Chilli Paneer: చిల్లీ పనీర్.. ఒకసారి ఇలా చేసి చూడండి అందరికీ నచ్చేస్తుంది
Chilli Paneer: చిల్లి చికెన్ లాగే చిల్లి పనీర్లో ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శాకాహారులకు ఇది కచ్చితంగా నచ్చే రెసిపీ.
Chilli Paneer: చిల్లీ పనీర్ అనగానే రెస్టారెంట్ కి వెళ్లి తినాలేమో అనుకోవద్దు. ఇంట్లో చాలా సింపుల్ గా దీన్ని చేసుకోవచ్చు. చిల్లి పనీర్ చేయడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత టేస్టీగా దీన్ని లాగించేయొచ్చు. సాయంత్రం పూట స్నాక్ గా తింటే మజాగా ఉంటుంది. లేదా బిర్యాని వండుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చిల్లీ పనీర్ పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చిల్లీ పనీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు - 200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
కార్న్ ఫ్లోర్ - ఒకటిన్నర స్పూను
గుడ్డు - ఒకటి
నూనె - తగినంత
జీలకర్ర - అర స్పూను
నీరు - తగినంత
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
చిల్లీ గార్లిక్ సాస్ - ఒక స్పూను
అజినోమోటో - చిటికెడు
ఎర్ర క్యాప్సికం - ఒకటి
పసుపు క్యాప్సికం - ఒకటి
సోయాసాస్ - ఒక స్పూను
ధనియాల పొడి - అర స్పూను
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
చిల్లి పనీర్ రెసిపీ
1. పనీర్ ముక్కలను ఒక గిన్నెలో వేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్, కాస్త నీరు వేసి పనీర్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
2. ఆ తర్వాత గుడ్డును కూడా వేసి వాటికి పట్టించాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వాటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
4. ఆ నూనె వేడెక్కాక ఈ పనీర్ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి.
5. అవి ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో జీలకర్ర, వెల్లుల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, ధనియాల పొడి, చిల్లీ గార్లిక్ సాస్, ఎర్ర కాప్సికం తరుగు, పసుపు క్యాప్సికం తరుగు, సోయాసాస్, పసుపు, కారం, కరివేపాకులు, ఉప్పు, నిమ్మరసం వేసి వేయించుకోవాలి.
7. అవన్నీ వేగాక పనీర్ ముక్కలను కూడా వేసి టాస్ చేయాలి.
8. ఈ మొత్తం మిశ్రమం పన్నీర్ కు బాగా పట్టాక పైన కొత్తిమీరను చల్లుకోవాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
9. అంతే చిల్లీ పనీర్ రెడీ అయినట్టే. దీన్ని తింటే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పిల్లలు దీన్ని అడగడం ఖాయం.
10. మీకు ఒక స్పైసీగా కావాలంటే దీనిలో మరికొంచెం పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకుని స్పైసీగా చేసుకోవచ్చు. లేదా సాధారణంగా కూడా వండుకోవచ్చు. మీ పిల్లలు ఎలా ఇష్టపడతారో దానిని ప్రకారం వండండి.
దీనిలో మనం గుడ్డు వినియోగించాము. ఈ చిల్లీ పనీర్ లో మీకు గుడ్డు నచ్చకపోతే వేయాల్సిన అవసరం లేదు. కాస్త కార్న్ ఫ్లోర్ ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదా రెండు స్పూన్ల శెనగపిండిని కలుపుకున్న చాలు. పనీరు తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన వంటకం అని చెప్పుకోవాలి. శాకాహారులకు ప్రోటీన్ కోసం పనీర్ మంచి ఎంపిక. కాబట్టి అప్పుడప్పుడు చిల్లీ పనీర్ ను ఇంట్లోనే చేసుకుని చూడండి. మీ ఇంటిల్లిపాదికి కచ్చితంగా నచ్చుతుంది.
టాపిక్