కోవిడ్, లేదా వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక గుండె పోట్లు వస్తున్నాయా? కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఏమంటున్నారు?-sudden heart attacks due to getting infected with covid 19 or taking the covid 19 vaccine cardiologist explains ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sudden Heart Attacks Due To Getting Infected With Covid-19 Or Taking The Covid-19 Vaccine Cardiologist Explains

కోవిడ్, లేదా వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక గుండె పోట్లు వస్తున్నాయా? కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఏమంటున్నారు?

HT Telugu Desk HT Telugu
Nov 20, 2023 02:45 PM IST

కోవిడ్ సోకడం వల్ల గానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గానీ ఆకస్మిక గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ వస్తున్నాయా? ఈ ప్రశ్నలకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్.ఎస్.ముఖర్జీ స్పష్టత ఇచ్చారు.

కోవిడ్ సోకడం వల్ల గానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గానీ ఆకస్మిక గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ వస్తున్నాయా?
కోవిడ్ సోకడం వల్ల గానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గానీ ఆకస్మిక గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ వస్తున్నాయా? (pixabay)

ప్కోరమువిడ్ సోకడం వల్ల గానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గానీ ఆకస్మిక గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ వస్తున్నాయా? అన్న అంశాలపై పల్స్ హార్ట్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ తన యూట్యూబ్ ఛానెల్‌లో చాలా స్పష్టత ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

‘ఇటీవలే ఇద్దరు కార్డియాలజిస్టులు సహా ముగ్గురు వైద్యులు హార్ట్ అటాక్ తో మరణించారు. ఇంతకుముందు కూడా వైద్య రంగంలో ఉన్న వారికి ఇలా జరగలేదా అంటే జరిగింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా సర్క్యులేషన్, వీడియోగ్రఫీకి అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల జనంలో ఎక్కువగా తెలుస్తోంది. అందువల్ల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోవిడ్ తరువాత పెరుగుతున్న స్ట్రోక్స్‌కు సంబంధించి ఎంత మేర పెరిగాయన్నదానికి గణాంకాలు లేవు. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ ఆకస్మిక గుండె పోట్లు పెరుగుతున్నాయి. వైద్యులకు కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. దాదాపు రెండు, మూడు రెట్లు ఉంటుంది. వైద్యులు తాము ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. మనకేం అవుతుందిలే అని నిర్లక్ష్యం వహించడం చూస్తుంటాం. అందువల్ల ఎక్కువ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది..’ అని వివరించారు.

కోవిడ్ వల్ల ఈ స్ట్రోక్స్ వస్తున్నాయా?

‘అయితే కోవిడ్ వలన ఈ మరణాలు జరుగుతున్నాయా? అని అడుగుతున్నారు. కోవిడ్ రక్తనాళానికి సంబంధించిన సమస్య. రక్త నాళాల్లో గడ్డలు కట్టే సమస్య పెరుగుతుంది. కోవిడ్ బాగా వచ్చి తగ్గిపోయిన వాళ్లకు గుండె సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. సివియర్ కోవిడ్ వచ్చిన వాళ్లందరికీ ఈ ముప్పు ఉంటుందని ఐసీఎంఆర్ గానీ, హెల్త్ మినిస్ట్రీ గానీ చెప్పడం జరిగింది.

అంతకుముందు బ్లాక్స్ ఏవీ లేకుండా నొప్పి వచ్చిన వాళ్లకు యాంజియోగ్రామ్ చేస్తే అన్ని రక్త నాళాలు క్లీన్‌గా ఉండి ఒక చోట మాత్రమే క్లాట్ ఫామ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. అంటే బ్లాక్స్ లేకుండా క్లాట్స్ ఫామ్ అవడం. అంటే వారికి కరోనరీ ఆర్టరీ డిసిజ్ ఉండదు. ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా అకస్మాత్తుగా రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అయి ఉంటాయి. ఇదే లక్షణం మనం పొగ తాగే వారిలో చూస్తాం. స్మోకర్స్‌లో బ్లాక్స్ విడిగా లేకుండా కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. ముఖ్యంగా యంగ్ స్మోకర్లలో చూస్తాం.

ఇలాంటి ప్రాబ్లెమ్స్ కోవిడ్ వెళ్లిపోయిన మొదట్లో చాలా ఎక్కువగా చూశాం. ఇప్పుడు చూస్తే (స్మోకర్లను మినహాయించండి) క్లాట్స్ తో పాటుగా బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి బ్లాక్ వచ్చిందన్నప్పుడు దానిని మనం కోవిడ్‌ వల్లేనని భావించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక బ్లాక్ వచ్చిందంటే..అది కొలెస్టరాల్ వల్ల తయారై ఉంటుంది. దాని పైన క్లాట్ ఏర్పడుతుంది. మిగతా రక్త నాళాలు అన్ని బాగుండి క్లాట్ ఏర్పడుతుందంటే మాత్రమే దానిని కోవిడ్ వల్ల ఏర్పడుతుందని భావించవచ్చు. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న కేసుల్లో అధిక భాగం బ్లాక్స్ కూడా ఉంటున్నాయి. అందువల్ల దానిని కోవిడ్ ద్వారా వచ్చిందని భావించలేం..’ అని డాక్టర్ ముఖర్జీ వివరించారు.

మరి వాక్సిన్ వల్ల అయి ఉండవచ్చా?

‘మనకు లభ్యత కలిగిన రెండు వాక్సిన్ల గురించి మాట్లాడుదాం. నాకు తెలిసిన ఇద్దరు కార్డియాలజిస్టులు ఇలా చనిపోయారని చెప్పినప్పుడు చాలా మంది ట్విటర్ లో స్పందించారు. చాలా మంది ఇది వ్యాక్సిన్ వల్లనే అని నమ్ముతూ కామెంట్ చేశారు. అయితే నేను ఏమనుకుంటున్నానో చెబుతాను.

వాక్సిన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి? మన వద్ద ఉన్న రెండు వాక్సిన్లలో ఒక వాక్సిన్‌కు క్లాటింగ్ టెండెన్సీ ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే వాక్సిన్ వల్లే గుండె పోటు వస్తోందని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ (ఆధారం) లేదు. అలాగే వాక్సిన్ వల్ల కాదూ అని చెప్పడం కూడా అంతేకష్టం. వాక్సిన్ వల్లే అని నిరూపించాలన్నా, వాక్సిన్ వల్ల కాదూ అని నిరూపించాలన్నా రెండూ కష్టమే. నా అంచనా మేరకు మూడు అంశాలు మీతో పంచుకుంటాను.

వాక్సిన్ వేసుకున్న తరువాత వచ్చే క్లాట్.. వాక్సిన్ వేసుకున్నాక 10 రోజులకు క్లాట్ వచ్చినట్టు గమనించాం. చాలా వరకు 10 రోజుల్లోపే వచ్చాయి. గరిష్టంగా 2 నెలలలోపే ఈ ముప్పు ఉంటుంది. తరువాత వచ్చే ముప్పు తక్కువ. ఇది డేటా చెబుతోంది.

రెండో అంశం ఏంటంటే వాక్సిన్ వల్ల వచ్చే క్లాట్స్ ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న మహిళల్లో ఎక్కువ వచ్చింది. వాక్సిన్ వేసిన కొత్తలో చాలా మంది యువతులు ఇలా చనిపోయారు. కానీ ఆకస్మికంగా చనిపోతున్న వారిని చూసినట్లయితే ఎక్కువ మంది మగవాళ్లే. ఇప్పుడు అలా చనిపోతున్న వారిలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారు. వాక్సిన్ వల్ల క్లాట్ బ్రెయిన్ లో వస్తోందనేది మరో వాదన. అయితే దీనికి కూడా శాస్త్రీయ ఆధారం లేదు..’ అని డాక్టర్ ముఖర్జీ స్పష్టం చేశారు.

‘ఒకవేళ వాక్సిన్ వల్ల అయితే దానిని బహిర్గతం చేయడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, వైద్యులు ముందుకు రావాలి. ప్రజలకు వాస్తవాలను బహిర్గతం చేసి వారి భయాందోళనలు తొలగించాలి.

అయితే కోవిడ్ సమయంలో ప్రజలు క్లాటింగ్ టెండెన్సీ ఉందేమో తెలుసుకోవడానికి డీడైమర్ అనే టెస్ట్ చేయించుకున్నారు. కొందరిలో డీడైమర్ ఎక్కువగా ఉండి కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ వచ్చి పోయాక రెండు మూడు నెలల తరువాత కొద్ది మందిలో ఎక్కువగా ఉండేది.

డీడైమర్ పరీక్ష చేయించుకుని తెలుసుకుంటే హార్ట్ ప్రాబ్లెమ్ రాదు అనుకోవడానికి లేదు. రొటీన్‌గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు టీఎంటీ, 2డీ ఎకో పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. బ్లాక్స్ ఉంటే తెలుసుకునే ఆస్కారం ఉంటుంది..’ అని డాక్టర్ వివరించారు.

‘ఆకస్మిక స్ట్రోక్స్ గురించి మనం భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని మనం మార్చుకోగలిగేవి ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం, వైద్య పరీక్షలు, మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయొచ్చు.

అయితే మనం మార్చుకోలేనివేంటంటే మన వయస్సు గానీ, కోవిడ్ వచ్చి పోయిన స్థితి గానీ, వ్యాక్సిన్ వేసుకొని ఉండడాన్ని గానీ, జన్యు సంబంధిత పరిణామ క్రమాన్ని గానీ మార్చుకోలేం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..’ అని డాక్టర్ ముఖర్జీ సూచించారు.

ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ (youtube)
WhatsApp channel