Cobbler’s Pose: ఈ ఒక్క ఆసనంతో నడుము నొప్పికి పూర్తి ఉపశమనం.. 10 నిమిషాలు కేటాయిస్తే చాలు-know about cobblers pose and how this helps in lower back pain relief ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cobbler’s Pose: ఈ ఒక్క ఆసనంతో నడుము నొప్పికి పూర్తి ఉపశమనం.. 10 నిమిషాలు కేటాయిస్తే చాలు

Cobbler’s Pose: ఈ ఒక్క ఆసనంతో నడుము నొప్పికి పూర్తి ఉపశమనం.. 10 నిమిషాలు కేటాయిస్తే చాలు

Koutik Pranaya Sree HT Telugu
Jul 09, 2024 01:00 PM IST

Cobbler’s Pose: వయసుతో సంబంధం లేకుండా నడుము నొప్పి వేధిస్తుందా? అయితే బద్ధ కోణాసనం వేయండి చాలు. చాలా ఉపశమనం దొరుకుతుంది. ఆ ఆసనం గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

బద్ధకోణాసనం
బద్ధకోణాసనం (freepik)

కోబ్లర్స్ పోజ్ వల్ల నడుము నొప్పికి ఉపశమనం ఉంటుంది. దీన్నే బద్ధ కోనాసనం అని కూడా అంటారు. బరువున్న వస్తువులు ఎత్తినా, అసౌకర్యమైన భంగిమలో నిద్ర పోయినా, ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా, వీపుమీద వేసుకున్న బ్యాగు సరిగ్గా లేకపోయినా  కూడా నడుం నొప్పి రావచ్చు. ఈ నొప్పిని తగ్గించడానికి ఈ ఒక్క ఆసనం బాగా పనిచేస్తుంది.

బద్ధ కోనాసనం అంటే ఏమిటి?

దీన్ని ఆంగ్లంలో కోబ్లర్స్ పోజ్ అనడానికి కారణం ఉంది. కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవారు. చెప్పు కుట్టేటప్పుడు రెండు అరికాళ్ల మధ్య పెట్టి గట్టిగా పట్టుకుని కుడతారు. అచ్చం ఈ ఆసనంలో అలాగే కూర్చుంటారు కాబట్టి దీనికి కోబ్లర్ పోజ్ అని పేరు పెట్టారు. బద్ధ కోనాసనం అనే పేరు మనకూ ఉంది. ఈ ఆసనాన్ని ప్రెగ్నెన్సీ సమయంలోనూ సూచిస్తారు. దాన్నే బటర్ ఫ్లై ఎక్సర్ సైజ్ అంటారు. కాకపోతే దీంట్లో ఇదే ఆసనంలో కూర్చుని కాళ్లను వేగంగా పైకీ కిందకి కదిలిస్తూ ఉంటారు. ఈ ఆసనానికీ, దానికి ఉన్న తేడా అదే.

ఈ ఆసనం నడుము నొప్పిని ఎలా తగ్గిస్తుంది?

దీర్ఘాకాలికంగా వేధిస్తున్న నడుము నొప్పిని తగ్గించడానికి ఈ ఆసనం మేలు చేస్తుంది. 2016 లో పబ్లిష్ చేసిన జర్నల్ లో ఆఫ్ ఆర్థోపెడిక్స్, ర్యూమటాలజీ ప్రకారం యోగా నడుం నొప్పి తగ్గించడానికి సమర్థవంతమైన మార్గమని చెప్పారు. ఈ భంగిమ హిప్ కండరాలను సాగేలా చేసి, వెనుక భాగంలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

దిగువ పొత్తికడుపు,కటి కండరాలను బలోపేతం చేయడం ద్వారా, ఇది పూర్తి భంగిమ మెరుగుపడేలా చేస్తుంది. దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది. తుంటి, తొడల ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. నడుము మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. పొత్తికడుపులో కండరాలు బలపడేలా చేస్తుంది. దిగువ శరీర భాగాల్లో రక్త ప్రసరణను పెంచుతుంది.

బద్ధకోణాసనం ఎలా చేయాలి?

1. ముందుగా యోగా మ్యాట్ మీద కూర్చోవాలి. కాళ్లను నిదానంగా ముందుకు చాపుకోవాలి. పాదాలు ఒకదానితో ఒకటి తాకాలి. బొటనవెేళ్లు పైకి ఉండాలి.

2. చేతులను సమాంతరంగా ఉంచి అరచేతులను భూమికి ఆనించాలి.

3. నిటారుగా కూర్చుని చాతీని కాస్త ముందుకు వంచి మీ గడ్డం భాగం కాస్త లోపలికి ఆనించాలి. ఎదురుగా మీ చూపు ఉండాలి.

4. ఇప్పుడు మెల్లిగా మీ రెండు కాళ్లను మీ శరీరం వైపు తీసుకురావాలి. పాదాలు ఒకదానితో ఒకటి తాకేలా మోకాళ్లను మడిచి కూర్చోవాలి.

5. బొటనవేళ్లు మాత్రం కాస్త బయటివైపు చూస్తున్నట్లు ఉండాలి. పాదాలను మీ యోని ప్రాంతానికి దగ్గరగా తీసుకెళ్లాలి. అరికాళ్లు శరీరానికి ఒత్తినట్లు అవ్వాలి. మీ సౌకర్యాన్ని బట్టి పాదాలను చేత్తో పట్టుకోవచ్చు. లేదంటే అవసరం లేదు.

6. ఈ స్థితిలోకి వచ్చాక మీ చేతులను మోకాళ్ల మీద పెట్టి వాటిని నేలను తాకేలా కిందికి ఒత్తాలి. దీనివల్ల తొడ కండరాలు బాగా సాగగలుగుతాయి.

7. ఈ స్థితిలో కనీసం రెండు నిమిషాలుండాలి. నిదానంగా శ్వాస తీసుకోవాలి.

8. ఈ స్థితి నుంచి బయటకు రావడానికి మోకాళ్ల మీద చేతులను తీసేసి కాళ్లను మెల్లగా ముందుకు చాపాలి.

9. ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లను నేలకు తాకేలాగా చూసుకోవాలి. దీనివల్ల కండరాల మీద ఒత్తిడి పడి మంచి ఫలితాలుంటాయి. అలాగే నిటారుగా కూర్చోవడం మర్చిపోవద్దు. లేదంటే అనవసరమైన ఒత్తిడి నడుముమీదే ఎక్కువ పడుతుంది.

ఈ ఆసనం ఎవరు చేయకూడదు?

కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయకూడదు. దీనివల్ల మోకాళ్లలో నొప్పి మరింత ఎక్కువవుతుంది. నడుము, మోకాళ్లలో గాయాలు ఏవైనా సర్జరీలు అయినవాళ్లు ఈ ఆసనం చేయకూడదు. దీనివల్ల సమస్య పెరగవచ్చు.

WhatsApp channel