Prawn Masala Dosa | వీకెండ్ స్పెషల్.. రొయ్యల దోశ, అయ్య బాబోయ్ అనే రుచి!
మామూలు మసాలా దోశ అందరూ తినేదే, ఈ వీకెండ్ కు స్పెషల్ గా రొయ్యల మసాలా దోశ తినండి మామూలుగా ఉండదు దీని రుచి. Prawn Dosa Recipe ఇక్కడ ఉంది చూడండి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి వేడివేడి మసాలా దోశ మనకు నచ్చిన చట్నీతో అద్దుకుని తింటుంటే వచ్చే ఆనందమే వేరు. మనకు దోశల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. అయితే ఎక్కువగా మసాలా దోశ, పనీర్ దోశ, కారం దోశ లేదా ఉల్లిదోశ ఇవే ఎక్కువగా తినేది. అప్పుడప్పుడు ఎగ్ దోశ కూడా ట్రై చేయవచ్చు. కానీ మీరెప్పుడైనా రొయ్యల మసాలా దోశ ట్రై చేశారా? మాంసాహార ప్రియులు ఈ దోశ వెరైటీని ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలనుకుంటారు. ఇక్కడ మేము మీకు రొయ్యల మసాలా దోశ రెసిపీని అందిస్తున్నాము. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఇదే పద్దతిలో మీరు చికెన్ మసాలా దోశ లేదా మటన్ ఖీమా దోశ కూడా తయారు చేసుకోవచ్చు. శాకాహారులైతే నచ్చిన కూరగాయలతో దోశ చేసేసుకోవచ్చు.
రొయ్యల మసాలా దోశ ఎక్కువగా ఇండియాలోని మధురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాలతో పాటు శ్రీలంక, మలేషియా వంటి ఇతర దేశాలలో కూడా చాలా పాపులర్ వంటకం. రొయ్యల దోశలో గుడ్లను కూడా ఉపయోగించవచ్చు. ఈ గుడ్లు రొయ్యలను దోశకు బాగా పట్టుకునేలా చేస్తాయి. రొయ్యల దోశలో ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి, ఆ తర్వాత దోశను ఎప్పుడూ చేసుకున్నట్లే చేసుకోవాలి. ఈ కింద రెసిపీని చూసి మీరూ ట్రై చేయండి మరి.
Prawn Dosa Recipe కోసం కావలసినవి
- కింగ్ ప్రాన్స్ - 15 నుంచి 20
- దోశ పిండి - కావలసినంత
- అల్లం - 2 స్పూన్లు
- వెల్లుల్లి - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయ - 1 చిన్నది
- కరివేపాకు - 1 రెమ్మ
- టొమాటో - 1
- పసుపు పొడి - 1/2 tsp
- కారం పొడి - 1 tsp
- గరం మసాలా పొడి - 3/4 tsp
- నూనె - 2 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
రొయ్యల మసాలా దోశ తయారీ విధానం
- ముందుగా రొయ్యలను శుభ్రంగా కడగాలి, అనంతరం వాటిని ముక్కలు కట్ చేసి పసుపు పొడిని కలిపి 20 నిమిషాలు మ్యారినేట్ చేయాలి.
- రెండో దశలో ఒక లోతైన పాన్‌లో నూనె వేడి చేయండి. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
- ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. కొన్ని సెకన్ల పాటు వేయించి, తరిగిన టమోటాలు వేసి వేయించండి.
- ఇప్పుడు మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసి, కదిలిస్తూ వేయించాలి. మీడియం మంట మీద నీరు ఆవిరైపోయే వరకు ఉడికించాలి.
- సుమారు 8 నిమిషాలు ఉడికిన తర్వాత రొయ్యల మసాలా రెడీ అయినట్లే.
- ఇప్పుడు దోశ పాన్ మీద దోశ వేసుకోండి. ఆపైన రొయ్యల మసాలా వేసి దోశను కాల్చుకోండి.
అంతే, రుచికరమైన రొయ్యల మసాలా దోశ రెడీ. కాఫీ తాగుతూ ఆరగించవచ్చు.
సంబంధిత కథనం