Rama Navami 2023 । శ్రీ రామ నవమి 2023 తేదీ, పూజా ముహూర్తం సమయాలు, పాటించాల్సిన ఆచారాలు!
Rama Navami 2023: శ్రీ రామ నవమి 2023 తేదీ, పూజా ముహూర్తం సమయాలు, రామ నవమి రోజున పాటించే ఆచారాలు, తదితర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Rama Navami 2023: శ్రీ రామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం మానవరూపంలో అవతరించిన మహా విష్ణువు ఏడో అవతారమే శ్రీ రాముడు అని పురాణాలు పేర్కొన్నాయి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు. రాముని జన్మదినోత్సవం సందర్భంగా శ్రీరామ నవమిని జరుపుకుంటారు.
పదునాలుగు సంవత్సరముల వనవాసం, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. ఇదే రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ రామ నవమి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతీ ఏడాది చైత్రమాసంలో అమావాస్య తర్వాత 9వ రోజున వచ్చే నవమిని ‘శ్రీరామ నవమి’ గా గుర్తిస్తారు. ఈ ఏడాది అనగా 2023లో మార్చి 30న గురువారం నాడు శ్రీరామ నవమిని జరుపుకుంటున్నాం. ఇదే రోజున చైత్ర నవరాత్రులు ముగుస్తాయి.
శ్రీ రామ నవమి 2023 తేదీ, పూజా ముహూర్తం సమయాలు
త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అని పురాణాలు తెలియజేశాయి. కాబట్టి, దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రీరాముడు జన్మించిన తిథి ఈ సంవత్సరం మార్చి 30న ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. కాగా, నవమి తిథి మార్చి 29న రాత్రి 9:07 గంటలకు ప్రారంభమై మార్చి 30న రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది.
భారతదేశంలో ప్రాంతాల వారీగా శ్రీ రామ నవమి 2023 పూజా ముహూర్తం సమయాలు ఈ విధంగా ఉన్నాయి..
న్యూఢిల్లీ - ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:40 వరకు
పూణే - ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 1:53 వరకు
చెన్నై - ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:27 వరకు
కోల్‌కతా - ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:55 వరకు
హైదరాబాద్ - ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 1:34 వరకు
అహ్మదాబాద్ - ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:58 వరకు
నోయిడా - ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:40 వరకు
జైపూర్ - ఉదయం 11:17 నుండి మధ్యాహ్నం 1:46 వరకు
ముంబై - ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 1:57 వరకు
గుర్గావ్ - ఉదయం 11:12 నుండి మధ్యాహ్నం 1:41 వరకు
బెంగళూరు - ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:38 వరకు
చండీగఢ్ - ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:42 వరకు
శ్రీ రామ నవమి 2023 రోజున పాటించే ఆచారాలు
శ్రీ రామ నవమి రోజున భక్తులు ఒకరోజు ఉపవాసం ఉండి, శ్రీ రాముడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, రామ నామ జపం చేస్తూ ఆరాధించాలి. రామాయణ పఠనం గానీ, శ్రవణం గానీ చేయాలి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం, రామనవమి వేడుకలలో పాల్గొనడం చేయడం చేసి మరుసటి రోజున ఉపవాసం విరమిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం