chutneys for breakfast: అల్పాహారంలోకి అదిరిపోయే 3 రకాల చట్నీలు..-know how to make 3 different types of chutneys for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know How To Make 3 Different Types Of Chutneys For Breakfast

chutneys for breakfast: అల్పాహారంలోకి అదిరిపోయే 3 రకాల చట్నీలు..

Koutik Pranaya Sree HT Telugu
May 18, 2023 06:30 AM IST

chutneys for breakfast: అల్పాహారంలోకి సరిపోయే మూడు రకాల చట్నీలు సులభంగా ఎలా చేయాలో చూడండి.

అల్పాహారంలోకి చట్నీలు
అల్పాహారంలోకి చట్నీలు (pexels)

అల్పాహారం గురించి ఆలోచించడం ఒకెత్తయితే, ఏ చట్నీ చేయాలో ఆలోచించడం ఇంకా కష్టం. అందుకే సులభంగా చేసుకోగల మూడు రకాల చట్నీలు చూసేయండి. దోసెలు, ఇడ్లీలు, వడలు.. ఇలా అన్ని రకాలు అల్పాహారాలకు ఈ చట్నీలు చేసుకోవచ్చు. అవేంటో చూసేయండి..

1. ఉల్లిపాయ చట్నీ:

  • ఒక పెనంలో చెంచా శనగపప్పు, చెంచా మినప్పప్పు కాస్త నూనె వేసి వేయించుకోవాలి.
  • పప్పులు బంగారు రంగులోకి మారగానే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. రెండు సెకన్లు వేగాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
  • నాలుగు వెల్లుల్లి కూడా తరిగి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని రంగు మారే వరకు వేగనివ్వాలి.
  • ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో పట్టుకోవాలి.
  • మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు రెబ్బల చింతపండు, ఉప్పు , కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇలాగే తినొచ్చు లేదా ఆవాలు, కరివేపాకు, ఇంగువతో తాలింపు పెట్టుకోవచ్చు.

2. రెస్టరెంట్ స్టైల్ కొబ్బరి చట్నీ:

  • సగం కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర, నాలుగైదు పుదీనా ఆకులు, రెండు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, పావు టీస్పూన్ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  • అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి.
  • ఇపుడు ఒక ప్యాన్ లో నూనె తీసుకుని, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగాక ఈ తాలింపును చట్నీలో కలుపుకోవాలి.

3. టమాటా చట్నీ:

  • పావు కేజీ టమాటాలను సగం సగం ముక్కలుగా చేసుకోవాలి.
  • ఒక పెనం తీసుకుని రెండు చెంచాల నూనె వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని పెనం మీద బోర్లాగా పెట్టుకోవాలి. ఒక నిమిషం అయ్యాక మరోవైపు కూడా అలాగే నూనెలో ఉంచాలి. దీనివల్ల కాల్చి పచ్చడి చేసుకున్న రుచి వస్తుంది.
  • ఇప్పుడు 5 వెల్లుల్లి ముక్కలు కూడా వేగనివ్వాలి. టమాటా మెత్తబడ్డాక చల్లార్చి, నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకోవాలి.
  • ‌ఒక కడాయిలో మూడు చెంచాల నూనె వేసుకుని వేగాక, కొన్ని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పావు టీస్పూన్ మెంతులు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి.
  • మంట తక్కువ పెట్టుకుని రెండు స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో టమాటా గుజ్జు వేసుకుంటే చాలు.

WhatsApp channel