Sago dosa: ఉపవాసం రోజు తినగలిగే.. సాబుదానా దోశ..
Sago dosa: ఉపవాసం రోజున రాత్రి పూట భోజనంలో ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? అయితే సులభంగా ఈ సాబుదానా దోస చేసిచూడండి.
Sago Dosa Recipe (Unsplash)
ఉపవాసం రోజు ఏం చేసుకోవాలా అని చూస్తున్నారా? సాబుదానా తో కిచిడీ, పాయసమే కాకుండా ఒకసారి రుచికరమైన దోశ తయారు చేసుకుని చూడండి. రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు సాబుదానా
పావు కప్పు రాజ్‌గిరా పిండి
2 చెంచా పెరుగు
1 చెంచా పచ్చిమిర్చి తరుగు
2 చెంచాల కొత్తిమీర తరుగు
సైంధవ లవణం తగినంత
మిరియాల పొడి రుచికి తగ్గట్లు
1 కప్పు నీళ్లు
తయారీ విధానం:
- ముందుగా సాబుదానా నీళ్లతో కడుక్కోవాలి. దీన్ని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
- ఆ తరువాత నీళ్లు వడిచిపోయేలా సాబుదానా ను ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి.
- ఈ సాబుదానాను కొద్ది కొద్దగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పట్టుకోవాలి.
- ఈ పిండిలో, రాజ్‌గిరా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సైందవ లవణం, మిరియాల పొడి, పెరుగు కలుపుకోవాలి.
- ఉండలు లేకుండా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. దోసెలు పోసుకోడానికి వీలుగా నీళ్లు పోసుకోవాలి.
- దోశ పెనం తీసుకుని వేడెక్కాక నూనె రాసుకుని వీటిని కాస్త మందంగానే దోసెలాగా వేసుకోవాలి. అంచుల వెంబడి కాస్త నూనె వేసుకోవాలి.
- క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకుని తీసేసుకోవడమే. ఏ చట్నీ లేకుండా తినేయొచ్చు. ఇష్టముంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.