Milk Skin Care Tips : ముఖంపై ముడతలు పొగొట్టేందుకు పాలను ఇలా వాడుకోండి
Milk Face Packs For Wrinkles : ముఖంపై ముడతలు చికాకుగా అనిపిస్తాయి. మన అందాన్ని తగ్గిస్తాయి. అయితే పాలను ఉపయోగించి వీటిని పొగొట్టుకోవచ్చు.
చక్కని మృదువైన సిల్కీ చర్మంతో ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి వయసు మీద పడినట్టుగా అనిపిస్తుంది. ఇవేకాకుండా మన జీవనశైలి, కొన్ని అలవాట్లు, ఎండలో తిరగడం, పర్యావరణ కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ఇలా చాలా త్వరగా చర్మంపై ముడతలు రావడం మొదలవుతుంది.
ముఖంపై ముడతలు పోవాలంటే మన ఇంటి వంటగదిలోని కొన్ని ఉత్పత్తులు సహాయపడతాయి. అది కూడా మనం రోజూ వాడే పాలు ఈ చర్మం ముడతలను పోగొట్టడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పాలతో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ముఖంపై ముడుతలను తొలగించడంలో మీకు సహాయపడే కొన్ని పాల ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా మీరు చర్మం ముడతలను త్వరగా వదిలించుకోవచ్చు.
ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకోండి. తర్వాత కాటన్ బాల్ తీసుకుని పాలలో ముంచి ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 10-15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మంపై ఉన్న మురికి తొలగిపోయి చర్మం ముడతలు పోతాయి.
ఒక గిన్నెలో అలోవెరా జెల్, పాలు తీసుకుని బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి 15-20 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు వాడితే చర్మం ముడతలు సహజంగా పోతాయి.
ఒక గిన్నెలో పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి పేస్ట్ లా చేయాలి. అనంతరం దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. మంచి ఫలితాలను పొందడానికి దీన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.
ముందుగా మందార పువ్వును నీడలో ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత 2 టీస్పూన్ల మందార పూల పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పాలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే చర్మంపై ముడతలు పోతాయి.
ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. అనంతరం ముఖం, మెడపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే చర్మం ముడతలు పోయి చర్మం నిగనిగలాడుతుంది, సిల్కీగా మారుతుంది.
పైన చెప్పిన చిట్కాలతోపాటుగా రోజూ తీసుకునే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. బయట ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోవాలి. మద్యం ఎక్కువగా తాగకూడదు. రోజూ ఉదయం సూర్యరశ్మికి కాసేపు నడవాలి. శరీరంలో నుంచి చెమట పోనివ్వాలి. ఎండతగలకూడదని ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం కూడా సరికాదు. మీ మెుత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. పాలతో చేసిన ఫేస్ మాస్క్‌లు సమర్థవంతంగా పని చేస్తాయి.