Tomato Pulao: టేస్టీ టమాటా పులావ్... దీన్ని చేయడం చాలా సింపుల్
Tomato Pulao: చాలామందికి టమాటా పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ దీన్ని సరిగ్గా వండడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. టమాట పులావ్ రెసిపీ చాలా సులువు. దీన్ని వండుకుంటే కర్రీలు అవసరం లేదు.
Tomato Pulao: టమాటాలతో చేసే ఆహారం ఏదైనా ఆరోగ్యకరమే. టమాటా పులావ్‌ను ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. అలాగే రాత్రిపూట డిన్నర్లో కూడా టేస్టీగా ఉంటుంది. వేడివేడి టమాటా పులావ్ తింటే రుచి మాములుగా ఉండదు. బ్యాచిలర్స్, వంట సరిగా రానివారు కూడా టమాటో పులావ్ చాలా సులువుగా చేసేయొచ్చు. ఇక్కడ రెసిపి ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోతే టమాట పులావ్ రెడీ అయిపోతుంది.
టమాటా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - నాలుగు
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
బిర్యానీ ఆకు - ఒకటి
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - రెండు
నూనె - తగినంత
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
ధనియాల పొడి - అర స్పూను
బాస్మతి బియ్యం - ఒక కప్పు
నీళ్లు - సరిపడినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - పావు స్పూను
టమాటా పులావ్ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల పాటు ముందే నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించుకోవాలి.
4. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
5. అవి రంగు మారే వరకు వేయించుకోవాలి.
6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
7. తర్వాత పుదీనా తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
8. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి చిన్న మంట మీద వేయించాలి.
9. పైన మూత పెడితే టమాటా ముక్కలు మెత్తగా మగ్గుతాయి.
10. టమాట ముక్కలు మెత్తగా మగ్గాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి.
13. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి.
14. మంటను మధ్యస్థంగా పెట్టి కుక్కర్ మీద మూత పెట్టాలి.
15. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి.
16. ఒక పది నిమిషాలు పాటు ఆవిరి పోయే వరకు వదిలేయాలి.
17. ఆ తర్వాత మూత తీస్తే టేస్టీ టమాటా పులావ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీంతో ఎలాంటి కర్రీ లేకపోయినా తినేయవచ్చు.
టమాటా పులావ్ పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. రాత్రి పూట త్వరగా వండుకుని దీన్ని తినేయవచ్చు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్పైసీగా కావాలనుకునేవారు కాస్త పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇక పిల్లలకు చివర్లో నెయ్యి వేసి ఇస్తే వాళ్లకు రుచిగా ఉంటుంది.