Periods: నెలసరిలో రక్తస్రావం అధికంగా అవుతోందా? అయితే ఈ విటమిన్ లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Periods: కొందరి మహిళలకు నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంది. విటమిన్ కె లోపం వల్ల ఇలా అయ్యే అవకాశం ఉంది.
Periods: ప్రతినెలా సమయానికి రుతుస్రావం కావడం అనేది మహిళల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అలాగే కొందరిలో నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడడం లేదా థైరాయిడ్ సమస్యలు వంటివి ఇలా అధిక రక్తస్రావానికి కారణం కావచ్చు. అలాగే బరువు అధికంగా పెరగడం లేదా బరువు హఠాత్తుగా తగ్గడం, తీవ్రంగా ఒత్తిడికి గురవడం కూడా మీ ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవేవీ కాకుండా మరొకటి కూడా మీకు అధిక రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. అదేంటంటే విటమిన్ కే లోపం. మీ శరీరం విటమిన్ కే లోపంతో బాధపడుతూ ఉంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా అవుతుందో వారు విటమిన్ కే లోపం ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.
విటమిన్ కె ఎందుకు ముఖ్యం?
రక్తం గడ్డ కట్టడంలో విటమిన్ కే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏవైనా గాయాలు తగిలినప్పుడు రక్తం ఎక్కువ పోకుండా వెంటనే గడ్డకట్టేలా చేసేది విటమిన్ కే. అదే విధంగా నెలసరి సమయంలో కూడా రక్తం అధికంగా పోకుండా అడ్డుకునే శక్తి విటమిన్ Kకు ఉంది. అయితే ఏ మహిళల్లో అయితే విటమిన్ కే లోపం ఉంటుందో వారికి నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా అవుతుంది. విటమిన్ కే లోపం అనేది మీ రుతు చక్రంపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విటమిన్ కె లోపం రాకుండా కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి.
ఏం తినాలి?
ప్రతిరోజూ ఏదో రకమైన ఆకుకూరను తినేందుకు ప్రయత్నించండి. కాలే, పాలకూర, గోంగూర, మెంతికూర... ఇలా ఆకుపచ్చని కూరల్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది. బ్రకోలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోనూ విటమిన్ కే లభిస్తుంది. టమోటోలు, దోసకాయలు, కొత్తిమీర వంటి వాటిని ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. అలాగే చేపలను తినడం వల్ల విటమిన్ కేను అధికంగా పొందవచ్చు. లీన్ ప్రోటీన్ ఉండే లేత మాంసాన్ని, గుడ్లును తినడం ద్వారా విటమిన్ Kను శరీరానికి అందించవచ్చు. నీటిని కూడా అధికంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఒత్తిడిని తగ్గించుకుంటే రుతుసమస్యలు రాకుండా ఉంటాయి.
టాపిక్