Life changing habits: జీవితం మారాలంటే రోజులు మారాలి.. అవి మారాలంటే మీరు ఈ 20 నియమాలు పాటించాలి-see the list of 20 life changing habits to get success and happy life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Life Changing Habits: జీవితం మారాలంటే రోజులు మారాలి.. అవి మారాలంటే మీరు ఈ 20 నియమాలు పాటించాలి

Life changing habits: జీవితం మారాలంటే రోజులు మారాలి.. అవి మారాలంటే మీరు ఈ 20 నియమాలు పాటించాలి

Koutik Pranaya Sree HT Telugu
Aug 17, 2024 05:00 AM IST

Life changing habits: జీవితం మారాలంటే ముందు రోజులు మారాలి. ప్రతిరోజూ ఏదో ఒకలా గట్టెక్కించేస్తే జీవితంలో ఏ మార్పు రాదు. అందుకోసం రోజూవారీ దినచర్యలో కొన్ని నియమాలు ఉండాలి. వాటిని తప్పకుండా పాటించాలి. మీరనుకున్న లక్ష్యానికి మిమ్మల్ని చేరవేసేలా ఉండాలీ ఆ అలవాట్లు. అలాంటి జాబితా ఒకటి చూసేయండి.

జీవితాన్ని మార్చేసే అలవాట్లు
జీవితాన్ని మార్చేసే అలవాట్లు (freepik)

జీవితం ఆనందంగా ఉండాలంటే మంచి అలవాట్లు ఉండాలి. అలాగని ఉన్నట్లుండి మారిపోతే జీవితంలో మ్యాజిక్ జరిగిపోదు. రోజూవారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని కొత్త సూత్రాలు పాటించడం అలవాటుగా మారిపోవాలి. అలాంటి 20 అలవాట్లేంటో చూద్దాం.

1. అలారం పెట్టుకున్న సమయానికి తప్పకుండా నిద్ర లేవడం. ఫోన్ బదులుగా అలారం క్లాక్ వాడటం అలవాటవ్వాలి. ఫోన్ మరో గదిలో రాత్రి పూటే పెట్టేయాలి.

2. ఉదయాన్నే ఆరోజు ఏయే పనులు పూర్తి చేయాలో ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి.

3. తప్పకుండా కనీసం అరగంట వ్యాయామం, నడక లేదా యోగా చేయాలి.

4. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి.

5. చదవడం అలవాటు చేసుకోవాలి. బలవంతంగా కాకుండా మీకు నచ్చే పుస్తకం ఏదైనా తెచ్చుకుని రోజుకు కనీసం పది నిమిషాలు చదవడం మొదలుపెట్టాలి. అదే అలవాటుగా మారిపోతుంది.

6. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. మీరు అనుకున్న సమయాన్ని కచ్చితంగా ఫాలో అవ్వాలి.

7. స్క్రీన్ వాడే సమయం తగ్గించాలి. తినేటప్పుడు, నిద్రపోయే గంట ముందు.. ఇలా కొన్ని సమయాల్లో అస్సలు ఫోన్లు, ల్యాప్ టాప్ వాడకూడదనే నియమం పెట్టుకోవాలి. క్రమంగా ఆ సమయం పెంచుతూ పోవాలి.

8. మీవల్ల కాని పనులు, మీకు నచ్చని విషయాలకు NO చెప్పడం నేర్చుకోవాలి. అన్నింటినీ మొహమాటంతో ఒప్పేసుకోకూడదు. దానివల్ల చాలా ప్రశాంతత దొరుకుతుంది.

9. రోజూ కనీసం అరగంట అయినా ప్రకృతిలో గడపాలి. మీ దగ్గర్లో ఉన్న పార్కుకు వెళ్లడం మంచి ఆలోచన.

10. సానుకుల ఆలోచనా (Positive thinking) విధానం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో మంచి చూడాలి. నెగటివ్ ఆలోచనలు వచ్చినా వాటినుంచి తొందరగా బయటపడగాలి.

11. మీ ఎదుగుదలకు సహాయం చేసే ఏదైనా కొత్త కోర్స్, కొత్త హాబీ, కొత్త నైపుణ్యం, ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు.. ఇలా ఏదైనా సాధించాలంటే అది మీ రోజూవారీ దినచర్యలో భాగం అవ్వాలి. దానికోసం తప్పకుండా కొంత సమయం కేటాయించాలి.

12. మీరు తప్పు చేశారని మీకు తెలిస్తే వెంటనే క్షమాపణ అడగాలి.

13. స్నేహితులతో, కుటుంబంతో కలిసి గడపడానికి సమయం కేటాయించాలి. కనీసం వారంలో ఒక్కసారయినా వాళ్లతో కలిసి బయటికి వెళ్లగలిగేలా ప్లాన్ చేసుకోవాలి.

14. ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించడం మానుకోవాలి.

15. ఏదైనా కొనడానికి షాపింగ్ వెళ్లేముందు మీ దగ్గర ఇది వరకు ఏమేం ఉన్నాయో చూసుకోండి. సరకులు, బట్టలు.. ఏవైనా సరే. ప్రతిదానికి ఈ నియమం వర్తిస్తుంది. డబ్బు ఆదా అవుతుంది.

16. రేపేం వండుకోవాలో ముందురోజే ఆలోచించండి. వంట చేయడం చాలా తేలికవుతుంది. ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది. తిండి బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది.

17. హడావుడిగా, గాబరాగా, పరిగెత్తుతూ పని చేయడం మానేయండి. ఏ పనైనా ప్రశాంతంగా పూర్తయ్యేలా చూసుకోండి.

18. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే.. మనకెందుకులే అని పక్కకు వెళ్లిపోకండి. మీకు చేతనైనంత సహాయం చేయండి.

19. మీలో ఉన్న చెడు గుణాలేంటో మీకే బాగా తెలుస్తాయి. అవేంటో గుర్తించండి. వాటి జోలికి పోకండి.

20. చివరగా నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచాక మీ బెడ్షీట్లు, తలగడలు మీరే సర్దుకోండి. ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఉదయాన్నే బెడ్ సరిచేయడం వల్ల క్రమశిక్షణతో మీరోజు మొదలవుతుంది.