Raw Mango Fish Pulusu: పచ్చి మామిడి చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి-raw mango fish pulusu recipe in telugu know how to make this fish iguru ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Mango Fish Pulusu: పచ్చి మామిడి చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి

Raw Mango Fish Pulusu: పచ్చి మామిడి చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Mar 21, 2024 11:32 AM IST

Raw Mango Fish Pulusu: మామిడికాయల కాలం వచ్చేసింది. ఇక పచ్చి మామిడి తో ఎలాంటి వంటకాలు వండుకోవచ్చో తెలుసుకోండి. ఓసారి పచ్చిమామిడి చేపల పులుసును ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

చేపల పులుసు రెసిపీ
చేపల పులుసు రెసిపీ (Youtube)

Raw Mango Fish Pulusu: మామిడి చెట్లకు పూత పూసి కాయలు మొదలైపోయాయి. మరికొన్ని రోజుల్లో పండ్లు చేతికి వచ్చేస్తాయి. పచ్చిమామిడి ఇప్పుడు మార్కెట్లో అధికంగానే లభిస్తుంది. పుల్లని పచ్చిమామిడితో కొన్ని రకాల వంటకాలు చేసుకుంటే అవి టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా చేపల పులుసులో పచ్చి మామిడిని జత చేర్చి చూడండి. రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. పుల్ల పుల్లగా ఉండే ఈ చేపల పులుసు వండుతుంటేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో ఆ చేపల ఇగురు వేసుకొని తింటే రుచి మాములుగా ఉండదు. ఈ పచ్చి మామిడి చేపల పులుసు చేయడం చాలా సులువు.

పచ్చిమామిడి చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు

చేప ముక్కలు - అరకిలో

పచ్చి మామిడికాయ - ఒకటి

టమోటో - ఒకటి

ధనియాల పొడి - ఒక స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

మెంతి పొడి - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజులో

ఎండుకొబ్బరి తురుము - ఒక స్పూను

పచ్చిమామిడి చేపల పులుసు రెసిపీ

1. చేపల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. టమోటో ముక్కలు కోసి ప్యూరీని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. మామిడి కాయను పైన చెక్కు తీయకుండా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోవాలి.

6. అవి బాగా వేగాక అందులోనే టమాటో ప్యూరీని కూడా వేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి.

7. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాలపొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అది ఇగురులాగా అవుతుంది.

8. తర్వాత మామిడికాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

9. చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి.

10. ఒక ఐదు నిమిషాలు ఉడికాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి గిన్నెతో సహా ఇటూ అటూ కదిలించాలి.

11. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్న నీటిని వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

13. ఒక 20 నిమిషాల పాటు ఈ చేపల్ని ఉడకనివ్వాలి. చిన్న మంట మీద ఉడకనిస్తే చేపల పులుసు టేస్ట్ గా ఉడుకుతుంది.

14. చివరగా మెంతిపొడి, ఎండు కొబ్బరి తురుమును చల్లుకోవాలి.

15. ఒకసారి గిన్నెతో సహా పట్టుకుని చేపలను కలుపుకోవాలి. పైన కొత్తిమీర తరుగును జల్లి స్టవ్ కట్టేయాలి.

16. చేపలను ఎప్పుడూ గరిటతో కలపకూడదు. అవి ముక్కలుగా విడిపోతాయి.

17. మొత్తం గిన్నెను పట్టుకొని కదిలించడం ద్వారా వాటిని కలుపుకోవాలి. పుల్లపుల్లని పచ్చిమామిడి చేపల పులుసు రెడీ అయినట్టే.

ఇంక ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నంలో ఈ ఇగురును వేసుకుని తినండి. రుచి అదిరిపోతుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని లేదా కారాన్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది.

పచ్చిమామిడిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చిమామిడిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మార్నింగ్ సిక్‌నెస్, అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. పచ్చిమామిడిని వేసవిలో తినడం వల్ల వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.

ఇక చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్, మటన్ కన్నా చేపలే ఆరోగ్యానికి ఎంతో మంచివి. చేపలను ఎంత తిన్నా మీరు బరువు పెరగరు. అవి సులువుగా అరిగిపోతాయి. చేపల్లో మనకు అత్యవసరమైన విటమిన్ డి, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్ డి కేవలం సూర్యరశ్మి ద్వారానే అందుతుంది అనుకుంటారు. చేపల్లో కూడా ఇది కొద్ది మొత్తంలో ఉంటుంది. చేపలను అధికంగా తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మానసిక ఇబ్బందులతో ఉన్నవారు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్ బారిన పడకుండా చేస్తుంది. ఎన్నో రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకునే శక్తి చేపలకు ఉంది.

Whats_app_banner