Masala Rice: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకొని చూడండి, తినాలనిపించేలా ఉంటుంది-masala rice recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Rice: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకొని చూడండి, తినాలనిపించేలా ఉంటుంది

Masala Rice: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకొని చూడండి, తినాలనిపించేలా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Published Apr 13, 2024 05:30 PM IST

Masala Rice: మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే పదేపదే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు లేదా నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ మసాలా రైస్‌ను చేసుకొని తింటే మంచిది.

మసాలా రైస్ రెసిపీ
మసాలా రైస్ రెసిపీ

Masala Rice: ఒక్కోసారి నోరు చప్పగా అనిపించి ఏమీ తినాలనిపించదు. మరొకసారి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకుండా అయిపోతాయి. అలాంటి సమయాల్లో లంచ్ లేదా డిన్నర్ కోసం మసాలా రైస్ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీని చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే వండిన అన్నంతోనే దీని తయారు చేస్తాం. కాబట్టి ఇరవై నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది.

మసాలా అన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు

నూనె - రెండు స్పూన్లు

వండిన అన్నం - రెండు కప్పులు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

జీడిపప్పు - గుప్పెడు

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

ఎండుమిర్చి - రెండు

ఉల్లిపాయ తరుగు - అర కప్పు

కరివేపాకులు - గుప్పెడు

తాళింపు దినుసులు - ఒక స్పూను

పల్లీలు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - ఒక స్పూను

టమాటా తరుగు - మూడు స్పూన్లు

పసుపు - పావు స్పూను

ధనియాల పొడి - అర స్పూను

గరం మసాలా - అర స్పూను

మసాలా రైస్ రెసిపీ

1. అన్నాన్ని మీ ముందుగానే వండి పెట్టుకోవాలి. లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా దీన్ని వండుకోవచ్చు.

2. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

3. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు వంటి తాళింపు దినుసులు వేసి వేయించుకోండి.

4. అవి వేగాక వేరుశెనగ పలుకులను, జీడిపప్పులను కూడా వేసి వేయించండి.

5. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి వేసి వేయించండి.

6. నిలువుగా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలను వేసి రంగు మారే వరకు వేయించుకోండి.

7. ఆ తర్వాత పుదీనా, టమాటా తరుగు వేసి వేయించండి.

8. టమాటా ఇగురులాగా అయ్యేవరకు వేయించండి.

9. కరివేపాకు తరుగును, ధనియాల పొడి, గరం మసాలా, పసుపును వేసి కలుపుకోండి.

10. టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక రుచికి సరిపడా ఉప్పును వేయండి.

11. ఈ మొత్తం మిశ్రమం మసాలా రెడీ అయినట్టే.

12. దీనిలో అన్నాన్ని వేసి పులిహోర కలుపుకున్నట్టుగా బాగా కలుపుకోండి.

13. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి.

14. అంతే మసాలా రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

15. నోరు చప్పగా ఉన్నప్పుడు కాస్త ఘాటు ఘాటుగా తగులుతుంది.

మసాలా రైస్‌ను మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ముఖ్యంగా ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ లేదా డిన్నర్‌లో తినేందుకు మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ మసాలా రైస్ రెడీ అయిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ఉన్న చాలు. మిగతావన్నీ ఇంట్లో నిత్యం ఉండేవే కాబట్టి వాటితో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ మసాలా రైస్ తిని చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner