bone strength food : క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలివే.. ఇవి తింటే ఎముకలు పదిలం-different foods for bone strength to have on daily basis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bone Strength Food : క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలివే.. ఇవి తింటే ఎముకలు పదిలం

bone strength food : క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలివే.. ఇవి తింటే ఎముకలు పదిలం

HT Telugu Desk HT Telugu
Sep 03, 2023 07:29 PM IST

bone strength food: ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.

దృఢమైన ఎముకల కోసం ఆహారం
దృఢమైన ఎముకల కోసం ఆహారం (pexels)

మనిషి ప్రశాంతంగా తన రోజు వారీ కార్యక్రమాల్ని నిర్వహించాలంటే కచ్చితంగా బలమైన ఎముకలు అవసరం. దంతాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే వాటికి అవసరమైనంత కాల్షియం, విటమిన్‌ డీ లను శరీరానికి అందించాలి. 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న ఆడ, మగవారికి రోజుకు దాదాపుగా 1000 ఎంజీ వరకు కాల్షియం అవసరం అవుతుంది. అదే 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉన్న మగవారికి 1000 ఎంజీ వరకు, ఆడవారికి 1200ఎంజీ వరకు కాల్షియం అవసరం పడుతుంది. ఈ అవసరాలని మనం తినే ఆహార పదార్థాల ద్వారా పూరించాల్సి ఉంటుంది. ఏఏ ఆహారాల్లో కాల్షియం ఎంత దొరుకుతుంది అనేది అవగాహన పెంచుకోవాలి. అప్పుడు రోజువారీ ఆహారంలో వాటిని తినడం ద్వారా మన ఎముకల్ని ఎప్పుడూ బలంగా ఉండేలా చూసుకోవచ్చు.

నువ్వులు ఒక్కటి చాలు :

నువ్వులని కాల్షియం బాండాగారం అని చెప్పవచ్చు. 100 గ్రాముల నువ్వుల్లో ఏకంగా 975 ఎంజీ కాల్షియం దొరుకుతుంది. అంటే దాదాపుగా మన రోజు వారీ అవసరానికి సరిపడా కాల్షియం ఈ ఒక్క నువ్వుల నుంచే లభించేస్తుందన్నమాట. అలాగే వేరు శెనగ, బాదాం లాంటి గింజల్లోనూ కొంత మోతాదులో దొరుకుతుంది.

పాల ఉత్పత్తులు :

డైరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా కాల్షియం దొరుకుతుంది. పాలు, పెరుగు, చీజ్‌, పనీర్‌, జున్నల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు పాలను, ఒక కప్పు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. 200 గ్రాముల పెరుగులో 420ఎంజీ వరకు కాల్షియం ఉంటుంది. 250ఎంఎల్‌ పాలలో 300ఎంజీ వరకు దొరుకుతుంది.

ఆకు పచ్చటి కూరగాయలు, ఆకు కూరలు :

కరివేపాకు, పుదీన, బచ్చలికూర, పాలకూర లాంటి ఆకు కూరల్లో ఎక్కువగా కాల్షియం లభిస్తుంది. అలాగే ఆకు పచ్చగా ఉండే కాయగూరల్లోనూ ఇది దొరుకుతుంది. ఆకుపచ్చ బటానీల్లోనూ ఉంటుంది. వీటన్నింటిలో చూసుకుంటే కరివేపాకులో అధిక మొత్తంలో ఇది లభ్యం అవుతుంది. వంద గ్రాముల కరివేపాకు తింటే దాని ద్వారా ఏకంగా 830ఎంజీ కాల్షియం మన శరీరానికి దొరికేస్తుంది.

చిక్కుళ్ళు, ధాన్యాలు:

బీన్స్, పప్పు ధాన్యాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సోయాబీన్స్‌, బీన్స్‌, శనగలు, పెసర్లు తదితరాల్లో కొద్ది మొత్తంలో ఇది దొరుకుతుంది. వీటితోపాటు ఆహారంలో నారింజ, సోయ మిల్క్‌, సోయా చంక్స్‌ లాంటి వాటిని చేర్చుకుంటే సరిపోతుంది.

Whats_app_banner