Pregnancy Apps: ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా? ఫోన్లో ఈ యాప్స్ ఉండాల్సిందే..
Pregnancy Apps: ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్లకు చాలా రకాల సందేహాలుంటాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పి, పరిష్కారాలు చెప్పే యాప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పీరియడ్స్ తేదీ, అండం విడుదలయ్యే సమయం.. ఇంకొన్ని విషయాలు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిందే. ఇవే కాక ఈ విషయంలో కొన్ని సందేహాలుంటాయి. అలాంటప్పుడు పక్కాగా సహాయపడే కొన్ని యాప్స్ ఉంటాయి. వాటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని వివరాలు ట్రాక్ చేసుకోవడం సులువవుతుంది. మీ ప్రయత్నాన్ని ఇవి మరింత సులభం చేస్తాయి. అలాంటి కొన్ని యాప్స్ ఏంటో చూసేయండి.
క్లూ పీరియడ్ ట్రాకర్ & క్యాలెండర్ (Clue Period, Ovulation Tracker):
కేవలం పీరియడ్ ట్రాకింగ్ కోసమే కాకుండా అండం విడుదల సమయం, ఫర్టిలిటీ, మెంటల్ హెల్త్, సెక్స్ డ్రైవ్, నిద్ర లాంటి అనేక విషయాలను తెల్సుకోడానికి ఈ యాప్ సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకి, ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్న వాళ్లకి, శరీరంలో వస్తున్న మార్పులు గమనించాలనుకునే వాళ్లకి ఇది ఉపయోగపడుతుంది. మీ అవసరానికి తగ్గట్లు దీంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు.
ఫ్లో పీరియడ్ & ప్రెగ్నెన్సీ ట్రాకర్ ( Flow period & pregnancy tracker):
ఏ రోజుల్లో అండం ఫలదీకరణం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి?, వైట్ డిశ్చార్జి, మానసిక స్థితిలో మార్పులు, అండం విడుదల లేదా ఓవల్యూషన్ సమయం, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి లాంటి విషయాలన్నీ తెల్సుకోవచ్చు. అలాగే మీ ఫ్లో యాప్ అకౌంట్‌తో మీ భాగస్వామి అకౌంట్ కూడా లింక్ చేయవచ్చు. దానిద్వారా అతనికి కూడా మీ ప్రెగ్నెన్సీ, ఓవల్యూషన్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇద్దరికీ అవగాహన ఉంటుంది. అలాగే మీకు సెక్స్,పీరియడ్స్, బర్త్ కంట్రోల్ లాంటి విషయాల్లో ఉన్న వ్యక్తిగత సందేహాలను సీక్రెట్ చాట్ ద్వారా యాప్‌లో ఉన్న ఇతర గ్లోబల్ కమ్యూనిటీతో మాట్లాడొచ్చు.
ఓవల్యూషన్ & పీరియడ్ ట్రాకర్ (Ovulation & Period tracker):
ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంది ?, తర్వాత పీరియడ్ ఎప్పుడు రానుంది ?, అలాగే ఓవల్యూషన్ గురించి సింపుల్ గా తెల్సుకోవాలనుకుంటే ఈ యాప్ వాడొచ్చు. చివరి పీరియడ్ తేదీ మర్చిపోకుండా ఈ యాప్ మీకు గుర్తుచేస్తుంది. మీరు మీ పీరియడ్స్ గురించి ఇచ్చిన సమాచారం బట్టి కచ్చితమైన పీరియడ్ డేట్ చెబుతుంది. ఈ యాప్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ప్రతి తేదీ దగ్గర నోట్స్ రాసుకునే వీలుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే యాప్‌ను ప్రెగ్నెన్సీ మోడ్ లోకి మార్చేయొచ్చు.
మైలో ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ యాప్ (Mylo pregnancy & parenting app):
ఈ యాప్ ప్రెగ్నెన్సీ టిప్స్ అందించడంతో పాటు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కావాల్సిన సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకం, పిల్లల ఎదుగుదల, పిల్లల పేర్లు, స్కానింగ్ సూచనలు, పిల్లలకు కావాల్సిన వస్తువుల షాపింగ్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది నెలల్లో సమయాన్ని బట్టి కొన్ని ఆర్టికల్స్, వీడియోలు దీంట్లో చూడొచ్చు. ప్రెగ్నెన్సీతో పాటూ ఇది పేరెంటింగ్ యాప్ కూడా. అవసరాన్ని బట్టి ఈ యాప్ వాడొచ్చు.