Sravana masam fasting foods: శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటారా? ఆ రోజు తినాల్సిన ఆహారాలు, తినకూడని ఆహారాలు ఇవే
Sravana masam fasting foods: శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటున్నారా? ఈ సమయంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటివి నివారించాలి అనే విషయాల గురించి తెలుసుకోండి.
Sravana masam fasting foods: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిప్రాతమైనది శ్రావణమాసం. ఈ నెల రోజులు భక్తులు అత్యంత శ్రద్ధతో పరమేశ్వరుడిని పూజిస్తారు. ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ శివుడు నెరవేరుస్తాడని నమ్ముతారు. అలాగే కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షం లభిస్తుంది.
మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి వివరించారు. ఎవరైతే శ్రావణమాసంలో ఏకభుక్తం(ఒక పూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారు. వారికి అన్నీ తీర్థయాత్రల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని వంశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెలలో చేసే దైవకార్యాలు అనంత ఫలితాలను ఇస్తాయి.
ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఐదు శ్రావణ సోమవారాలు వచ్చాయి. ఈ కాలంలో ఉపవాసం చేయడం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఆరోగ్యం, శక్తిని కాపాడుకునేందుకు ఈ ఉపవాస సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటున్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటివి నివారించాలి అనేది తెలుసుకుందాం.
పండ్లు
ఉపవాస సమయంలో పండ్లు ప్రధానమైనవి. ఇవి పోషకాలను అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. పుచ్చకాయ, అరటిపండు, నారింజ వంటి పండ్లు తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లభిస్తాయి. ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి.
పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ప్రోటీన్ కాల్షియం అందిస్తాయి. ఇవి పొట్ట నిండుగా ఉండేలా చేయడంతో పాటు అవసరమైన పోషకాలను ఇస్తాయి. ఉపవాస సమయంలో ఒక గ్లాసు పాలు లేదా ఒక గిన్నె పెరుగు తినడం వల్ల రిఫ్రెష్ గా సంతృప్తికరంగా ఉంటుంది.
సాబుదాన
ఉపవాస సమయంలో సాబుదానాన్ని విరివిగా తీసుకుంటారు. ఇది కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. సాబుదానా కిచిడి ఎక్కువగా తీసుకుంటారు.
నట్స్
బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలు అద్భుతమైన స్నాక్ ఎంపికలు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ప్రోటీన్లు ఫైబర్ తో నిండి ఉన్నాయి. అన్ని రకాల గింజల్లో కలిపి తీసుకోవడం వల్ల ఆకలి బాధ తగ్గుతుంది.
బంగాళదుంప చిలగడదుంపలు
బంగాళాదుంప, చిలగడదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిని ఉడకబెట్టడం కాల్చడం లేదా ఆలూ సబ్జీ, స్వీట్ పొటాటో చాట్ వంటివి వంటకాల్లో భాగంగా తీసుకోవచ్చు.
బుక్వీట్ పిండి
బుక్వీట్ పిండి గ్లూటెన్ రహితమైనది. ఉపవాసకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్లు, ప్రోటీన్స్, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది సంతృప్తికరంగా ఉంచుతుంది. చపాతీ లేదా పాన్ కేక్ లు తయారు చేసుకోవచ్చు.
సమక్ రైస్
సమక్ అన్నం ఒక రకమైన మిల్లెట్. ఇది తేలికగా సులభంగా జీర్ణమవుతుంది. ఉపవాస సమయంలో సాధారణ అన్నానికి ఇది ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. బంగాళాదుంప, వేరుశనగ వంటివి కలిపి పలావ్ లేదా కిచిడి తయారు చేసుకోవచ్చు.
శ్రావణ సోమవారాల్లో ఇవి నివారించాలి
ధాన్యాలు, తృణధాన్యాలు
గోధుమలు, బియ్యం, ఓట్స్, బార్లీతో సహా అన్ని ధాన్యాలు, తృణధాన్యాలు ఉపవాస సమయంలో తీసుకోకూడదు. వీటి స్థానంలో బుక్వీట్ పిండి, సమక్ రైస్ వంటివి తీసుకోవచ్చు.
నాన్ వెజ్ వద్దు
శ్రావణ సోమవారం ఉపవాస సమయంలో మాంసం, చేపలు, గుడ్లు సహా మాంసాహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. స్వచ్ఛత, ఆధ్యాత్మిక క్రమశిక్షణను పాటించేందుకు శాఖాహారంపై దృష్టి సారించాలి.
సాల్ట్ వద్దు
సాధారణ టేబుల్ సాల్ట్ మానేయాలి. బదులుగా రాతి ఉప్పు ఉపయోగించవచ్చు. ఇది ప్రాసెస్ చేయలేదు. రాక్ సాల్ట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు
ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేయబడిన ఆహారాలు తీసుకోకుండా ఉండాలి. ఉపవాస పవిత్రతను కాపాడుకునేందుకు వీటిని నివారించడం మంచిది. తాజా పదార్థాలను ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
వెల్లుల్లి ఉల్లిపాయ
వెల్లుల్లి, ఉల్లిపాయలకు సాధారణంగా ఉపవాస సమయంలో దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయని నమ్ముతారు. బద్ధకాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.
చిక్కుళ్ళు, కాయధాన్యాలు
బఠానీలు, చిక్కుళ్ళు, శనగలు, కాయధాన్యాలు శ్రావణ సోమవార ఉపవాస సమయంలో తినకూడదు.
ఆల్కహాల్, కెఫీన్ వద్దు
టీ, కాఫీ, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. ఉపవాస నియమానికి అనుకూలంగా ఉండవు. బదులుగా హెర్బల్ టీ, తాజా పళ్ల రసాలు తీసుకోవచ్చు.
టొమాటో, బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు వంటివి ఉపవాస సమయంలో దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.
ఇలా డైట్ ఫాలో అవండి
ఉదయం గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగొచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో పెరుగుతో పాటు తాజా ఫ్రూట్స్ అని ఏదైనా తీసుకోవచ్చు. మధ్యాహ్నం కోసం కొన్ని గింజలు తినొచ్చు. అలాగే కూరగాయలతో చేసిన సాబుదాన కిచిడీ తీసుకోవచ్చు. అనంతరం ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇక సాయంత్రం పండ్ల రసం లేదా పాలు అరటి పండ్లతో చేసిన స్మూతీ తీసుకోవచ్చు. కాల్చినా చిలగడదుంపల్లో ఒక చిన్న భాగం తినొచ్చు రాత్రివేళ పన్నీర్ కూర, బుక్వీట్ చపాతి చేసుకోవచ్చు. సలాడ్ తీసుకోవచ్చు.