Intimate Health: శృంగార జీవితానికి ఉప్పు.. ముప్పు కలిగిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి
Intimate Health - Salt Intake: ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అయితే, శృంగార జీవితంపై కూడా ఉప్పు వల్ల ఎఫెక్ట్ ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శృంగార జీవితంపై తీసుకునే ఆహారం కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. లైంగిక జీవితం బాగుండాలంటే తినే ఫుడ్ చాలా ముఖ్యం. ఉప్పుకు.. శృంగారానికి కూడా లింక్ ఉంటుంది. కావాల్సిన దాని కన్నా ఎక్కువగా ఉప్పు తీసుకుంటే.. శృంగార జీవితంపై దుష్ప్రభావం పడుతుంది. పడకపై కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
బ్లడ్ ప్రెజర్ పెరిగే రిస్క్
ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని వివిధ భాగాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. లైంగిక ప్రక్రియలో భాగమైన అవయవాలకు కూడా రక్తం సరిగా అందదు. దీనివల్ల శృంగార జీవితం ప్రభావితం అవుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరితే పురుషుల్లో అంగ స్తంబన సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో యోని పొడిబారే ప్రమాదం పెరగొచ్చు.
ఎండోథియాల్‍కు ఇబ్బంది
రక్త నాళాలు రిలాక్స్‌గా ఉండి రక్తప్రసరణ మెరుగ్గా ఉండేందుకు నైట్రిక్ యాసిడ్ సహకరిస్తుంది. శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదలకు ఎండోథిలియాల్ పనితీరు మెరుగ్గా ఉండాలి. అయితే, ఉప్పు ఎక్కువగా తింటే ఎండోథిలియాల్ కణాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీని పని తీరు తగ్గిపోతుంది. ఎండోథిలియాల్ పనితీరు సరిగా లేకపోతే లైంగిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం పడుతుంది.
ధమనులకు సమస్య
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనులు బిరుసుగా మారే అవకాశాలు ఉంటాయి. ధమనులు బిరుసుగా అయితే రక్త నాళాలు వ్యాకోచించేందుకు కష్టంగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేందుకు రక్తనాళాలు ఫ్లెక్సిబుల్‍గా ఉండడం చాలా ముఖ్యం. రక్తప్రసరణ సరిగా లేకపోతే లైంగిక చర్య సవ్యంగా సాగదు. అందుకే ధమనులు బిరుసుగా అయితే శృంగార జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవాలి.
వంటకాల్లో సరిపడా ఉప్పు వేసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే రుచి కోసం అని కొందరు ఉప్పు మరింత వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అధికంగా ఉప్పు తీసుకోవడం అలవాటు అయిపోతుంది. ఇది ఆరోగ్యంపై చాలా రకాలుగా ప్రభావం చూపుతుంది. అలాగే, శృంగార జీవితానికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే ఉప్పు తక్కువగానే తీసుకోవాలి.
ఉప్పు ఎక్కువైతే ఈ ఇబ్బందులు కూడా..
ఉప్పు అధికంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తరచూ తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే రిస్క్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ అధికంగా అవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కడుపుకు ఇబ్బందిగా అనిపించడం, తరచూ దాహం వేయడం లాంటివి సమస్యలు ఎదురుకావొచ్చు.