Thyroid in Men | పురుషుల్లో పెరుగుతున్న థైరాయిడ్ సమస్యలు..నార్మల్ రేంజ్ ఎంత ఉండాలంటే?-thyroid disease increasing in men know optimal thyroid levels for males and ways to control ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid In Men | పురుషుల్లో పెరుగుతున్న థైరాయిడ్ సమస్యలు..నార్మల్ రేంజ్ ఎంత ఉండాలంటే?

Thyroid in Men | పురుషుల్లో పెరుగుతున్న థైరాయిడ్ సమస్యలు..నార్మల్ రేంజ్ ఎంత ఉండాలంటే?

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 11:58 AM IST

Thyroid in Men: థైరాయిడ్ సమస్యల కారణంగా శరీరంలోని చాలా విధులకు ఆటంకం ఏర్పడుతుంది. మగవారిలో థైరాయిడ్ సమతుల్యంగా లేకపోతే అది వారి సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుంది. నార్మల్ రేంజ్ ఎంతో తెలుసుకోండి.

Thyroid in Men
Thyroid in Men (Unsplash)

థైరాయిడ్ గ్రంథి మెడ మధ్య భాగంలో స్వరపేటిక క్రింద, కాలర్ ఎముక పైన ఉంటుంది. ఇది మన శరీరం పనితీరుకు అవసరమైన ముఖ్యమైన అవయవం. థైరాయిడ్ స్రవించే హార్మోన్ల కారణంగానే మానవ శరీరంలో జరిగే జీవక్రియలు, శరీర అభివృద్ధి సక్రమంగా జరుగుతాయి. థైరాయిడ్ అనేక శరీర విధులను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

థైరాయిడ్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే అది మొత్తం శరీర విధులను ప్రభావితం చేస్తుంది. హృదయ స్పందన రేటు, మానసిక స్థితి, శరీరంలో శక్తి స్థాయిలు, జీవక్రియలు, ఎముకల ఆరోగ్యం, గర్భధారణ, శరీర ఉష్ణోగ్రత, కొవ్వును నియంత్రణ ఇలా అనేక అంశాలలో శరీర విధులు గతి తప్పుతాయి.

ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాయిడ్ ఏ మనిషి జీవనశైలిని అయినా మార్చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఉండే ప్రారంభ లక్షణాలు బరువు పెరగడం, అలసట, కండరాల బలహీనత మొదలైనవి ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడ్ అని, అది ఎక్కువగా ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడ్ అని పిలుస్తారు. ఈ రెండూ ప్రమాదమే కాబట్టి సమతుల్యంగా ఉంచుకోవడం కీలకం. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించి తగిన ఔషధాలు తీసుకోకపోతే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

థైరాయిడ్ సమస్యలు మొదట్లో ఎక్కువగా మహిళల్లో మాత్రమే కనిపించేది, ఇప్పుడు పురుషులూ (Thyroid in Men) ఈ సమస్య బారినపడుతున్నారు. ఇందుకు కారణం ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు అని నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ సమస్యల కారణంగా మగ వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం బలహీనపడుతుందని వైద్యులు అంటున్నారు.

Optimal Thyroid Levels for Males- పురుషులలో సాధారణ థైరాయిడ్ స్థాయిలు

పురుషులలో థైరాయిడ్ స్థాయిలు ఏ విధంగా ఉండాలి, సాధారణ స్థాయిలు ఏమిటి? తదితర సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పురుషులలో TSH సాధారణ స్థాయి (సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం) 0.4 mU/L నుండి 4.0 mU/L వరకు ఉంటుంది.

18 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో, TSH స్థాయిలు 0.5 - 4.1 mU/L మధ్య ఉండాలి.

51 నుండి 70 సంవత్సరాల వయస్సు గల పురుషులలో, TSH స్థాయిలు 0.5 మరియు 4.5 mU/L మధ్య ఉండాలి.

70 ఏళ్లు పైబడిన పురుషులలో, TSH స్థాయిలు 0.4 - 5.2 mU/L ఉండాలి.

థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ల స్థాయిని చెక్ చేయడానికి TSH పరీక్ష నిర్వహిస్తారు. TSH సాధారణ స్థాయి 0.4 mU/L నుండి 4.0 mU/L వరకు ఉంటుంది. 2.0 కంటే ఎక్కువ ఉండే TSH స్థాయిని హైపోథైరాయిడ్‌గా పరిగణిస్తారు. అదే థైరాయిడ్ స్థాయి 0.4 mU/L నుండి 4.0 mU/L కంటే తక్కువగా ఉంటే, అది హైపర్ థైరాయిడ్‌గా పరిగణిస్తారు.

Ways to Control Thyroid - థైరాయిడ్‌ నియంత్రణ మార్గాలు

- థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం, అయోడిన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్న సమతుల్యమైన ఆహారం తీసుకోండి.

-ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి, ఆందోళనలను అదుపులో ఉంచుకోవాలి.

- మత్స్యాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, వజ్రాసనం వంటి యోగా ఆసనాలు థైరాయిడ్ సమస్యను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

- పురుషులలో పెరుగుతున్న థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడానికి ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను దూరంగా ఉండాలి.

వైద్యులు సిఫారసు చేసిన ఔషధాలు, సూచనలు తప్పకుండా పాటించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం