాయి. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం తక్కువే కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు ఉల్లిపాయను తరచూ తినాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారో, నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారో వారు తరచూ ఉల్లిపాయలు తినడం అలవాటు చేసుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఉల్లిపాయలు ఎంతో మంచి చేస్తాయి. వీరు అధికంగా ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా ఉల్లిపాయ కారాన్ని ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు కూడా ఉల్లిపాయ కారాన్ని చక్కగా తినవచ్చు.
టాపిక్