Nita Ambani: నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ జుట్టు రాలిపోవడానికి ఈ చెడు పనులే కారణమంటున్నారు-nita ambanis hair stylist says these bad things are the cause of hair fall ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nita Ambani: నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ జుట్టు రాలిపోవడానికి ఈ చెడు పనులే కారణమంటున్నారు

Nita Ambani: నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ జుట్టు రాలిపోవడానికి ఈ చెడు పనులే కారణమంటున్నారు

Haritha Chappa HT Telugu

Nita Ambani: నీతా అంబానీ హెయిర్ స్టైల్ ఎంతో ఆకట్టుకుంటుంది. అరవై ఏళ్ల వయసులో కూడా ఆమె జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. ఆమెకు హెయిర్ స్టైల్ చేసే అమిత్ ఠాకూర్ జుట్టు ఊడిపోవడానికి కొన్ని రకాల చెడు పనులే కారణమని చెబుతున్నారు.

నీతా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ (Instagram)

నీతా అంబానీ అరవై ఏళ్ల వయసులో ఎంతో అందంగా ముస్తాబవుతుంది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె స్కిన్, హెయిర్, డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఆమె గ్లామర్ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఈమె అంత అందంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వారి చర్మం, జుట్టును జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నీతా అంబానీ జుట్టును కాపాడే వారిలో ఆమె హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ముఖ్యమైనవారు. అమిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలను పంచుకుంటూ ఉంటాడు. జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేసే మూడు అలవాట్ల గురించి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ చెడు పనులు చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని చెబుతున్నారు అమిత్.

మొదటి తప్పు

జుట్టు ఊడిపోవడానికి మనందరం చేసే మొదటి తప్పు తడి జుట్టుతో నిద్రపోవడం. తడి జుట్టుతో ఎప్పుడూ నిద్రపోకూడదని అమిత్ చెప్పారు. తడి జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు జుట్టును బాగా ఆరబెట్టాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు నిద్రపోయే ముందు చల్లని గాలిలో జుట్టును ఆరబెట్టడానికి ప్రయత్నించాలి.

రెండో తప్పు

జుట్టు తడిగా ఉనప్పుడే స్ట్రెయిటెనర్లు లేదా ఇతర వేడి ఆధారిత సాధనాలను ఉపయోగిస్తారు. అమిత్ చెప్పిన ప్రకారం, ఈ అలవాటు జుట్టుకు చాలా హానికరం. జుట్టు బాగా ఆరిన తర్వాత మాత్రమే వీటిని ఉపయోగించండి. మీరు జుట్టును మరింత దెబ్బతినకుండా రక్షించాలనుకుంటే, ఎలక్ట్రికల్ సాధనాలను ఉపయోగించే ముందు జుట్టు తడిలేకుండా చూసుకోవాలి. లేెకుంటే వెంట్రుకలు త్వరగా ఊడిపోతాయి.

మూడో తప్పు

రాత్రయితే చాలు ఎంతో మంది జుట్టు విరబోసుకుని నిద్రపోతూ ఉంటారు. ఇది కూడా అతి పెద్ద మూడో తప్పని చెబుతున్నారు అమిత్ ఠాకూర్. జుట్టు అలవాట్లలో అత్యంత హానికరమైన అలవాటు ఇది. జుట్టు విరబోసుకుని నిద్రపోవడం వల్ల అవి విరిగిపోయే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. నిద్రపోతున్నప్పుడు, జుట్టు విరబోయడం వల్ల తలగడకతో ఘర్షణ చెందడం వల్ల, జుట్టు ఊడిపోయే సమస్యను గణనీయంగా పెంచుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ జుట్టును వదులుగా అల్లుకోండి.

జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఇంకా ఉన్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారికి కూడా వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల అనారోగ్యాల వల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. అలాగే నిద్ర తగ్గినా కూడా వెంట్రుకలు బలహీనంగా అవుతాయి. గట్టిగా దువ్వినా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. యాంటీ డిప్రెసెంట్స్ వంటివి వాడే వారిలో కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువైపోవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నప్పుడు దానికి కారణమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.