Siblings Day 2022 | రామలక్ష్మణుల బంధం అలా ఉండేది.. ఈరోజు తోబుట్టువుల దినోత్సవం!
ఈరోజు శ్రీరామ నవమితో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈరోజు తోబుట్టువుల దినోత్సవం (Siblings Day). ఈ సందర్భంగా రామలక్ష్మణుల బంధంపై ప్రత్యేక కథనం..
ఈరోజు శ్రీరామ నవమి అని తెలుసు.. అంతేకాదు ఈరోజు అన్ని మతాల వారు జరుపుకునే ప్రత్యేకమైన వేడుక కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఈరోజు తోబుట్టువుల దినోత్సవం. ప్రపంచంలోని చాలా చోట్ల ఈరోజు 'Siblings Day' గా పాటిస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న ఈ సిబ్లింగ్స్ డేను జరుపుకుంటారు.
సరిగ్గా.. భారతదేశంలో శ్రీరామ నవమి ఈ ఏడాది ఏప్రిల్ 10న వచ్చింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో తోబుట్టువుల దినోత్సవం రోజున తోబుట్టువులైన రామ-లక్ష్మణుల గురించి ప్రత్యేకంగా చర్చించుకుందాం.
మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.. ఇద్దరు అన్నాదమ్ముల ప్రస్తావన వచ్చేటపుడు 'రామలక్ష్మణుల జోడి' అని చెప్తారు. కుటుంబంలోని సోదరులు రామలక్ష్మణుల్లా మెలగాలని పెద్దలు సూచిస్తారు. మరి అంతటి ప్రాధాన్యత ఉంది ఆ తోబుట్టువుల మధ్య అనుబంధానికి.
వాస్తవానికి శ్రీరామునికి లక్ష్మణ, భరత, శత్రఝ్నులు ఆదర్శ సోదరులుగానే ఉన్నారు. అయితే లక్ష్మణుడికి శ్రీరామునితో ఎక్కువ కాలం గడిపే అవకాశం దక్కింది. లక్ష్మణుడికి శ్రీరాముడు అన్న మాత్రమే కాదు అండ- దండ.అదే విధంగా రాముడు సైతం లక్ష్మణుడు లేనిదే ఏ కార్యం చేసేవాడు కాదు.
శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లాల్సి వచ్చినపుడు రాజ్యాన్ని, రాజభోగాలను వీడి తన అన్న వెంటే నడిచాడు లక్ష్మణుడు. పద్నాలుగేళ్లు అన్నతో కలిసి కష్టసుఖాలను అనుభవించాడు. వీరిరువురి మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు నేటికి పరిపూర్ణ సోదరభావానికి ఆదర్శాలు.
రామలక్ష్మణుల మధ్య అనుబంధాన్ని తెలిపే విధంగా పురాణ సంస్కృత శ్లోకాల్లో ఇలా ఉంది..
న చ తేన వినా నిద్రాం లభతే పురుశోత్తమః ||
మ్రిస్తమ్ అన్నమ్ ఉపనీతం అశ్నాతి న హి తం వినా |
దీని అర్థం పురుశోత్తముడైన శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు లేనిదే ఎంతటి రుచికరమైన భోజనాన్నైనా స్వీకరించడు. లక్ష్మణుడు నిద్రపోనిదే తానూ నిద్రపోడు. అంటే ఏదైనా తన సోదరుడి తర్వాతనే అనే అర్థం వస్తుంది.
సర్వ ప్రియా కరః తస్య రామస్య అపి శరీరతః ||
లక్ష్మణో లక్ష్మీ సా, ం పన్నో బహిః ప్రాణా ఇవ అపరః |
సకల సంపన్నుడైన లక్ష్మణుడు, ఎంత సంపద కలిగి ఉన్నా.. తన సోదరుడితో ఉన్న బంధమే తనకు వెలకట్టలేని సంపదగా భావించాడు. శ్రీరాముని సేవలోనే తన గర్వాన్ని చూసుకున్నాడు.. అనే అర్థం వస్తుంది.
దీని ప్రకారం రామలక్ష్మణుల బంధం ఏం సూచిస్తుందంటే. తోబుట్టువులతో చిన్నతనం నుంచి పెనవేసుకున్న బంధం సకలసంపదల కంటే గొప్పది. సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు. సోదరుల్లో ఒకరు ఎదిగినా.. తన అన్నతో ఒదిగి ఉండాలి. కష్టమైనా, నష్టమైనా కలిసి ముందడుగు వేయాలి.. అప్పుడు వారు సాధించే విజయాలు చిరస్థాయిగా నిలుస్తాయి.
కాబట్టి ఈరోజు 'సిబ్లింగ్స్ డే' రోజున రామలక్ష్మణుల స్పూర్థిని చాటండి. మనం మన తోబుట్టువులతో ఎన్నో విలువైన జ్ఞాపకాలను పంచుకుంటాము. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ధ్వేషించుకుంటాం.. ప్రేమించుకుంటాం. ఏదేమైనా వారితో ఆ బంధాన్ని కలకాలం నిలుపుకోండి. అలా నిలవాలని ఆకాంక్షిస్తూ కలిసి వేడుక చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్