Conjee with jowar roti: ఊదల గంజి, జొన్నరెట్టె కలిపి తింటే.. అద్భుతమైన భోజనం..
Conjee with jowar roti: తృణ ధాన్యాలు, తులసి కలిపి చేసిన గంజి, జొన్నరెట్టు కాంబినేషన్ మధ్యాహ్న భోజనంలో తీసుకోదగ్గ మంచి ఆహారం. దాన్నెలా చేయాలో తెలుసుకోండి.
ఊదలతో చేసిన గంజి, జొన్నరెట్టె
వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు కాస్త ఎక్కువగా వస్తాయి. కాబట్టి సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గంజిని మామూలుగా బియ్యంని ఉడికించి చేస్తారు. కానీ దాన్ని తృణ ధాన్యాలతో చేస్తే మరింత ఆరోగ్యం. దీనికి తులసిని జత చేసే పద్ధతి ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పాటూ జొన్న రొట్టెను కూడా మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవచ్చు. అదెలా చేయాలో చూద్దాం.
1. గంజి తయారీకి కావాల్సిన పదార్థాలు:
40 గ్రాముల ఊదలు
20 గ్రాముల రాగిపిండి
10 గ్రాముల క్యారట్ ముక్కలు
10 గ్రాముల బీన్స్ ముక్కలు
10 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు
10 గ్రాముల వెల్లుల్లి
10 గ్రాముల తాజా తులసి ఆకులు
తగినంత ఉప్పు
5మి.లీ ఆలివ్ నూనె
తయారీ విధానం:
- ముందుగా ఊదల్ని కడిగి నానబెట్టాలి.
- ఇప్పుడు ఒక లీటర్ నీళ్లలో ఊదలు, తులసి ఆకులు, తరిగిన కూరగాయలు వేసుకుని గంటపాటూ ఉడికించాలి.
- ఇప్పుడు రాగిపిండిని కూడా కలుపుకుని మరికొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి.
- చివరగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు ఆలివ్ నూనెను చిన్న ప్యాన్ లో వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసుకుని రంగు మారేదాక వేయించుకోవాలి. కొన్ని తులసి ఆకులు కూడా వేసుకోవాలి. ఈ తాలింపును గంజిలో పోసుకుని కలుపుకోవాలి.
2. జొన్నరెట్టె తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:
200 గ్రాముల జొన్నపిండి
తగినంత ఉప్పు
కొన్ని నీళ్లు
2 చెంచాల నూనె లేదా నెయ్యి
తయారీ విధానం:
- జొన్నపిండిని ఉప్పు, నూనె, నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
- కాసేపు జొన్నపిండిని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న ఉండలుగా తీసుకుని రొట్టెలాగా చేసుకుని పెనం మీద నూనె లేదా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి.