Peanut Side Effects: ఈ సమస్యలుంటే వేరుశనగ అస్సలు తినకండి, అనారోగ్యం పెరుగుతుంది
Peanut Side Effects: వేరుశనగ తినడం ఆరోగ్యకరం. కానీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. లేదంటే లాభం కన్నా నష్టం ఎక్కువ. ఆ సమస్యలేంటో చూడండి.
చిరు ఆకలి తీర్చుకోడానికి చాలా మంది వేరుశనగను స్నాక్ లాగా తింటారు. వేరుశెనగలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తింటూ ఉంటే తినాలనిపించేంత టేస్టీగానూ ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి ఇంత మేలు చేసినా కూడా కొందరు మాత్రం వేరుశనగ తినకూడదు. వేరుశెనగ తినడం వల్ల ప్రయోజనం కంటే వారి ఆరోగ్యానికి హానే ఎక్కువ జరుగుతుంది. అదెలాగో తెలుసుకుందాం.
ఎసిడిటీ సమస్యలు:
తరచుగా ఎసిడిటీ సమస్యలతో బాధ పడేవారు వేరుశెనగ తినకుండా ఉండాలి. అలాంటి వాళ్లకి వేరుశెనగ తినడం వల్ల కడుపులో మలబద్ధకానికి కారణమయ్యే మూలకాలను ప్రేరేపించి సమస్య మరింత తీవ్రం అవుతుంది. దీనివల్ల కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
యూరిక్ యాసిడ్
వేరుశెనగలో ఉండే అధిక ప్రోటీన్ శాతం శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి ఇప్పటికే ఆర్థరైటిస్ లేదా హైపర్యూరిసెమియా సమస్యలు ఉన్నవారు వేరుశెనగను పరిమిత పరిమాణంలో తీసుకోవడం లేదా పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. వేరుశెనగ తినడం వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది.
హైబీపీ:
మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే వేరుశెనగలను చాలా జాగ్రత్తగా తినండి. ముఖ్యంగా బయట దొరికే పీ నట్ స్నాక్స్ తినడం మంచిది కాదు. వీటి తయారీకి ఎక్కువ సోడియం వాడతారు. అలాగే ఉప్పుతో వేయించిన వేరుశెనగ లేదా బాగా ఉప్పు, చక్కెరలుండే పీనట్ బటర్ తినడం వల్ల కూడా మీ రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి ఉప్పు లేకుండా వేరుశెనగ తినడానికి ప్రయత్నించండి.
బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకుంటే వేరుశెనగ తినడం మానుకోవాల్సిందే. వేరుశెనగలో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.
అలెర్జీలు
చాలా మందికి వేరుశెనగలతో అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు వేరుశెనగ తింటే దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , అనాఫిలాక్సిస్ వంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి మీకేమైనా అలర్జీలు వస్తుంటే దానికి కారణం వేరుశనగ ఏమో చెక్ చేసుకోండి. అలాంటి లక్షణాలుంటే అస్సలు తినవద్దు.