Sri Rama Navami 2023 । సర్వోన్నత ఆదర్శాలకు నిలువెత్తు రూపమే శ్రీరామ చంద్రుడు!
Sri Rama Navami 2023: శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం.. రామాయణం విన్నా, రాముని చరిత్ర తెలుసుకున్నా అది మన జీవితానికి గొప్ప ముక్తి మార్గం. శ్రీ రామ నవమి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం చదవండి.
Sri Rama Navami 2023: రామాయణం భారతీయ సాహితీ రచనలలో ఆదికావ్యంగా చెప్తారు. ఇది శ్రీరాముడి చరిత్రను తెలియజేస్తుంది. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు, భారతీయుల జీవనశైలిపై ఇప్పటికీ లోతైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. రాముని జన్మదినాన్ని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.
రాముడు అంటే ఎవరు? వాల్మీకి రామాయణం రాముడి గురించి స్పష్టమైన వివరణను అందిస్తుంది. సర్వోన్నత ఆదర్శాలకు నిలువెత్తు రూపమే శ్రీరామచంద్రుడు.
రాముడు నడిచిన దారి, నమ్ముకున్న ధర్మం, ఆయన గుణగణాలు ఆయనను సాక్షాత్తు దేవుడి అవతారంగా నిలబెట్టాయి. శ్రీరాముడు మహా విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని తెలియజేసే కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Lord Sri Rama Virtues- శ్రీ రాముడి సద్గుణాలు
రాముడి సద్గుణాలు ఎలాంటివో ఇప్పుడు చూద్దాం..
దయామయుడు - శ్రీరాముడు ప్రతీ ప్రాణిపై దయ, కరుణను చూపేవాడు. ఆప్యాయతను పంచేవాడు, ఉదారంగా ఏది అడిగినా ఇచ్చే వాడు. రాజభోగాలను, ఆడంబరాలను త్యజించి సాధారణ జీవితాన్ని జీవించాడు.
పురుషోత్తముడు- ఒక వ్యక్తిగా శ్రీ రాముడు ఆదర్శవంతమైన వ్యక్తి. మనిషి అన్నవాడికి ఉండాల్సిన సద్గుణాలు అన్నీ రామునిలో ఉన్నాయి. వ్యక్తిగా తన నైతిక బాధ్యతలన్నింటినీ రాముడు నెరవేరుస్తాడు. అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడిగా కీర్తిస్తారు.
ఆకర్షణీయమైన రూపం- శ్రీరాముడు అద్భుతమైన శరీరాకృతి, విశాలమైన వక్షస్థలం, ప్రకాశవంతమైన ముఖవర్ఛస్సు, శ్రేష్ఠమైన తల, మనోహరమైన నుదురు గొప్ప పరాక్రమం కలవాడు. అయితే అంతకు మించినది ఏమిటంటే రాముడు పెద్దలంటే గౌరవం, చిన్నలంటే ప్రేమ, ఎదుటి వ్యక్తులకు గౌరవం, కష్టం వస్తే ఆదుకునే స్వభావం, పోరాడే ధైర్యం ఇవన్నీ ఆయనకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి. అందరి హృదయాల్లో రాముడిని నిలిపేలా చేశాయి.
ఒకటే మాట, ఒకటే బాణం- రాముడు ఒక్కడే ఆయనను మించిన వారు లేరు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే. ఏక్ వచన్ - అంటే రాముడు ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఏక పత్ని వ్రతుడు- రాజు అయి ఉండి కూడా జీవితాంతం ఒక్క భార్యనే కలిగి ఉన్నాడు. ఏక బాణం- ఒక్క రామబాణం ఎలాంటి విధ్వంసం అయినా చేయగలదు
సత్యం- శ్రీ రాముడు తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం మాట్లాడలేదు.
పితృ వాక్య పరిపాలన- తండ్రి దశరథుడి మాటకు కట్టుబడి శ్రీ రాముడు అయోధ్య రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం బాటపడతాడు. ఆస్తులు, అధికారం, రాజభోగాలు ముఖ్యం కాదు, విలువలే ప్రధానం. పెద్దలు ఏది చెబితే అదే శిరోధార్యం అని చాటినవాడు శ్రీరాముడు.
ధర్మం కోసం యుద్ధం- శ్రీరాముడు జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడు, ధర్మం కోసమే యుద్ధం చేశాడు, ధర్మయుద్ధంలో విజయం సాధించాడు.
శత్రువుతో కూడా విలువలు- రావణుడు తన భార్య సీతను అపహరించినా, యుద్ధంలో తన పక్షాన్ని ఎన్నో విధాల గాయపరిచినా, ఎన్ని రకాల హేయమైన చర్యలు చేసినా, శ్రీ రాముడు ఏనాడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు, తన విలువలు విడువలేదు. రావణుడికి గౌరవం ఇస్తూ అవకాశాలను అందిస్తాడు. చివరకు రాముడి చేతిలో రావణ సంహారం జరుగుతుంది. రావణ మరణానికి కూడా శ్రీ రాముడు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు, చనిపోయిన లంక రాజుకు గౌరవంగా అంత్యక్రియలను జరపవలసిందిగా సూచించాడు.
రామ రాజ్యం- శ్రీరాముడు తన ప్రజల రాజు, పజలు ఎంతగానో ప్రేమించే రాజు. తన రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల్లా, తన కంటిపాపలలాగా చూసుకున్నాడు. వారి శ్రేయస్సు కంటే తన వ్యక్తిగత జీవితం లేదా తన ఆనందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే అలాంటి రాజు, అలాంటి రామ రాజ్యం అందరికీ ఉండాలని కోరుకుంటారు.
సంబంధిత కథనం