Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వస్తే సురక్షితంగా ఉండే దేశాలు ఇవే-safest countries these are the countries that will be safe in case of third world war ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వస్తే సురక్షితంగా ఉండే దేశాలు ఇవే

Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వస్తే సురక్షితంగా ఉండే దేశాలు ఇవే

Haritha Chappa HT Telugu
Feb 23, 2024 06:30 PM IST

Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వస్తే దాదాపు అన్ని దేశాలపైన ప్రభావం పడుతుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం చాలా సురక్షితంగా ఉంటాయి. ఆ దేశాల జాబితా ఇదిగో.

సురక్షిత దేశాల జాబితా
సురక్షిత దేశాల జాబితా (shutterstock)

Safest Countries: ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో ఊహించలేం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందేమోనని అనుకున్నారు. అది ఇప్పుడు చల్లబడింది. ఉగ్రవాదం కూడా విపరీతంగా పెరిగిపోతుండడంతో కొన్ని పెద్ద దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కొన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అలాగే సహజ వనరులు క్షీణించడం వల్ల కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని సాధించేందుకు యుద్ధం చేయవచ్చు. ఇలా ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్దం వస్తే ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ప్రభావితం అవుతాయి. అక్కడున్న ప్రజలకు నష్టం తప్పదు. కానీ కొన్ని దేశాలు మాత్రం సురక్షిత ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ దేశాలు భౌగోళికంగా సమృద్ధిగా ఉన్న వనరుల కారణంగా మూడో ప్రపంచ యుద్ధానికి ప్రభావితం అయ్యే అవకాశం చాలా తక్కువ. ఆ దేశాలేవో ఇప్పుడు చూద్దాం.

ఫిజీ

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం ఫిజీ. ఇక్కడ జనాభా చాలా తక్కువ. శాంతియుతంగా ఉండే దేశం ఇది. దట్టమైన అడవులతో, సమృద్ధిగా ఉన్న ఖనిజాలతో, పుష్కలంగా ఉన్న చేపలతో ఫిజీ వర్ధిల్లుతోంది. మూడో ప్రపంచ యుద్ధం వంటి సంక్షోభ సమయాలు వచ్చినా ఫిజీకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు.

ఐస్‌లాండ్

గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది ఐస్ లాండ్. దీనిలో మంచినీటి నిల్వలు ఎక్కువ. ఇది వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడదు. సముద్రం మధ్యలో ఆనందంగా ఉండే అందమైన ద్వీపం ఇది. యుద్ధాలతో దీనికి సంబంధం లేదు.

గ్రీన్ ల్యాండ్

గ్రీన్ ల్యాండ్ చాలా అందంగా ఉండే చిన్న దేశం. స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం ఇది. డెన్మార్క్, ఐరోపాలో ఏదైనా యుద్ధ పరిస్థితులు ఏర్పడినా కూడా వాటికి దూరంగా ఉంటుంది గ్రీన్ ల్యాండ్. రాజకీయంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండే దేశం ఇది. పర్వత భూభాగం ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీవించేందుకు సురక్షితంగా ఉంటుంది. ఇతర దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నా గ్రీన్ ల్యాండ్ మీదకు ఆ బాంబులు వచ్చి పడే అవకాశం కూడా తక్కువే.

న్యూజిలాండ్

స్థిరమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశం న్యూజిలాండ్. దీని చరిత్రలో యుద్ధాలు చాలా తక్కువ. అభివృద్ధి చెందిన దేశం కూడా. ఇక్కడ సారవంతమైన నేల, స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ దేశంలో సొంత ఆహార ఉత్పత్తి కూడా ఎక్కువే. పర్వత భూభాగాల మధ్య సురక్షితంగా ఉంటుంది. దీనిపై దండయాత్రలు చేసే దేశాలు లేవు.

భూటాన్

హిమాలయాలతో ఉండే ప్రత్యేకమైన దేశం భూటాన్. ఇది అన్ని దేశాలకు దూరంగా ఉంటుంది. దౌత్యపరమైన చిక్కులను కూడా తెచ్చుకోదు. భూటాన్ పై దండయాత్ర చేసిన వారి సంఖ్య చరిత్రలో చాలా తక్కువ. ఇది తన సొంత వనరులతోనే మనుగడ సాగిస్తోంది. భూటాన్ తో యుద్ధానికి దిగిన దేశాలు ఏమీ లేవు.

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ లో అందమైన పర్వతాలు ఉంటాయి. పర్వతాల మధ్య అందంగా ఉండే ఈ దేశం చాలా సురక్షితమైనది. ఇందులో ఎన్నో బంకర్లు ఉన్నాయి. చుట్టూ పర్వతాలు కూడా ఉన్నాయి. కాబట్టి పొరుగున ఉన్న దేశాలు యుద్ధాలకు దిగినా కూడా ప్రజలను రక్షించుకునే సొంత వ్యవస్థ వీరికి ఉంది.

ఇండోనేషియా

ఇండోనేషియా సాధారణంగానే ప్రపంచ రాజకీయ సమస్యలపై పెద్దగా స్పందించదు. తన తటస్థ వైఖరితో ఉంటుంది. దేశ అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుంది. అలాగే ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏ దేశాలు దీని జోలికి పోవు. కాకపోతే ఇండోనేషియా ఎక్కువగా సునామీలకు, భూకంపాలకు గురవుతూ ఉంటుంది.

టువలు

చిన్న దేశాల్లో టువాలు ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపదేశం టువాలు. ఇది ఏకాంతంగా ఉండే దేశం. తక్కువ జనాభాతో అతి తక్కువ వనరులతోనే ఆనందంగా ఉంటున్న దేశం ఇది. ప్రపంచ యుద్ధాలతో సంబంధం లేకుండా జీవిస్తోంది. ఇక్కడ ప్రజలు తమ సొంత ఆహారాన్ని, అవసరాలను వారే తీర్చుకుంటారు. ఇతర దేశాలపై దిగుమతులపై ఆధారపడరు. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా టువాలు ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ ప్రజలు సాధారణంగానే జీవిస్తారు.

టాపిక్