PreCancer Symptoms: క్యాన్సర్‌కు ముందు కనిపించే కొన్ని లక్షణాలు ఇవి, 90 శాతం మందికి తెలియవు
PreCancer Symptoms: క్యాన్సర్ మాత్రమే కాదు, ఏ వ్యాధి రావడానికి ముందైనా, మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా ప్రారంభ లక్షణాలను చూపిస్తుంది. క్యాన్సర్ చూపించే లక్షణాలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి, దీని పేరు చెబితేనే ఎంతో మందికి భయం ఆవహిస్తుంది. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. చెడు జీవనశైలి, చెడు ఆహారం కారణంగానే క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు అంచనా.
క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే దీని లక్షణాలను ఎంతో మంది గుర్తు పట్టలేరు. 90 శాతం మందికి అవి క్యాన్సర్ లక్షణాలు అని కూడా తెలియవు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి.
వైద్యులు చెబుతున్న ప్రకారం, నోటిలో తరచుగా పుండ్లు ఏర్పడడం అనేది సాధారణ విషయం కాదు. ఇది క్యాన్సర్ చూపించే లక్షణాలలో ఒకటి. దీన్ని ప్రీక్యాన్సర్ లక్షణంగా చెప్పుకుంటారు. దీనిని వైద్యులు స్టేజ్ జీరో అని పిలుస్తారు. ఇది కచ్చితంగా క్యాన్సర్ లక్షణమే అని చెప్పలేము. కానీ కొన్నిసార్లు మాత్రం అది క్యాన్సర్ వల్లే వచ్చే అవకాశం ఉంది.
మీ నాలుకపై తెల్లని మచ్చలు కనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా స్టేజ్ జీరోలో కనిపించే సాధారణ లక్షణం. దీని వెనుక నోటి, ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. నాలుకపై తెల్లని మచ్చలు వస్తే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మీకు తరచుగా పొట్ట సంబంధిత వ్యాధులు వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. తరచూ మలబద్ధకం వస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా ఈ సమస్య కనిపిస్తుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
సరైన మోతాదులో మంచి ఆహారం తిన్న తర్వాత కూడా మీ బరువు త్వరగా తగ్గిపోతుంటే తేలికగా తీసుకోకూడదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దీని అర్థం మీ శరీరంలో ఏదో అసాధారణంగా జరుగుతోందని. అటువంటి పరిస్థితిలో, మీరు మీ వైద్యుడి వద్దకు వెళ్లి దీని గురించి చర్చించాలి.
ఈ లక్షణాలన్నింటితో పాటు, శరీరంపై ఎక్కడైనా గడ్డలా ఉన్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది క్యాన్సర్ ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. ఇది కాకుండా, మీ శరీరంపై పుట్టుమచ్చ లేదా మొటిమ ఉంటే, అది అకస్మాత్తుగా వేగంగా పెరుగుతున్నా తేలికగా తీసుకోకూడదు. అది కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది.
తీవ్రంగా అలసిపోవడం కూడా క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు. సాధారణంగా మనిషి అలసిపోతాడు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అలసటగా అనిపిస్తున్నా, చిన్న పని చేయడానికి కూడా శక్తి లేనట్టు ఉన్నా జాగ్రత్త పడాలి. ఎక్కువ రోజులు ఇలా కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
శరీరం రంగు నల్లగా మారడం లేదా ఎర్రగా మారి దురద పెట్టడం కూడా అసాధారణమైన క్యాన్సర్ లక్షణమే. కానీ ఇది క్యాన్సర్ సంకేతమని తెలిసిన వారు చాలా తక్కువ.
చిన్నచిన్న గాయాలు తగిలినా అవి ఒకంతట మానకపోవడం, పుట్టమచ్చల సైపు పెరిగి పుండ్లుగా మారడం కూడా డేంజర్ లక్షణమే.
గొంతు మారడం, విపరీతమైన దగ్గు రావడం కూడా క్యాన్సర్ లక్షణాలలో ఒకటే. మీ స్వరం మారిందంటే మీ శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన ఏ లక్షణం మీలో ఉన్నా ఒకసారి వైద్యులను కలిసి జాగ్రత్త పడడం మంచిది.