Pineapple: గర్భం ధరించిన స్త్రీలు పైనాపిల్ పండును తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది?-shouldnt pregnant women eat pineapple what does science say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pineapple: గర్భం ధరించిన స్త్రీలు పైనాపిల్ పండును తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది?

Pineapple: గర్భం ధరించిన స్త్రీలు పైనాపిల్ పండును తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది?

Haritha Chappa HT Telugu
Mar 24, 2024 09:00 AM IST

Pineapple: గర్భం ధరించాక స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏం తినాలో? ఏది తినకూడదో? ముందుగానే తెలుసుకుంటారు. అయితే గర్భం ధరించాక పైనాపిల్ తినకూడదనే వాదన ఎక్కువమందిలో ఉంది.

పైనాపిల్
పైనాపిల్ (pexel)

Pineapple: పైనాపిల్ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఇది ఒకటి. కానీ గర్భం ధరించాక మాత్రం పైనాపిల్ తినడానికి ఎక్కువ మంది దూరం పెడతారు. గర్భం ధరించాక పైనాపిల్ ని తినకూడదని అంటారు. బొప్పాయి, పైనాపిల్... ఈ రెండూ తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని భావిస్తారు. ఇది ఎంతవరకు నిజమో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

పైనాపిల్ తినవచ్చా?

గర్భం ధరించాక స్త్రీ ఎన్నో జాగ్రత్తలను తెలుసుకుంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. వాటిల్లో ఒకటి పైనాపిల్ తినకూడదని. గర్భం ధరించాక పైనాపిల్ తినకూడదని ఏ అధ్యయనమూ చెప్పలేదు. పైనాపిల్ మంచిది కాదని కూడా ఏ పరిశోధనా తేల్చలేదు. గర్భం ధరించాక కూడా పైనాపిల్ తినవచ్చు. మితంగా తింటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలతో ఆపేయాలి. అలా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి పుష్కలంగా శరీరానికి అందుతుంది. ఈ పైనాపిల్ పండు తినడం వల్ల ముందస్తు ప్రసవం జరుగుతుందని లేదా గర్భస్రావం జరుగుతుందని విని ఉంటారు. అవన్నీ అపోహలే. వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

అబార్షన్ అవుతుందా?

పైనాపిల్‌లో బ్రోమలైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. బ్రోమలైన్ శరీరంలోని ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తుంది. దానివల్లే పైనాపిల్ వద్దని చెబుతారు. అయితే బ్రోమలైన్ అనే టాబ్లెట్లు బయట అమ్ముతారు. ఆ బ్రోమలైన్ టాబ్లెట్లు, పైనాపిల్‌లో ఉండే బ్రోమలైన్ ఎంజైమ్ ఒకటే అనుకునే వారి సంఖ్య ఎక్కువ. బ్రోమలైన్ టాబ్లెట్లను వేసుకుంటే ఇలా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ జరుగుతుంది. కానీ పైనాపిల్ లో ఉన్న బ్రోమలైన్ తినడం వల్ల అలా జరుగుతుందని ఏ శాస్త్రీయ ఆధారము లేదు. పైనాపిల్‌లో ఉండే బ్రోమలైన్ గర్భాన్ని ప్రభావితం చేయలేదు. పైనాపిల్ మితంగా తింటే గర్భిణీలకు మంచే జరుగుతుంది.

గర్భం ధరించాక ఐదు రకాల ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు, ప్రోటీన్ నిండిన మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్, వంటివి. ఈ ఐదు సమూహాల నుంచి వచ్చిన ఆహారాలను తినడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. గర్భస్థ శిశువులు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. నీళ్లు కూడా అధికంగా తాగడం చాలా అవసరం.

కాబట్టి గర్భం ధరించాక పైనాపిల్‌ను మానేయాలని చూడకండి. రోజుకో ముక్క తినండి. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏ ఆహారాన్ని అయినా అధికంగా తింటే అనర్థమే జరుగుతుంది. అలాగే పైనాపిల్ ను కూడా అధికంగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్టులు వస్తాయి. కాబట్టి గర్భిణులు రోజుకు ఒక ముక్కతోనే ఆపేయాలి. దీనివల్ల మీకు కావాల్సినంత విటమిన్ సి శరీరంలో చేరుతుంది.

Whats_app_banner