Egg Masks for Hair: జుట్టు కోసం కోడిగుడ్డుతో ఈ మాస్క్‌లు ఇంట్లోనే తయారు చేసుకోండి.. వీటితో సమస్యలు దూరం!
Egg Masks for Hair: జుట్టు ఆరోగ్యానికి కోడిగుడ్లు చాలా మేలు చేస్తాయి. అందుకే కోడిగుడ్డుతో తయారు చేసుకున్న హెయిర్ మాస్క్‌లు జుట్టు సమస్యలను దూరం చేయగలవు. హెయిర్ మాస్క్‌లను ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూడండి.
చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, డ్యామేజ్ అవడం, పొడిగా మారడం, చుండ్రు లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోషకాహారం తీసుకోకపోవడం, కాలుష్యం, దుమ్ము సహా వీటికి చాలా కారణాలు ఉంటాయి. అయితే, కోడిగుడ్లు.. జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. సమస్యలు తగ్గేందుకు తోడ్పడతాయి. కోడిగుడ్లతో ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్డులోని లుటెన్, బయోటిన్ కూడా జుట్టు సమస్యలను తీర్చగలవు. ఆ ఎగ్ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా వాడాలో ఇక్కడ చూడండి.
గుడ్డు, పెరుగు కలిపి..
కోడిగుడ్డు, పెరుగు కలిపి మాస్క్ చేసుకొని వాడితే జుట్టు రాలే సమస్య తగ్గేందుకు తోడ్పడుతుంది. మీ జుట్టుకు తగినట్టుగా పెరుగు తీసుకోవాలి, అందులో ఒకటి లేకపోతే రెండు గుడ్లు పగులగొట్టాలి. ఆ తర్వాత రెండింటినీ బాగా బీట్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు మొత్తం రాసుకోవాలి. చేతులతో ఐదు నిమిషాలైనా జుట్టుకు ఈ పేస్ట్ రాయాలి. ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం షాంపోతో తలస్నానం చేయాలి. ఈ గుడ్డు పెరుగు మాస్క్ వాడడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వెంట్రుకల దృఢత్వం మెరుగవుతుంది.
గుడ్డు, ఆలివ్ ఆయిల్
మీ జుట్టు పొడిగా, పీలగా ఉంటే కోడిగుడ్డు, ఆలివ్ ఆయిల్ కలిపిన మాస్క్ సమస్యను దూరం చేయగలదు. ముందుగా రెండు గుడ్లను పగులగొట్టుకోవాలి. దాంట్లో ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి మొత్తం జుట్టుకు రాయాలి. సుమారు అరగంట దాన్ని ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్క్.. జుట్టుకు తేమను అందిస్తుంది. పొడిబారకుండా తగ్గించి.. మెరుపును పెంచుతుంది.
గుడ్డు, తేనెతో..
గుడ్డు, తేనెతో తయారు చేసే ఈ హెయిర్ మాస్క్.. మీ జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. ముందుగా ఓ గిన్నెలో రెండు ఎగ్స్ పగులగొట్టాలి, దాంట్లో రెండు టీస్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. జుట్టుకు ఆ మిశ్రమాన్ని బాగా రాసుకోవాలి. 30 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత తలస్నానం చేయాలి. అయితే, ఈ మాస్క్ అప్లై చేస్తే జుట్టును కడిగేందుకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఈ మాస్క్ వాడితే మీ వెంట్రుకలు సహజంగా మాయిశ్చరైజ్ అవుతాయి.
గుడ్డు, కొబ్బరినూనెతో..
కోడిగుడ్డు, కొబ్బరినూనె కలిసిన ఈ మిశ్రమాన్ని రాసుకుంటే జుట్టు డ్యామేజ్ అవడం, కొనలు విరిగిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఒకటి లేకపోతే రెండు కోడిగుడ్లను పగులగొట్టి.. దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్‍ల కొబ్బరినూనె వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి అరగంట వరకు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపోతో తలస్నానం చేయండి. హెయిర్ డ్యామేజ్‍ను ఈ మాస్క్ నియంత్రించగలదు.
గుడ్డు, హెన్నా
ముందుగా మూడు స్పూన్ల హెన్నా పొడిలో కాస్తకాస్త నీరు వేస్తూ ఓ గట్టి పేస్ట్‌లా కలుపుకోవాలి. దాంట్లో రెండు గుడ్లను పగులగొట్టి వేయాలి, కాస్త పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త మెంతులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట వరకు ఆరనివ్వాలి. దాని తర్వాత తలస్నానం చేయవచ్చు. ఈ హెయిర్ మాస్క్.. జుట్టు పెరుగుదలకు, దృఢత్వం మెరుగుపడేందుకు సహకరిస్తుంది.