Tea Powder: ఈ టీ పొడి కొనాలంటే మీరు ఆస్తులు అమ్ముకోవాల్సిందే, కేవలం బిలియనీర్లు మాత్రమే ఈ టీని రుచి చూడగలరు
Tea Powder: ప్రపంచంలో ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఆహారాలలో ఖరీదైన టీ పొడి ఒకటుంది. అది కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి.
Tea Powder: ఉదయం లేచిన వెంటనే టీ తాగే వారి సంఖ్య ఎక్కువే. టీ తాగిన తర్వాతే పనులు మొదలు పెడతారు ఎంతోమంది. అలాగే సాయంత్రం పూట కూడా సమయానికి టీ పడకపోతే తలనొప్పి అంటూ కూర్చుండిపోతారు. సాధారణ ప్రజలు తాగే టీ పొడి కిలో 600 రూపాయలు కూడా ఉండదు. అందుకే ఇది పేదవారికి కూడా అందుబాటులో ఉండే టీ పొడి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఒకటి ఉంది. ఈ టీ పొడిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. కేవలం కోటీశ్వరులు మాత్రమే దీన్ని కొనగలరు. ఎందుకంటే ఈ టీ పొడి కిలో కొనాలంటే మీరు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంత ఖరీదు పెట్టి కొనగలే స్తోమత మన దేశంలో చాలా తక్కువ మందికే ఉంది. ఇక ఈ ఖరీదైన టీ పొడి చైనాలో దొరుకుతుంది. దాని పేరు డా హాంగ్ పావ్.
ఎందుకంత ఖరీదు?
చైనాలో ప్రసిద్ధమైన తేయాకు రకం ఇది. ఎక్కడపడితే అక్కడ ఈ తేయాకు మొక్కలు పెరగవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. అవి కూడా చాలా తక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ తేయాకు ఖరీదైనదిగా మారింది. అలాగే ఇవి పెరగడానికి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, పద్ధతులు అవసరం. ఈ తేయాకులో ఎన్నో మెడిసినల్ లక్షణాలు ఉన్నాయి. వాటి వల్లే ఈ టీ పొడికి అంత డిమాండ్ వచ్చింది.
ఈ టీ పొడి వెనుక ఒక కథ కూడా చైనాలో వినిపిస్తుంది. చైనాను మింగ్ వంశానికి చెందిన పాలకులు ఎక్కువ కాలం పాటు పాలించారు. ఆ వంశంలోని ఒక రాణికి ఆరోగ్యం క్షీణించింది. రాణి ఎంతో కాలం పాటు మంచానికే పరిమితం అయిపోయింది. రాణిని చూస్తూ రాజు మానసికంగా కుంగిపోయాడు. ఆ రాజ్యంలోని వైద్యులు చివరకు ఈ తేయాకులతో వైద్యం చేశారు. రాణి ఆరోగ్యం కుదుటపడింది. రాణిని చూసి రాజుగారు కూడా ఆరోగ్యంగా మారారు. అప్పటినుంచి ఈ తేయాకులకు ఎంతో విలువ పెరిగింది. కానీ అవి కాలక్రమేణా అంతరించిపోతూ వస్తున్నాయి. కొన్నిచోట్ల మాత్రమే వీటిని కాపాడుకుంటున్నారు.
ఈ టీ పొడిని చైనాలో కొన్నిసార్లు వేలం వేస్తారు. అలా వేలం వేసినప్పుడు వెళ్లి ఆ టీ పొడిని కొని తెచ్చుకోవాలి. చైనా ప్రభుత్వం ఈ తేయాకులను చాలా విలువైన సంపదగా భావిస్తుంది. వాటిని తమ జాతీయ సంపదగా ప్రకటించుకుంది. చైనా అధ్యక్షుడు అప్పుడప్పుడు ఇతర దేశాల అధ్యక్షులకు ఈ టీ పొడిని బహుమతిగా కూడా అందిస్తారు. అయితే వారిచ్చే బహుమతి 200 గ్రాములకు మించి ఉండదు. ఎందుకంటే కేవలం 20 గ్రాముల టీ పొడి కొనాలన్న దీనికోసం 23 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ తేయాకులు ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ పొడి రకంగా చెప్పుకుంటారు.
టాపిక్