First period in girls: పీరియడ్స్ గురించి ఆడపిల్లలకు ఏ వయసులో చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా సిద్ధం చేయాలి?
First period in girls: ఆడపిల్లకు మొదటి పీరియడ్స్ గురించి చెప్పి సిద్దం చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్లని సిద్దం చేయాలి. వాళ్లతో ఏం మాట్లాడాలి, వాళ్లని ఎలా సిద్దం చేయాలో తెల్సుకోండి.
ప్రతి ఆడపిల్ల యుక్త వయస్సులోకి రాగానే తల్లిదండ్రుల మనసులో చాలా రకాల ఆలోచనలు మొదలవుతాయి. అందులో మొదటిది పిల్లలకు రజస్వల లేదా వాళ్లకు రాబోయే మొదటి పీరియడ్స్ గురించి చెప్పడం. దాన్ని ఏ వయసులో చెప్పాలో, ఎలా చెప్పాలో.. ఎలాంటి భయం లేకుండా వాళ్లను ఎలా సిద్ధం చేయాలో వివరంగా తెల్సుకోండి.
అమ్మాయిలు 8 నుంచి 13, 14 ఏళ్ల వయసు మధ్యలో రజస్వల అవుతారు. కాబట్టి ఈ వయసు కన్నా ముందే వాళ్ల శరీరంలో వస్తున్న కొన్ని మార్పులను గమనించి వాళ్లకు పీరియడ్స్ గురించి చెప్పాలి. ఛాతీ దగ్గర మార్పు, కొంతమందిలో మొటిమలు రావడం, వజైనల్ డిశ్చార్జి అవ్వడం.. కనిపిస్తే వాళ్లకు పీరియడ్స్ గురించి మరింత వివరంగా చెప్పాలి.
పీరియడ్స్ గురించి ఎలా చెప్పాలి?
కొంద మంది పిల్లలకు ఈ విషయం గురించి అడగాలని ఉన్నా భయపడతారు, మొహమాట పడతారు. కాబట్టి మీరే వాళ్లతో ఫ్రీగా మాట్లాడండి. వజైనా దగ్గరనుంచి రక్త స్రావం అవుతుందని, 3 రోజుల నుంచి 6 లేదా 7 రోజుల వరకు అలాగే ఉండొచ్చని చెప్పండి. రక్తం చూసి భయపడకూడదని చెప్పండి. అదేమీ అనారోగ్య సూచన కాదని వివరించండి.
అలాగే రక్తం బట్టలకు అంటుకుని, అసౌకర్యంగా అనిపించకూడదు కాబట్టి ప్యాడ్స్ లేదా టాంపన్లు, కప్స్ వాడాలి అని వివరించండి. మీరు చెప్పింది విని మీ అమ్మాయి ఏవైనా ప్రశ్నలు అడిగితే ఎలాంటి మొహమాటం లేకుండా స్పష్టంగా, వివరంగా చెప్పగలగాలి. మీరు మొహమాటంగా, ఏదో అసౌకర్యంతో చెబితే వాళ్లు కూడా అలాగే ఫీల్ అవుతారు. మీతో మరోసారి ఈ విషయం గురించి మాట్లాడరు. వాళ్ల ఇబ్బందులు చెప్పరు. కాబట్టి పీరియడ్స్ అంటే చెడు విషయం కాదని, కేవలం శరీర మార్పుల వల్ల జరిగే ఒక ప్రక్రియ అని చెప్పండి.
అలాగే కొంతమందిలో మొదటి పీరియడ్స్ వచ్చే ముందు తలనొప్పి, పొత్తి కడుపులో నొప్పి, రొమ్ములో నొప్పి రావచ్చు. ఈ లక్షణాలేమైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండమని, మీకు తెలియజేయమని చెప్పండి.
పీరియడ్ కిట్:
మొదటి పీరియడ్ వచ్చినప్పుడు మీ అమ్మాయి ఇంటి దగ్గర ఉండకపోవచ్చు. స్కూల్లోనో, ట్యూషన్ లోనో.. ఉండొచ్చు. కాబట్టి తన బ్యాగులో పీరియడ్ కిట్ ఒకటి పెట్టి ఉంచండి. అందులో రెండు మూడు శానిటరీ న్యాప్‌కిన్లు, కొత్త ప్యాంటీ, పాడైన ప్యాంటీ పెట్టడానికి ఒక జిప్ లాక్ బ్యాగ్, వెట్ వైప్స్ పెట్టండి. దాంతో అనవసరమైన ఇబ్బందుల నుంచి వాళ్లని రక్షించినవాళ్లవుతారు.
ప్యాడ్స్ గురించి ఏం చెప్పాలి?
చాలా మంది సరైన అవగాహన లేక ప్యాడ్‌ను ప్యాంటీకి కాకుండా బ్యాండ్ ఎయిడ్ లాగా వజైనాకు అంటించేసుకుంటారు. మొహమాటంతో ఈ అసౌకర్యాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ప్యాడ్ అండర్ వేర్‌కి అంటించి ఎలా వాడాలో చూయించండి. ఒకవేళ ట్యాంపన్ అయితే దాన్నెలా వాడాలో కూడా స్పష్టంగా చెప్పండి. ప్రతి 6 గంటలకోసారి ప్యాడ్ మార్చుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని చెప్పండి. పీరియడ్స్ సమయంలో శుభ్రంగా ఉండడం కూడా వాళ్లకు తెలియాలి. ప్యాడ్ మార్చుకున్నాక శుభ్రంగా చేతులు కడుక్కోమనండి.
టాపిక్