Sleeping With Loved Ones । ప్రియమైన వారితో నిద్రిస్తే.. ఆ సుఖమే వేరు!-share your bed know the benefits of sleeping with your loved ones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping With Loved Ones । ప్రియమైన వారితో నిద్రిస్తే.. ఆ సుఖమే వేరు!

Sleeping With Loved Ones । ప్రియమైన వారితో నిద్రిస్తే.. ఆ సుఖమే వేరు!

HT Telugu Desk HT Telugu
May 24, 2023 08:51 PM IST

Sleeping With Loved Ones: మీకు ఇష్టమైన భాగస్వామితో నిద్రించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Sleeping with loved ones
Sleeping with loved ones (istock)

Sleeping With Loved Ones: ప్రియమైన వ్యక్తి పక్కన పడుకున్నపుడు హాయిగా వస్తుందని, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఒంటరిగా పడుకునే వారితో పోల్చి చూస్తే, జంటగా నిద్రపోయే వారిలో నిద్రలేమి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే స్లీప్ జెర్క్స్ మిమ్మల్ని మేల్కొల్పవచ్చు. భవిష్యత్తుపై బెంగ, జీవితంలో జరిగిన చేదు సంఘటనలు గుర్తుకు రావచ్చు. అనవసరపు భయాందోళనలు, పీడకలలతో మీకు నిద్రాభంగం కలగవచ్చు.

అదే సమయంలో భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు మీరు ఒంటరి కాదు, మీకు జీవితంలో ఒక భరోసా ఉందనే భావన కలుగుతుంది. మీరు ప్రశాంతమైన మనసుతో నిద్ర పోగలుగుతారు. మీ నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. వారు గురకపెట్టి మీ నిద్రను పాడు చేయనంత వరకు మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. సరైన నిద్రవల్ల మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉంటారు.

మీకు ఇష్టమైన భాగస్వామితో నిద్రించడం వల్ల మీ శరీరంలో ఒత్తిడిని తగ్గించే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి, అవేమిటంటే..

ఆక్సిటోసిన్- ఆక్సిటోసిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచే ప్రేమ హార్మోన్.

సెరోటోనిన్- ఈ హార్మోన్ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.

నోర్పైన్ఫ్రైన్- ఇది నిద్రను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది.

వాసోప్రెసిన్- ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, కార్టిసాల్‌ను తగ్గిస్తుంది.

ప్రొలాక్టిన్- ఈ హార్మోన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ప్రియమైన వ్యక్తితో మంచం పంచుకోవడం వలన వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. శృంగారభరితంగా ఉంటుంది, వీటితో పాటు కొన్ని ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలిసి నిద్రిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • కలిసి నిద్రించడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుంది .
  • కలిసి నిద్రపోవడం వల్ల భయాందోళన తగ్గుతుంది.
  • నిద్రిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు సురక్షితంగా భావిస్తారు,
  • కలిసి నిద్రించడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం అవుతుంది.
  • మీరు భాగస్వామితో నిద్రిస్తున్నప్పుడు అతిగా ఆలోచనలు రావు, అందువల్ల త్వరగా నిద్రవచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • మీరు ప్రతి రాత్రి మీరు ఇష్టపడే వ్యక్తితో నిద్రిస్తున్నప్పుడు, మీ శరీరం డోపమైన్‌ను విడుదల చేస్తుంది, ఇది మీకు ఆనందాన్ని కలిగించే హార్మోన్.

ప్రతీ మనిషికి నిద్ర చాలా ముఖ్యం. కంటినిండా నిద్రపొతే అంతకుమించిన ఆనందం ఉండదు, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. కాబట్టి మీ ప్రియమైన వ్యక్తితో కలిసి హాయిగా నిద్రపోండి, ఆనందంగా జీవించండి.