Fasting Rules: ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయాల్సిన పద్ధతి ఇది, ఈ తప్పులు చేయకూడదు
Fasting Rules: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ముఖ్యంగా వ్రతాలు, పండగుల సమయంలో ఉపవాసం ఉంటారు. ఉపవాసం సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.
ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఉపవాసం వల్ల శరీరం శుభ్రపడుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతారు. అయితే, ఉపవాసం చేసేటప్పుడు, కొంతమంది తినడం లేదా త్రాగడానికి సంబంధించిన తప్పులు చేస్తారు. దీని వల్ల మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
ఉపవాసంలో ఇలా చేయద్దు
ఉపవాసం ఉన్నవారు పెరుగుతో మిల్క్ షేక్స్ లేదా పండ్లను తినడానికి ఇష్టపడతారు. కానీ వాస్తవానికి ఇది మీ పొట్టకు హాని కలిగిస్తుంది. పాల ఉత్పత్తులలో కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి పండ్ల కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. కేసైన్ వంటి పండ్లలో ఉండే ఆమ్లాలు, ఎంజైములు… పాల ప్రోటీన్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇది పండ్ల జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. ప్రేగులలో అవాంతరాలను కలిగిస్తాయి. ఇది పొట్ట అనారోగ్యానికి దారితీస్తుంది. దీనికి బదులు పాలు తాగిన రెండు గంటల తరువాత పండ్లు తినాలి. ఇలా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత వండని ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం. సలాడ్లు, వండని కూరగాయలు, పండ్లు వంటి ముడి ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ జీర్ణ శక్తి అవసరం. రాత్రిపూట ఇలాంటివి తింటే పొట్ట ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. అలాంటప్పుడు రోజులో మెటబాలిజం చురుగ్గా ఉన్న కాలంలో… అంటే 12 గంటల నుంచి 4 గంటల మధ్య పండ్లు/సలాడ్స్ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేయించిన ఆహార పదార్థాలు
ఉపవాసం సమయంలో చిప్స్, పూరీ వంటి వేయించిన ఆహార పదార్థాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. గుండె ఆరోగ్యానికి ప్రమాదాన్ని పెంచుతాయి. బదులుగా, మీ ఆహారంలో కొవ్వును తగ్గించడానికి వండిన ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
ఉపవాసం సమయంలో ఎక్కువ చక్కెర తినడం అనారోగ్యకరమైన అలవాటు. ఉపవాసం చేస్తున్నప్పుడు పంచదారతో చేసిన ఎలాంటి ఆహారాలను తినకూడదు. బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, దంత క్షయం వంటి సమస్యలు పెరుగుతాయి. దానికి బదులుగా సహజ చక్కెరతో నిండిన పండ్లను తినండి. అలాగే బెల్లం, తేనెను తక్కువ మోతాదులో తింటే సరిపోతుంది.
హెర్బల్ టీ
ఉపవాసం సమయంలో ఆకలి వేస్తూనే ఉంటుంది. ఇది దాహాన్ని కూడా పెంచుతుంది. దాహాన్ని ఆకలిగా భావించి పండ్లు లాంటివి తినడం జరుగుతుంది. దీనికి బదులుగా, తినాలన్న కోరికను నివారించడానికి తగినంత నీరు త్రాగాలి. రోజులో రెండు మూడు సార్లు హెర్భల్ టీలు తాగాలి.
పైన చెప్పిన నియమాలతో ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.