Real love story: చరిత్రలో నిలిచిపోయే అద్భుత ప్రేమగాధ ఇది, ఈ ప్రేమికుల సమాధి ఇప్పటి లవర్స్‌కు పుణ్యక్షేత్రంతో సమానం
Real love story: వాలెంటైన్స్ డే వచ్చిందంటే నిజమైన ప్రేమకథలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోతుంది. అలాంటి ఒక అందమైన ప్రేమకథ ‘హీర్ - రాంజా’ జంటది. ఈ జంట సమాధి ఇప్పటికీ ప్రేమికులకు పుణ్యస్థలమే.
Real love story: యుగాల కాలం నుంచి ఈ భూమ్మీద ప్రేమకథలు నడుస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని చరిత్రలో నిలిచిపోయాయి. హద్దులు లేని ప్రేమకు చిహ్నంగా ఎంతో మంత్రి ప్రేమికులు సమాధి అయిపోయారు. ఇప్పుడు నిజమైన ప్రేమ ఉనికిలో ఉందో లేదో కానీ, ఒకప్పుడు మాత్రం ప్రేమ అంటే ఇలా ఉండాలి అనేలా ఎన్నో ప్రేమకథలు సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. అలాంటి అందమైన ప్రేమకథల్లో ‘హీర్ - రాంజా’ జంట కథ కూడా ఒకటి. ఇది ఇప్పటి కథ కాదు. భారతదేశం - పాకిస్థాన్ విడిపోక ముందు, మన గడ్డను పరాయి దేశస్థులు పాలిస్తున్న కాలంలోది. వీరి ప్రేమ కథ సినిమాగా కూడా మారింది. హీర్ - రాంజా ప్రేమకు అర్థం చెప్పారు. కానీ వీరి ప్రేమ విషాదాంతం అయిపోయింది.
వేణు గానానికి రాళ్లు కరగాల్సిందే...
భారతదేశంలో రోమియో జూలియట్ గా ఒకప్పుడు చెప్పుకునే వారు ‘హీర్ - రాంజా’ జంట గురించి. దాదాపు 14వ శతాబ్ధంలో వీరి జీవించినట్టుగా చెప్పుకుంటారు. అప్పటి పంజాబ్ ప్రాంతంలో రాంజా నివసించేవాడు. అతనికి వేణువు వాయించడం చాలా ఇష్టం. అతను వేణువు వాయిస్తుంటే చుట్టూ ఉన్న వారు పులకించే పోయే వారు. అతని తండ్రికి నలుగురు కొడుకులు. అందరిలో చిన్నవాడు రాంజా. తండ్రి చనిపోయాక అతనికి కష్టాలు మొదలయ్యాయి. సొంత అన్నలు, వదినలు అతడిని సరిగా చూడలేదు. భోజనం కూడా పెట్టకపోవడంతో ఆ ఊరు విడిచి వెళ్లిపోయాడు. అతడి అట్టడుగు వర్గానికి చెందిన వాడు. అలా వెళుతూ వెళుతూ హీర్ అనే అందమైన అమ్మాయి ఉన్న ఊరికి వస్తాడు. ఆమె సియాల్ తెగకు చెందిన అమ్మాయి. చాలా సంపన్నురాలు కూడా.
హీర్ తండ్రి రాంజాకు తన పశువులను మేసే పని ఇస్తాడు. పశువులను మేపుతూ వేణువును వాయిస్తాడు. ఆ వేణుగానానికి హీర్ మంత్రముగ్ధురాలవుతుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. కొన్నేళ్ల పాటూ వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటారు. కానీ వారి కులం, మత్రం ప్రేమకు అడ్డుపడతాయి. హీర్ మేనమామ వారి ప్రేమకథకు విలన్ గా మారుతాడు. ఆమెను బలవంతంగా మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో రాంజా గుండె పగిలిపోతుంది. పిచ్చివాడిలా మారిపోతాడు. ఊరు విడిచి సన్యాసిగా మారి పంజాబ్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఓరోజు అలా హీర్ ఉండే గ్రామానికి మళ్లీ వస్తాడు. వారిద్దరి మధ్య పాత ప్రేమ గుర్తుకువస్తుంది. సమాజాన్ని ఎదిరించాలన్న ధైర్యం ఇస్తుంది ప్రేమ. ఎలాగైనా ఒక్కటవ్వాలని అనుకుంటారు.
వీరి నిర్ణయం హీర్ తల్లిదండ్రులకు, మేనమామకు తెలుస్తుంది. హీర్ తల్లిదండ్రలు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ అది వారిని నమ్మించి మోసం చేయడానికే అని పంజాబ్ లోని కొన్ని కథలు చెబుతున్నాయి. సరిగ్గా వారి పెళ్లిరోజున హీర్ తినే భోజనంలో మేనమామ విషం కలుపుతాడు. అది తిని ఆమె మరణిస్తుంది. హీర్ మరణంతో రాంజా కుప్పకూలిపోతాడు. ఆమె లేని జీవితం తనకూ వద్దని అదే ఆహారాన్ని తానూ తింటాడు. ఇద్దరూ ఒకే చోట కొన్ని నిమిషాల వ్యవధిలో మరణిస్తారు. ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరిని చూసి ఆ ఊరంతా రోదిస్తుంది.
జాంగ్ అనే గ్రామంలో వారిద్దరినీ ఖననం చేస్తారు. ఇద్దరినీ పక్కపక్కనే పాతిపెడతారు. వారి సమాధిని అందంగా నిర్మించారు. ఆ సమాధిని ఇప్పటికీ ఎంతో మంది ప్రేమికులు దర్శించుకుంటారు. తమ ప్రేమ వారిలా విషాదాంతం అవ్వకుండా గెలిపించమని కోరుకుంటారు. హీర్ - రాంజా కథతో ఇప్పటికి 15కు పైగా సినిమాలు వచ్చాయి. పంజాబ్ లో ఈ కథ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం జాంగ్ గ్రామం పాకిస్తాన్లో ఉంది. భారతదేశం నుంచి విడిపోయినప్పుడు పంజాబ్ లోని కొంత ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్లిపోయింది. అలా వీరి సమాధి కూడా పాకిస్తాన్లో ఉంది.