Rama Navami 2023 । రామ అనే పదానికి సంస్కృత అర్థం ఏమిటి? తారక మంత్రం ఇదిగో!
Rama Navami 2023: రామ అనే పదానికి అర్థం ఏమిటి? శ్రీ రామ నామం రక్షా మంత్రం ఎలా అయింది? శ్రీరామ నవమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన కథనం చదవండి.
Rama Navami 2023: మనందరికీ పేర్లు ఉంటాయి, మన పేరు మన గుర్తింపును తెలియజేస్తుంది. అలాగే ప్రతీ పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ పేరును సార్థకం చేసుకున్న వారి పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలాంటి ఆదర్శాలను కలిగి ఉన్నాం, ఎలాంటి ధర్మాలను పాటిస్తున్నాం, ఎలాంటి గుణగణాలను కలిగి ఉన్నాం ఇవన్నీ మన పేరును చరిత్రలో నిలిపే అంశాలే. బిడ్డ పుట్టినపుడు తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి పేరు పెడతారు. ఆ పేరు పెట్టడంలోనే ఈ లోకంలో తమ బిడ్డ పాత్ర ఎలాంటిది అనే తల్లిదండ్రులు లేదా పెద్దల అభిలాషను, ఆకాంక్షను తెలియజేస్తుంది.
మన భారతదేశంలో రామ్ అనే పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది, ఎంతో శక్తివంతమైనది కూడా. ఎందుకంటే రామ్ అనే పేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మనందరికీ తెలుసు రామ్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడు, ఆయనే రామాయణ కథానాయకుడు, ఎట్టి పరిస్థితుల్లో ధర్మానికి కట్టుబడే ధర్మ రక్షకుడు, పురుషులలో సర్వోన్నత గుణాలు కలిగిన పురుషోత్తముడు. ఇలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షాత్ భగవంతుని స్వరూపాలే, అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన పేరు నేటికీ నిలిచి ఉంది. అందుకే చాలా మంది, ప్రత్యేకంగా హిందువులలో రామ్, శ్రీరామ్, జానకీరామ్, తారకరామ్ అంటూ రాముని పేరును తమ పేర్లుగా పెట్టుకుంటారు. మంచి గుణవంతుడు అయిన వారిని 'రాముడు మంచి బాలుడు' గా అభివర్ణిస్తారు.
What is the Meaning of Rama- రామ అనే పదానికి అర్థం ఏమిటి?
సిద్ధ యోగ మార్గంలో జపించే నామసంకీర్తనలలో మనకు తరచుగా వినిపించే భగవంతుని సంస్కృత నామాలలో రాముడు కూడా ఒకటి. రామ అనే పేరు సంస్కృత మూలం రామ్ నుండి వచ్చింది, ఈ పదానికి ప్రశాంతత, విశ్రాంతి, ఆనందం, సంతోషపరచడం' ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా సంతోషపెట్టువాడు, ఆనందకారకుడు, ప్రశాంత వదనుడు, ప్రకాశవంతుడు రాముడు అవుతాడు.
దశరథుడి ఆనందం శ్రీరాముడే కాబట్టి దశరథ నందనుడిగా, వెన్నెల వంటి చల్లని ప్రకాశాన్ని పంచుతాడు కాబట్టి రామచంద్రుడు.. రామచంద్ర ప్రభువులా, రఘు వంశానికి చెందిన వాడు కాబట్టి రాఘవగా శ్రీరాముడిని వివిధ పేర్లతో పిలుచుకుంటారు.
వాల్మీకి మహర్షి రచించిన గొప్ప సంస్కృత పురాణ కావ్యమైన రామాయణం శ్రీరాముని జీవితాన్ని వివరిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని నమ్ముకొన్నాడు, యుద్ధాన్ని గెలిచి వీరుడనిపించుకున్నాడు, శత్రువులను సైతం కరుణించే కరుణామయుడయ్యాడు, ధర్మసంస్థాపనకు వచ్చిన సాక్షాత్ విష్ణువు ఏడవ అవతారంగా కీర్తి పొంది, దేవుడయ్యాడు. అందుకే రామ నామం ఒక మంత్రం అయింది. ఆపదల నుంచి కాపాడే శ్రీరామ రక్ష అయింది.
అందుకే రామ నామం తరచుగా తలుచుకునేందుకు తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకుంటారు. కేవలం దీనిని పేరుగా మాత్రమే కాకుండా శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా శ్రీరామ్ లేదా సియా రామ్ లేదా సీతా రామ్ అంటూ అభినందించుకుంటారు. అలాగే 'జై శ్రీరామ్' అంటూ నమస్కారం పెడుతూ తమ అత్యుత్తమ సంస్కారాన్ని ప్రదర్శిస్తారు.
సంబంధిత కథనం