Ramadan 2024: రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇఫ్తార్ విందు వివరాలు ఇవిగో?-ramadan 2024 when does the month of ramadan begin here are the details of iftar dinner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ramadan 2024: రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇఫ్తార్ విందు వివరాలు ఇవిగో?

Ramadan 2024: రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇఫ్తార్ విందు వివరాలు ఇవిగో?

Haritha Chappa HT Telugu
Mar 05, 2024 12:00 PM IST

Ramadan 2024: ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఈ మాసంలో ముస్లిం సోదరులంతా అతి పవిత్రంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు.

రంజాన్ మాసం ప్రత్యేకత
రంజాన్ మాసం ప్రత్యేకత (Pixabay)

Ramadan 2024: రంజాన్‌ను ‘రమదాన్’ అని పిలుస్తారు. అలాగే ‘ఈద్ ఉల్ ఫిత్ర’ అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. దానధర్మాలు చేస్తారు. పండుగ అనేది ఏ మతానికి, కులానికి సంబంధించినది అయినా కావచ్చు, దాని వెనుక అద్భుతమైన సందేశం ఉంటుంది. అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం.

ఉపవాసాన్ని ఏమంటారు?

ఖురాన్ లో చెప్పిన ప్రకారం ఈ రమదాన్ నెలలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉపవాసం ఉండాలి. దీన్ని ‘రోజా’ అని పిలుస్తారు. మన దేశంలోని ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి, తెల్లవారిజామున నాలుగు గంటలకు లేచి ‘సహరి’ చేస్తారు. సహరి అంటే భోజనం. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రమదాన్ నెలలో బయట ఏవీ తినకూడదని, తాగకూడదనే ఆచారం ఉంది. అందుకే ఈ నెలంతా ముస్లిం సోదరులు ఇంట్లోనే వండుకొని తింటారు.

జకాత్

రమదాన్ నెలలో చెప్పుకోవలసిన మరొక విశేషం ‘జకాత్’. అంటే దానధర్మాలు చేయడం. రంజాన్ నెలలో జకాత్ చేయాలని ఖురాన్ చెబుతోంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నది జకాత్ నిర్వచనం. ఇది పేదవారికి ఆర్థిక హక్కుగా కూడా చెప్పుకుంటారు. ప్రతి ధనకుడు ఇలా తన సంపాదనలో 30% పేదలకు దానంగా ఇవ్వాలని జకాత్ చెబుతోంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను నిర్వహించకుంటారన్నది ఖురాన్ సారాంశం.

రమదాన్ నెల... నెలవంక పొడిచాక ముగుస్తుంది. ఆ చివరి దినాన్ని ఈద్-ఉల్-ఫితర్ పండుగగా నిర్వహించుకుంటారు. ఆరోజు అందరూ కొత్త బట్టలతో అత్తరు చల్లుకొని ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈద్ ముబారక్ అని విషెస్ చెప్పకుంటారు.

రంజాన్ ఎప్పుడు మొదలవుతుంది?

రంజాన్ ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ లో తొమ్మిదవ నెలలో మొదలవుతుంది. రంజాన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలో రంజాన్ మార్చి 11 లేదా మార్చి 12న మొదలవుతుంది. మక్కాలో చంద్రుని దర్శనంపై రంజాన్ ఆధారపడి ఉంటుంది. నెలవంక ఆకారంలో చంద్రుడు మొదట సౌదీ అరేబియాలో దర్శనమిస్తాడు. తరువాత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపిస్తాడు. అలా నెలవంక కనిపించాక రంజాన్ మొదలైనట్టే.

ఇఫ్తార్ ఎప్పుడు?

ప్రతిరోజూ ఇఫ్తార్ సమయాలు సూర్యాస్తమయం మీద ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజూ ఏ సమయంలో సూర్యాస్తమయం అవుతుందో ...అప్పుడు ఇఫ్తార్ నిర్వహించుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఇదే సమయానికి ఇఫ్తార్ అని చెప్పడానికి వీలు లేదు.

టాపిక్