Backpain: ప్రసవం తర్వాత వచ్చిన నడుంనొప్పి తగ్గట్లేదా? నొప్పి తగ్గించే మార్గాలివే-natural ways to reduce backpain after caesarean section and delivery ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Backpain: ప్రసవం తర్వాత వచ్చిన నడుంనొప్పి తగ్గట్లేదా? నొప్పి తగ్గించే మార్గాలివే

Backpain: ప్రసవం తర్వాత వచ్చిన నడుంనొప్పి తగ్గట్లేదా? నొప్పి తగ్గించే మార్గాలివే

Koutik Pranaya Sree HT Telugu
Jul 20, 2024 03:00 PM IST

Backpain after Delivery: ప్రెగ్నెన్సీ, ప్రసవం రెండింటి వల్ల మహిళ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. బరువు పెరగడం, హర్మోన్లలో మార్పులు, స్వతంత్రంగా కదల్లేక పోవడం లాంటి ఎన్నో మార్పులు వస్తాయి. సిజేరియన్ డెలివరీ తర్వాత వెన్నెముక మీద పడే ప్రభావం వల్ల నడుం నొప్పి రావచ్చు. దీని చిట్కాలు తెల్సుకోండి.

డెలివరీ తర్వాత నడుంనొప్పి తగ్గించే మార్గాలు
డెలివరీ తర్వాత నడుంనొప్పి తగ్గించే మార్గాలు (freepik)

సిజేరియన్ డెలివరీ తర్వాత వచ్చే నడుం నొప్పి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. డెలివరీ తర్వాత వెంటనే మొదలై ఈ నొప్పి కొన్ని రోజులు, వారాలు, నెలలు ఉంటుంది. డెలివరీ కోసం చేసిన కోత గాయం మానడానికే చాలా ఓపిక, నొప్పి భరించాల్సి వస్తుంది. పూర్తిగా కోలుకోకముందే నడుం నొప్పి వచ్చి ఇంకా కష్టతరం చేస్తుంది. అసలు నడుం నొప్పి ఎందుకు వస్తుంది? దాన్నుంచి బయటపడే మార్గాలేంటో చూద్దాం.

డెలివరీ తర్వాత నడుము నొప్పి తగ్గించే చిట్కాలు:

కూర్చునే భంగిమ:

సిజేరియన్ డెలివరీ తర్వాత వచ్చే నడుము నొప్పికి మంచి నివారణ కూర్చునే స్థితిలో మార్పు. కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉండేలా చూడాలి. అవసరమైతే వెనకాల దిండు పెట్టుకోవాలి. నిలబడ్డప్పుడు పాదాలు రెండు సమాన దూరంలో పెట్టాలి. ముందుకు లేదా వెనక్కి వంగడం చేయకూడదు. వీటివల్ల నడుం నొప్పి తగ్గుతుంది.

బరువులు ఎత్తేటప్పుడు:

శిశువును ఎత్తుకునేటప్పుడు, ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు నడుం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి బరువులు ఎత్తేటప్పుడు నేరుగా వంగకుండా మోకాళ్లను కాస్త వంచాలి, స్వ్కాట్స్ చేస్తున్నట్లు వంగి బరువులు ఎత్తాలి. దీనివల్ల నడుము మీద ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నిటారుగా ఉండాలి. మీ కాళ్లలోనే బారమంతా వేసి బరువులెత్తాలి.

వ్యాయామాలు:

సిజేరియన్ తర్వాత కాస్త కోలుకోగానే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాలి. మీ కండరాల్ని బలోపేతం చేయడానికి వ్యాయామం అవసరం. వాకింగ్ లాంటివి మొదలు పెట్టాలి. పెల్విక్ ఫ్లూర్ ఎక్సర్‌సైజులు, కీగిల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.

కాపడం:

నడుం నొప్పి తగ్గడానికి హీటింగ్ ప్యాడ్ వాడొచ్చు. వెచ్చగా కాపడం పట్టడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. లేదంటే చల్లగా ఉండే ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గుతుంది.

విశ్రాంతి:

విశ్రాంతి, నిద్ర వల్ల మీ శరీరం నొప్పి నుంచి కోలుకుంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే మీరు నిద్రపోయే పరుపు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. తలగడ వాడటం వల్ల కూడా వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు.

సపోర్ట్ ఇచ్చే బెల్టులు:

నడుముకు బెల్డ్, బైండర్ లాంటివి వాడటం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఇవి పొత్తికడుపు, వెన్ను కండరాలకు మద్దతిస్తాయి. దానివల్ల నడుం నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. వీటిని పెట్టుకోవడం వల్ల కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు భంగిమ కూడా సరిగ్గా ఉంటుంది.

సిజేరియన్ తర్వాత నడుం నొప్పి రావడానికి కారణాలు:

హార్మోన్ల మార్పులు:

ప్రెగ్నెన్సీలో సమయంలో కటి ప్రాంతం పెద్దగా, సులభంగా సాగడానికి కొన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఇది శరీరాన్ని డెలివరీ కోసం సిద్ధం చేస్తుంది. కటి ప్రాంతంలో ఉండే లిగమెంట్లను ఈ హార్మోన్ ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నడుం నొప్పి రావడం కూడా మొదలవుతుంది. డెలివరీ తర్వాత కొన్ని నెలలకు ఈ లిగమెంట్లు ముందులాగా మారిపోతాయి.

పిల్లల్ని ఎత్తుకోవడం:

సిజేరియన్ తర్వాత నొప్పి పిల్లల్ని ఎత్తుకోవడం వల్ల మరింత ఎక్కువవుతుంది. తరచూ వంగడం, ఎత్తుకోవడం వల్ల నడుంనొప్పి ఎక్కువవ్వొచ్చు. అందుకే తరచూ వంగేట్లు చూడకండి. మీకు సౌకర్యంగా ఉండే ఎత్తులో శిశువు ఉండే ఊయల, బెడ్ ఉంచండి. పాపను వంగి తీసుకునేటప్పుడు బలం కాళ్ల మీద పెట్టండి.

బరువు పెరగడం:

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట బరువు కారణంగా సిజేరియన్ తర్వాత నడుం నొప్పి రావచ్చు. పొత్తికడుపులో ఎక్కువ బరువెత్తడం వల్ల వెన్నెముక మీద ఈ ప్రభావం పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో సరైన స్థితిలో కూర్చోవడం తప్పనిసరి.

పాలు పట్టడం:

పిల్లలకు పాలిచ్చేటప్పుడు వంగి కూర్చోవడం వల్ల నడుం నొప్పి విపరీతం అవ్వచ్చు. కాబట్టి మీకు మద్దతిచ్చేట్లు ఒక తలగడను పెట్టుకోవడం, వెనకాల సరైన సపోర్ట్ ఉంచుకుని కూర్చోవడం ముఖ్యం.

అనస్తీషియా ప్రభావం:

ప్రసవం సమయంలో ఎపిడ్యూరల్ తీసుకోవడం, వెన్నెముక అనస్తీషియా తీసుకోవడం వల్ల సిజేరియన్ డెలివరీ తర్వాత నడుం నొప్పి రావచ్చు. ఈ నొప్పి కొన్ని వారాల పాటూ, నెలల పాటూ ఉండొచ్చు.

Whats_app_banner