Puberty Pimples। టీనేజ్‌లో మొటిమలు సహజం.. మెరిసే చర్మం కోసం ఇవిగో మార్గాలు!
Puberty Pimples: టీనేజ్ వయసులో మొటిమలు ఎక్కువగా వస్తాయి, ఇప్పుడే సరైన సంరక్షణ తీసుకోవాలి. కాంతివంతమైన మెరిసే చర్మం పొందడం కోసం నిపుణులు కొన్ని ఆహారాలు సూచించారు.
ముఖంపై మొటిమలు రావడం అనేది సర్వ సాధారణం, ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ వయసు నుంచే హార్మోన్లలో హెచ్చు తగ్గులు మొదలవుతాయి. అదే సమయంలో ఈ వయసులో ఉన్నప్పుడు తినే ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ ఉండదు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను ఇష్టారీతిన తింటారు. కలుషిత వాతావరణంలో జీవిస్తారు.
యుక్త వయసులో ఉన్నప్పుడు ఏది తిన్నా, ఎలా తిన్నా వారి ఆరోగ్యంపై పెద్దగా ఎలాంటి ప్రభావం పడదు. కానీ దాని ప్రభావంమంతా చర్మంపై కనిపిస్తుంది. చర్మంపై దురద, చికాకు ఎక్కువ కలుగుతాయి. చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీనికి తోడు మొటిమలతో ముఖం కళావిహీనంగా మారుతుంది.
టీనేజ్‌లో ఉన్నవారు చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోరు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఖర్చు పెట్టేంత పరిస్థితి ఉండదు. కానీ ముఖంపై ఈ సమయంలో ఏర్పడిన మొటిమలు, మచ్చల గుర్తులు వయసు పెరిగిన తర్వాత కూడా అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి చర్మాన్నిమొటిమలు లేకుండా సజీవంగా ఉంచడం కోసం ఆహారంలోనే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
Anti- Acne Foods to Control Puberty Pimples- మొటిమల నివారణకు ఆహారాలు
కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందడానికి టీనేజర్లు తినాల్సిన 5 రకాల ఆహారాలను ఇక్కడ తెలియజేస్తున్నాం, చూడండి.
చిలగడదుంపలు
చిలగడదుంపలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి మేలు చేసే బీటా-కెరోటిన్ తగినంతగా ఉంటుంది.దీనిలోని పోషకాలు చర్మానికి మేలుచేస్తాయి. స్వీట్ పొటాటో కాల్చుకొని తింటే రుచిగా ఉంటుంది.
బ్రోకలీ
బ్రోకలీలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇందులో జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలకు గొప్పమూలం. ఇంకా సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది, ఇది చర్మ క్యాన్సర్‌ను నివారించడంలో, మీ చర్మాన్ని సన్ బర్న్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
ఫ్యాటీ ఫిష్
కొవ్వు చేపలు తింటే శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అంతేకాకుండా చర్మానికి ఉపయోగపడే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటైన విటమిన్ Eకి కొవ్వు చేప మంచి మూలం. అలాగే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తో చర్మానికి అనేక లాభాలు ఉన్నాయి. సోరియాసిస్, లూపస్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
అవకాడోలు
అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. చర్మం కఠినంగా మారకుండా కాపాడటమే కాకుండా, మంచి నిగారింపును అందిస్తాయి.
వాల్‌నట్
మన శరీరం స్వంతంగా తయారు చేసుకోలేని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు వాల్‌నట్స్‌లో ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి వాల్‌నట్స్ తినడం అద్భుతమైన మార్గం. ఇవి కొద్ది మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ , సెలీనియంలను కూడా అందిస్తాయి. చర్మం కణాల నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం. 28 గ్రాముల వాల్‌నట్లు తింటే సుమారు 5 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
సంబంధిత కథనం