Dates: ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని విరమిస్తారు, ఎందుకు?
Dates: రంజాన్ నెలలో ప్రతిరోజూ ఉపవాసం చేస్తారు ముస్లిం సోదరులు. వారు తమ ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ముగిస్తారు. ఇలా ఖర్జురాలనే ఎందుకు తింటారు?
Dates: రంజాన్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో ఖర్జూరాలు అధికంగా అమ్ముడవుతాయి. ప్రతి ముస్లిం సోదరుని ఇంట్లోనూ ఖర్జూరాలు కచ్చితంగా ఉంటాయి. అది వారికి ఆచారంగా వస్తోంది. సూర్యాస్తమయం అయ్యాక ఉదయం నుంచి చేసిన ఉపవాసాన్ని ఖర్జూరాలతోనే ముగిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఇలా ఉపవాసాన్ని ముగించేందుకు ఖర్జురాలనే ఎందుకు తింటారు? అన్నది ఎంతో మందికి ఉన్న సందేహం.
రంజాన్ నెలలో ఖర్జూరాలు
ఖర్జూరాలను తిని ఉపవాసాన్ని ముగించడం అనే సంప్రదాయం మహమ్మద్ ప్రవక్త జీవించిన కాలం నుండి సాగుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రవక్త తన ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని, నీరు తాగి... ముగించేవారని అంటారు. అప్పటినుంచి ఆ అలవాటు సాంప్రదాయంగా మారిపోయిందని చెబుతారు. ఖర్జూరాలు తిని ఉపవాసాన్ని ముగించడం అనేది ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒకటిగా మారింది.
రంజాన్ ఉపవాసాన్ని ఖర్జూరాలతో ముగించడంలో ఆధ్యాత్మిక సంబంధమే ప్రధానమైనది. అయితే ఇలా ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉపవాసాన్ని విరమించడానికి ఖర్జూరాలే మంచి ఎంపిక. ఖర్జూరాలు సహజంగానే తీపిగా ఉంటాయి. కొన్ని గంటల పాటు ఉపవాసం ఉన్న తర్వాత శరీరంలోని శక్తి క్షీణిస్తుంది. వెంటనే శక్తి అందాలంటే ఖర్జూరాలు తినడం చాలా మంచిది. ఖర్జూరంలోని సహజ చక్కెరలు అయినా గ్లూకోజ్, ఫ్రక్టోజ్... వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శక్తిని అందిస్తాయి. కాబట్టి ఉపవాసం వల్ల వచ్చే నీరసం ఖర్జూరాలు తినడం వల్ల త్వరగా తగ్గుతుంది.
ఖర్జూరాలలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు నిండి ఉంటాయి. వీటిని పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు ఉపవాసం ఉన్న తర్వాత శరీరానికి పోషకాలు అందడం చాలా ముఖ్యం. కాబట్టి ఖర్జూరాలు తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.
ఖర్జూరాలలో ఈ చక్కెరలు సులభంగానే జీర్ణమవుతాయి. సులువుగా జీర్ణమయ్యే ఆహారాలతో ఉపవాసాన్ని విరమించడం వల్ల జీర్ణవ్యవస్థలో ఎలాంటి అసౌకర్యం రాకుండా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యం బాగుంటుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. పేగులకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఖర్జూరాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువ. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. ప్రతిరోజూ కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల మన శరీరానికి కావలసిన అన్ని అవసరాలు తీరుతాయి. అయితే రంజాన్ మాసంలో మాత్రం ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించడం అనేది పూర్తిగా మతపరమైన సంప్రదాయం. ఇది ఇస్లామిక్ సాంప్రదాయంలో లోతుగా పాతుకు పోయింది. ఏ ముస్లింలు అయినా మొదటగా ఖర్జురాలు తిన్నాక ఉపవాసాన్ని ముగిస్తారు. ఖర్జూరాలు కాకుండా ఇతర ఆహారాలను తింటే ఉపవాసాన్ని ఉల్లంఘించినట్టే.