Summer Foreign Tour । వేసవి సెలవులలో విదేశాలలో విహరించాలనుకుంటే, ఈ దేశాలు బెస్ట్!
Summer Foreign Tour: ఈ వేసవి సెలవులలో విదేశీ టూర్ ప్లాన్ చేస్తుంటే ఎలాంటి దేశాలకు విహారయాత్ర చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.
Summer Foreign Tour: వేసవికాలంలో చాలా మంది సెలవులను తీసుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కొన్నాళ్లపాటు విహారయాత్ర చేసి వస్తారు. ఎండాకాలంలో మన దేశంలోని చాలా చోట్ల ఎండలు భరించలేని విధంగా ఉంటాయి కాబట్టి చల్లగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని విహారానికి వెళ్తారు. మన దేశంలోనూ చల్లని ప్రదేశాలు ఉన్నప్పటికీ, విదేశీయాత్రలు కూడా చేయాలని చాలా మంది ప్రణాళికలు వేసుకుంటారు. మీరు కూడా విదేశీ టూర్ ప్లాన్ చేస్తుంటే, ఈ వేసవి సీజన్లో ఎలాంటి దేశాలకు విహారయాత్ర చేయవచ్చు, అక్కడ ఎలాంటి యాక్టివిటీలు చేయవచ్చు తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ అనగానే మంచుతో కప్పబడిన కొండలు, ఆకుపచ్చని స్విస్ పట్టణాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మన కళ్లలో మెదులుతాయి. స్విట్జర్లాండ్ ఎంతో సుందరమైన దేశం. వేసవి విహారానికి స్విట్జర్లాండ్ దేశం కచ్చితంగా మీ మొదటి ప్రాధాన్యత కావాలి. మంత్రముగ్ధులను చేసే ఇక్కడి ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన వాతావరణం, ఇక్కడి సాంస్కృతిక వారసత్వం మీకు జీవితంలోనే ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. ప్రశాంతమైన సరస్సు క్రూయిజ్‌లు, విస్మయం కలిగించే స్విస్ రైళ్లు, ఫ్యూనిక్యులర్‌లు మరియు కేబుల్ కార్లతో సహా స్విట్జర్లాండ్ రవాణా మోడ్‌లు ఆకట్టుకుంటాయి. రుచికరమైన స్విస్ వంటకాలు ముఖ్యంగా జున్నును ఇష్టపడే ఆహార ప్రియులకు ఇది స్వర్గధామం. స్విస్ రోస్టీ, ప్రపంచ ప్రఖ్యాత స్విస్ వైన్‌లను తప్పనిసరిగా ప్రయత్నించాలి.
సౌత్ కొరియా
దక్షిణ కొరియా దేశం ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక ఆవిష్కరణలు రెండింటి మేళవింపు కలిగిన ఒక ఫ్యూజన్. సౌత్ కొరియా రాజధాని నగరం సియోల్ సందర్శకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన జియోంగ్‌బోక్‌గుంగ్ ప్యాలెస్ కొరియన్ వాస్తుశిల్పానికి నిదర్శనం. చారిత్రక సౌందర్యాన్ని ఇష్టపడే వారు తప్పక చూడవలసిన ప్రదేశం. నగరం వెలుపల ఉన్న సియోరాక్సన్ నేషనల్ పార్క్, ఎత్తైన పర్వతాలు, పారదర్శకమైన నీటి వనరులు, వన్యప్రాణులతో సమృద్ధిని కలిగి ఉంది. కొరియాలోని అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి వినోదం , రుచికరమైన వంటకాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కొరియా సామ్‌సంగ్, LGతో సహా ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన కొన్ని కంపెనీలకు ఈ దేశం నిలయంగా ఉంది 5G సాంకేతికత అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. కొరియాకు చెందిన K-పాప్ అలాగే K-డ్రామా పరిశ్రమలు ప్రపంచవ్యాప్త ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాయి. ఈ వేసవిలో విహారయాత్రకు కొరియా దేశం తప్పకుండా మీ జాబితాలో కలిగి ఉండండి.
ఫ్రాన్స్
ఫ్రాన్స్ అనగానే మనకు ప్రేమనగరంగా ప్రసిద్ధి చెందిన ప్యారిస్ గుర్తుకు వస్తుంది. ఈఫిల్ టవర్, లౌవ్రే మ్యూజియం వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లతో ఈ నగరం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్యారిస్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్ దేశంలో ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అధునాతన నగరాలు, మనోహరమైన గ్రామీణ ప్రాంతాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వంతో వేసవి నెలల్లో తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానం. ఫ్రెంచ్ రివేరా తీర ప్రాంతం దాని పారదర్శకమైన జలాలు, జాలువారే కొండలు, లావెండర్ పొలాలు, సుందరమైన గ్రామాలతో అద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్ సంస్కృతిని అనుభవించడానికి, రుచికరమైన ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడానికి ఫ్రాన్స్ తప్పకుండా వెళ్లాలి.
ఆస్ట్రేలియా
ఎంతో విశాలమైన ద్వీప దేశం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అయినటువంటి గ్రేట్ బారియర్ రీఫ్, సుదీర్ఘమైన తీర ప్రాంతం, టాస్మానియాలోని పచ్చని వర్షారణ్యాలు, క్వీన్స్‌లాండ్‌లోని అందమైన ద్వీపాలు ఇలా ఎన్నో సహజమైన అద్భుతాలకు నిలయం ఈ దేశం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ వంటి కాస్మోపాలిటన్ నగరాలు సందర్శకులకు సాంస్కృతిక వైవిధ్యం, ప్రపంచ-స్థాయి వంటకాలు, తరిగిపోని రాత్రి జీవితాన్ని అందిస్తాయి. అడ్వెంచర్స్ ఇష్టపడేవారి కోసం, ఆస్ట్రేలియా సర్ఫింగ్, హైకింగ్ మొదలైన అనేక రకాల కార్యకలాపాలను అందిస్తుంది. ఆస్ట్రేలియాలో ఆహారం, వైన్ దృశ్యాన్ని కూడా మిస్ చేయకూడదు. కంగారూ వంటి అరుదైన జీవులను కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే మీరు చూడగలరు. విశేషమేమిటంటే.. ఇక్కడ కంగారూ ఈ దేశ జాతీయ జంతువు అయినప్పటికీ దీనిని వండుకొని తినవచ్చు. కంగారూ మాంసంతో రుచికరమైన వంటకాలు అందించే ఎన్నో రెస్టారెంట్లు ఉంటాయి. సీఫుడ్ కి కూడా చాలా ఫేమస్. ప్రపంచంలోని అత్యుత్తమ వైన్లు, వినూత్న వంటకాలను ఈ దేశం ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడి సహజ సౌందర్యం, ఇక్కడి వాతావరణం, సాంస్కృతిక వైవిధ్యం, పాక నైపుణ్యాలను ఆస్వాదించడానికి ఆస్ట్రేలియా తప్పక సందర్శించాలి.