Cancer: వామ్మో... ఆ మసాలా బ్రాండ్లలో క్యాన్సర్ కారకాలు, వాటిని వాడే ముందు జాగ్రత్త
Cancer: మనదేశంలో తయారయ్యే కొన్ని రకాల మసాలాలలో క్యాన్సర్ కారకాలైన రసాయనాలు ఉన్నట్టు బయటపడింది. కాబట్టి మనం వాడే ప్రతి ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది.
Cancer: మన దేశం నుంచి కొన్ని మసాలా ఉత్పత్తులు హాంకాంగ్ దేశానికి ఎగుమతి అవుతాయి. తాజాగా హాంకాంగ్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ భారత దేశంలో తయారయ్యే మూడు రకాల మసాలా ఉత్పత్తుల్లో ఇథలీన్ ఆక్సైడ్ అని పిలిచే పురుగుల మందు ఉన్నట్టు కనుగొంది. ఇది క్యాన్సర్ కారకమని తేల్చింది. తమ అధికారిక వెబ్సైట్లో ఇదే విషయాన్ని చెప్పింది. ఇది ఒక షాకింగ్ రిపోర్ట్ అనే చెప్పాలి. కేవలం హాంకాంగ్ మాత్రమే కాదు సింగపూర్ లోని ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. తమ దేశ ప్రజలను భారతదేశం నుండి వచ్చే మసాలా ఉత్పత్తులను వాడొద్దని ప్రజలను హెచ్చరించింది. ఇథలీన్ ఆక్సైడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయని వైద్యులు కూడా నిర్ధారించారు.
ఏ మసాలా బ్రాండ్లు?
మన దేశంలో అతి పెద్ద మసాలా దినుసుల తయారీ కంపెనీలు రెండు ఉన్నాయి. వాటి ఉత్పత్తులు భారీగానే మార్కెట్లో ఉన్నాయి. వీటి నుంచి వచ్చే మసాలా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ బ్రాండ్లకు సంబంధించి నాలుగు రకాల మసాలాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ఇథలీన్ ఆక్సైడ్‌ను... ‘గ్రూప్1 కార్సినోజన్’ గా వర్గీకరించారు. ఇది ఉన్న ఆహారాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పింది.
ఈ మసాలాలు వాడకండి
హాంకాంగ్ ఫుడ్ రెగ్యులరీ అథారిటీ చెప్పిన ప్రకారం ఒక సంస్థకు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా, కరివేపాకు మసాలా పౌడర్, అలాగే మరో సంస్థకు చెందిన ఫిష్ కర్రీ మసాలాలో కూడా ఇథలీన్ ఆక్సైడ్ ఉన్నట్టు చెబుతోంది. అంతేకాదు హాంకాంగ్‌లోని అన్ని షాపుల నుండి ఈ ఉత్పత్తులను తొలగించారు.
ఇక సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఎవరెస్టు సంస్థకు చెందిన ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేయాలని ఆదేశించింది. తమకు ఎవరైతే ఈ ఉత్పత్తులను పంపిస్తారో ఆ సంస్థకు ఉత్పత్తులను రీకాల్ చేయమని ఆదేశించింది.
ఈ మసాలా ఉత్పత్తుల్లో ఇథలీన్ ఆక్సైడ్ తక్కువ స్థాయిలోనే ఉంది. కాబట్టి తిన్న వెంటనే ఎలాంటి ప్రమాదము కలగకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక వినియోగంలో మాత్రం క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడైనా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మసాలా పొడుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఈ మసాలా పొడిని తయారు చేసుకోవడం మంచిది.
అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, దాల్చిన చెక్క లవంగాలు వంటివన్నీ వేసి చేసే మసాలా పొడులను ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. బయటకొనే ఉత్పత్తుల్లో మనకు తెలియకుండానే కొన్ని రకాల రసాయనాలను జోడిస్తున్నారు. ఇవి కొన్ని ఏళ్లపాటు వినియోగిస్తే కొంతమంది క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వచ్చినా కూడా ఆ మసాలా బ్రాండ్లకు చెందిన రెండు సంస్థలు ఇంతవరకు స్పందించలేదు. తమ ఉత్పత్తులను మన దేశంలో రీకాల్ చేయలేదు. ఇప్పటికీ ఇవి మార్కెట్లోనే ఉన్నాయి.