summer sleep tips: వేసవిలో నిద్రలేమి తగ్గించే చిట్కాలివే..
summer sleep tips: వేసవిలో నిద్ర పోవడం కష్టమవుతోందా? అయితే మీ నిద్రను పెంచే కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
వేసవి కాలంలో అలిసి పోయినట్లు, శక్తి లేనట్లు అనిపిస్తుందా? వేసవి ప్రభావం శరీరం మీద చాలా రకాలుగా ఉంటుంది. సరైన నిద్ర రాకపోవడం అందులో ఒకటి. నిద్ర తొందరగా పట్టకపోవడం, మధ్య మధ్యలో మెలకువ రావడం, కొద్దిసేపే పడుకోవడం.. వీటన్నింటి వల్ల మధ్యాహ్నం నిద్రపోవడం, లేదా ఏ పని చేయాలనిపించక పోవడం.. లాంటి లక్షణాలతో ఇబ్బంది పడతాం. వేడి వల్ల, సూర్యాస్తమయం, సూర్యోదయ వేళల్లో మార్పుల వల్ల నిద్ పోయే సమయం, నిద్ర నాణ్యత దెబ్బతింటాయి.
వేసవిలో రాత్రి తొందరగా ముగుస్తుంది. దినం ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో మెలటోనిన్ స్థాయులు చలికాలం కన్నా తక్కువుంటాయి. దీనివల్ల తొందరగా నిద్ర లేస్తాం. తరచూ నిద్రలో మెలకువ రావడం వల్ల ఆందోళన, దిగులు, రోజు మొత్తం నీరసంగా ఉండటం, ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యలొస్తాయి. నిద్ర లేమి సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుందని చాలా సర్వేలు కూడా చెబుతున్నాయని డా. మీనాక్షి అన్నారు.
మంచి నిద్ర కోసం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పడుకునేటప్పుడు కాటన్ వస్త్రాలు వేసుకోండి. వేసవి కాలంలో పాలిస్టర్ వస్త్రాల జోలికి పోకండి. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల నిద్ర తొందరగా పడుతుంది. మీరు పడుకునే గది ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గాలి ప్రసరణ బాగా ఉండాలి.
- సాయంత్రం వేళల్లో ఇంట్లో తక్కువ లైట్లు వేసుకోవాలి, టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు వీలైనంత తక్కువగా వాడాలి.
- ఎక్కువ కేలరీలున్న ఆహారం తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, కెఫీన్ ఉన్న పానీయాలు, కూల్ డ్రింకులు తీసుకోవడం మానేయాలి. అధిక శ్రమ ఉన్న వ్యాయామాలు చేయకూడదు.
- రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే సమయానికి నిద్ర లేవాలి. మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉంటే రాత్రి కాస్త తొందరగా నిద్రపడుతుంది.
- నిద్రలేమి వల్ల ఆందోళన, నిరాశ పెరుగుతుంది. వాటి గురించి పట్టించుకోకపోతే సమస్య ఎక్కువుతుంది. ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించండి.
- నిద్రపోయే ముందు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి. సాయంత్రం వేళల్లో కూడా ఎక్కువ నీళ్లు తాగండి.
- మధ్యాహ్నం పూట కిటికీలు మూసి ఉంచండి. పరదాలు వేసి ఉంచడం వల్ల కాస్త చల్లగా ఉంటుంది. తేమ శాతం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
- నిద్ర పోయేకన్నా కనీసం 3 గంటల ముందు మసాలా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. ఆల్కహాల్ తాగకూడదు.