Milk Curdling: పాలు విరిగిపోయాయా? వాటిని పడేయకుండా ఇలా ఉపయోగించుకోండి
Milk Curdling: పాలు విరిగిపోతే ఎక్కువ మంది బయటపడేస్తారు. లేదా ఓపికగా పనీర్ చేస్తారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఆ పాలను బయటపడేస్తారు. వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు.
Milk Curdling: ప్రతి ఇంట్లోనూ అప్పుడప్పుడు పాలు విరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. విరిగిపోయిన పాలను బయటపడేసే కన్నా వాటిని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. ఎక్కువ మందికి పనీర్ చేయడం తెలుసు. విరిగిన పాలతో పనీర్ మాత్రమే కాదు, దాన్ని అనేక పద్ధతుల్లో తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంది.
విరిగిన పాలను ఏం చేయాలి?
విరిగిపోయిన పాలతో పనీర్ చేసుకోవడం అందరికీ తెలిసినదే. పాలను ఒక క్లాత్ లో వేసి బాగా పిండి కావాల్సిన ఆకారంలో పనీరు వచ్చేలా చేసుకోవాలి. అలాగే విరిగిపోయిన పాలను డిప్ గా మళ్లీ ఉపయోగించుకోవచ్చు. విరిగిపోయిన పాలను వడకట్టి నీటిని తీసేయాలి. మిగిలిన పదార్థాన్ని మిక్సీలో వేసి కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లెక్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక కప్పులో వేసి కాస్త ఉప్పు, మిరియాల పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. తర్వాత దాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
కొన్ని బేకింగ్ వంటకాల్లో మజ్జిగను వినియోగిస్తాము. మజ్జిగకు బదులు ఇలా విరిగిపోయిన పాలను కూడా ఉపయోగించవచ్చు. పాన్ కేకులు, బిస్కెట్లు, కేకులు, మఫిన్లు వంటివి మృదువుగా అవ్వడానికి ఈ విరిగిపోయిన పాలు ఉపయోగపడతాయి.
విరిగిపోయిన పాలతో క్రీమీ టమోటో సూప్, క్రీమీ పాస్తా వంటివి చేసుకోవచ్చు. విరిగిపోయిన పాలను వడకట్టి నీటిని పారబోయాలి. అవి విరిగిపోయిన పాల ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా స్మూతీలా చేయాలి. టమాటో సూప్‌లో ఈ క్రీమ్ ను కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. అదే క్రీమీ టమోటో సూప్.
మొక్కలకు...
విరిగిపోయిన పాలు మొక్కలకు సహజ ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలు శోషించుకోవడంతోపాటు నేల నాణ్యతను పెంచుతాయి. విరిగిపోయిన పాలు, నీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బకెట్ నీళ్లలో ఈ మిశ్రమాన్ని కలిపేసి అన్ని మొక్కలకు వేయాలి. ఇలా వేయడం వల్ల దుర్వాసన కూడా రాదు.
ఇంట్లో తయారు చేసే ఫేస్ ప్యాక్ లో ఈ విరిగిపోయిన పాలను కలిపి ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. తేనే, ఓట్స్, మెత్తని పండ్లతో చేసే ఫేస్ ప్యాక్ లలో ఈ విరిగిపోయిన పాలను కూడా వేసి మెత్తగా కలిపి చర్మానికి రాసుకుంటే ఎంతో మంచిది.
టాపిక్