Mangoes: మామిడి పండ్లు తినే ముందు నీళ్లలో నానబెట్టండి, అలాంటి సమస్యలు రావు-soak mangoes in water before eating them to avoid such problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mangoes: మామిడి పండ్లు తినే ముందు నీళ్లలో నానబెట్టండి, అలాంటి సమస్యలు రావు

Mangoes: మామిడి పండ్లు తినే ముందు నీళ్లలో నానబెట్టండి, అలాంటి సమస్యలు రావు

Haritha Chappa HT Telugu
Mar 31, 2024 07:00 AM IST

Mangoes: మామిడిపండ్ల సీజన్ వచ్చేస్తోంది. వేసవి వస్తోందంటే మామిడిపండ్ల కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది. వాటిని తినేముందు నీళ్ళల్లో అరగంట పాటు నానబెట్టాలని గుర్తుపెట్టుకోండి.

మామిడి పండు
మామిడి పండు (Pexels)

Mangoes: వేసవి పేరు చెపితే గుర్తొచ్చేది మామిడిపండ్లే. ఎందుకంటే ఇవి సీజనల్ పండ్లు. కేవలం ఎండాకాలంలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే వీటిని తినేందుకు ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. పండ్లలో రారాజుగా పేరు తెచ్చుకుంది మామిడిపండు. అయితే ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే... మామిడిపండును తినే ముందు వాటిని నీళ్లల్లో ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు కూడా సమర్థిస్తున్నారు. పూర్వం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాక తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మామిడి పండ్లను నీళ్లలో ఎందుకు నానబెట్టాలి?

మామిడి పండ్లను తినే ముందు కనీసం ఒక అరగంట నుంచి గంట పాటు నీటిలో నానబెట్టాలని పెద్దలు చెబుతారు. దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని సైన్స్ కూడా సమర్ధిస్తోంది. మామిడిపండ్లలో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. మామిడిపండ్లను ఎప్పుడైతే నీళ్లలో నానబెట్టామో అప్పుడు అదనంగా ఉత్పత్తి అయ్యే ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. నీళ్లలో నానబెట్టకుండా మామిడిపండును తింటే ఆ ఫైటిక్ ఆమ్లం కూడా శరీరంలో చేరుతుంది. అవి అదనపు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు మామిడిపండ్లు తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే నీటిలో పండు నానుతుందో అప్పుడు అందులోని వేడి తగ్గిపోతుంది. ఇలా నానబెట్టాక ఎన్ని మామిడి పండ్లు తిన్నా వేడి చేయదు. కానీ నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటే మాత్రం త్వరగా శరీరానికి వేడి చేసే అవకాశం ఉంది. అప్పుడు విరేచనాలు, వాంతులు అవుతాయి.

మామిడిపండ్లను ఓ అరగంట పాటు నీళ్లలో నానబెట్టడం వల్ల మామిడి తొక్క పై ఉన్న నూనె తొలగిపోతుంది. ఈ నూనె వల్ల కొందరికి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కనిపించని సూక్ష్మక్రిములు మామిడిపండు పై ఉంటాయి. అవన్నీ కూడా నీళ్లలో నానబెట్టడం వల్ల బయటకు పోతాయి. ఇలా నీళ్లలో నానబెట్టని మామిడిపండ్లు తినే వారిలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది. చర్మంపై దురదలు రావడం, బొబ్బలు కట్టడం వంటివి జరగొచ్చు.

నీటిలో నానబెట్టిన మామిడిపండు తింటే శరీరానికి అన్ని విధాలా ఆరోగ్యమే. అలాగే రుచి కూడా పెరుగుతుంది. ఫ్రిడ్జ్ లో చాలామంది పండ్లను నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన పండ్లను తినే ముందు కచ్చితంగా నీళ్లల్లో నానబెట్టండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉన్న శీతలీకరణ ప్రభావం వల్ల పండ్లలో కొన్ని సమ్మేళనాలు వాసనను, రుచిని మార్పు చేస్తాయి. అదే నీళ్ళల్లో నానబెట్టడం వల్ల మళ్ళీ మామిడి పండ్లు సాధారణ స్థితికి వస్తాయి. వాటి సహజమైన వాసనను తిరిగి పొందుతాయి. పండ్లు తేమవంతంగా మారుతాయి. కాబట్టి మంచి రుచిగా అనిపిస్తాయి.

మామిడిపండ్లను ఇలా నీళ్లలో నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మహిళలు, పిల్లలు కచ్చితంగా తినాల్సిన వాటిలో మామిడిపండు ఒకటి. ఇవి రక్తహీనత రాకుండా కాపాడతాయి. అంతేకాదు సులువుగా జీర్ణం అవుతాయి. సీజనల్‌గా దొరికే మామిడి పండ్లను వేసవిలో కచ్చితంగా తినండి. ముఖ్యంగా రోజుకో పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

మామిడిపండ్లలో కేలరీలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారనే భయం అవసరం లేదు. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. గుండె ఆరోగ్యానికి మామిడిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మామిడిపండ్లతో అనేక రకాల ఆహారాలు చేసుకోవచ్చు. మామిడిపండు స్మూతీలు, జ్యూసులు టేస్టీగా ఉంటాయి. అయితే మామిడిపండు గుజ్జుకు చక్కెరను చేర్చి మాత్రం తినకండి. ఇవి అధిక తీపిదనానికి గురవుతుంది. శరీరంలో చక్కెర చేరితే ఇతర సమస్యలు రావచ్చు. సహజమైన చక్కెరను కలిగి ఉంటే మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.

WhatsApp channel

టాపిక్