Rose Water Benefits: రోజ్ వాటర్ చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాదు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది, దీన్ని ఇలా వాడండి-rose water not only improves skin beauty but also relieves headaches ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Water Benefits: రోజ్ వాటర్ చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాదు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది, దీన్ని ఇలా వాడండి

Rose Water Benefits: రోజ్ వాటర్ చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాదు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది, దీన్ని ఇలా వాడండి

Haritha Chappa HT Telugu
Jun 09, 2024 07:00 AM IST

Rose Water Benefits: ప్రతి ఇంట్లోనూ రోజ్ వాటర్ ఉంటుంది. ఇది తక్కువ ధరకే లభించడం, దీనివల్ల అనేక ఉపయోగాలు ఉండడంతో రోజు వాటర్ వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

రోజ్ వాటర్ ఉపయోగాలు
రోజ్ వాటర్ ఉపయోగాలు

Rose Water Benefits: చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు రోజ్ వాటర్‌ను వినియోగిస్తూ ఉంటారు. ఈ రోజ్ వాటర్ సువాసన వేస్తుంది. గులాబీ రేకులతో రోజ్ వాటర్‌ను తయారు చేస్తారు. వేల సంవత్సరాలుగా రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తున్నారని అంటారు. దీని చరిత్ర ఒకసారి చూస్తే ఇరాన్‌లో రోజ్ వాటర్‌ను తొలిసారిగా తయారు చేశారని సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించారని చెబుతారు. కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మాత్రమే కాదు, అనేక రకాలుగా రోజ్ వాటర్ వినియోగించవచ్చు.

చర్మానికి...

చర్మంపై చికాకుగా అనిపించడం, దురదలు రావడం వంటివి జరుగుతున్నప్పుడు రోజ్ వాటర్‌ను ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మంపై బలమైన శోథనిరోధక లక్షణాలను చూపిస్తుంది. దీనివల్ల చర్మం దురద తగ్గుతుంది.

గొంతు నొప్పిని తగ్గించే శక్తి రోజ్ వాటర్‌కి ఉంది. అయితే అన్ని రకాల రోజ్ వాటర్‌లను గొంతు నొప్పి తగ్గేందుకు తాగకూడదు. ఎందుకంటే ఇప్పుడు రసాయనాలు కలిపిన రోజు వాటర్ మార్కెట్లో లభిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న రోజువాటర్ ను సేవించడమే మంచిది.

రోజ్ వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. కాబట్టి మొటిమలను రాకుండా అడ్డుకుంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి. కాబట్టి చర్మంపై ఉన్న ఎరుపును తగ్గిస్తుంది. వేల సంవత్సరాలుగా రోజ్ వాటర్ ను ముఖ సౌందర్యానికి వినియోగిస్తూ ఉన్నారు. రోజ్ వాటర్ ఒక శక్తివంతమైన క్రిమి సంహారక మందుగా చెప్పుకోవచ్చు. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుంటుంది. చర్మంపై ఎక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్లు కనిపించినా రోజు వాటర్ ను అప్లై చేసి చూడండి. అవి ఎంతోకొంత తగ్గడం ఖాయం.

రోజ్ వాటర్‌ను గులాబీ రేకులు లేదా గులాబీ నూనెతో తయారుచేస్తారు. వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. దీనివల్ల ముఖంపై ఉంటే చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దెబ్బలు తాలూకు మచ్చలు, కాలిన గాయాలు, కోతలు వంటివి ఉంటే వాటిపై రోజ్ వాటర్‌ను అప్లై చేస్తూ ఉండండి. ఈ వాటర్ ఆ మచ్చలు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. రోజ్ వాటర్ బలమైన యాంటీ డిప్రెసెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే యాంటీ యాంగ్జయిటీ లక్షణాలను తగ్గించే శక్తి దీనిలో అధికంగా ఉంది. దీని వాసన చూస్తూ ఉంటే మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది.

తలనొప్పిని తగ్గించే శక్తి

అరోమా థెరపీలో రోజ్ వాటర్ ను తలనొప్పిని తగ్గించేందుకు వినియోగిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించే శక్తిని కలిగి ఉంది. రోజ్ వాటర్ లో నానబెట్టిన వస్త్రాన్ని తలపై పెట్టుకోవడం వల్ల తలనొప్పి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. రోజ్ వాటర్‌ను ముఖంపై అప్లై చేయడం వల్ల ముడతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. చర్మానికి ఓదార్పు ఇచ్చి మళ్లీ మెరిసేలా చేస్తాయి.

రోజ్ వాటర్ తయారీ

రోజ్ వాటర్‌ను ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బయట అమ్మే రోజు వాటర్ లో రసాయనాలు కలిపే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వినియోగించే కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. తాజా గులాబీలు రేకులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. అందులోనే మంచినీళ్లను వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఆ నీటిని చల్లారనివ్వాలి. కొన్ని గంటల తర్వాత వడకట్టి ఆ వాటర్ ను ఒక డబ్బాలో నింపుకొని ఉంచుకోవాలి. అంతే రోజ్ వాటర్ తయారైనట్టే. ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వాటర్‌ను 24 గంటల్లోనే వినియోగించుకోవడం మంచిది. ఈ నీటిని తాగినా కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.

Whats_app_banner